కెన్యాలో ప్లాస్టిక్ నిషేధం: ప్లాస్టిక్ సంచులు కొన్నా, అమ్మినా నాలుగేళ్ల జైలు శిక్ష

  • 13 నవంబర్ 2018
పిల్లలు Image copyright Getty Images

అది పశ్చిమ కెన్యాలోని ఓ మార్కెట్. తుపాకులు చేతపట్టి పోలీసులు దిగారు.. వారిని చూడగానే ఒక్కసారిగా అలజడి. జనం పరుగులు తీస్తున్నారు. కొందరు దుకాణదారులు హడావుడిగా కొన్ని వస్తువులను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాపారులు, కొనుగోలుదారులు అందరిలోనూ ఆందోళన.. ఎవరికివారు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు తుపాకులు గురిపెట్టి దుకాణాలను, మనుషులను తనిఖీ చేస్తున్నారు.

ఇంతకీ వాళ్లు వెతుకుతున్నది డ్రగ్స్ కోసమో... అక్రమ ఆయుధాల కోసమో కాదు. ప్లాస్టిక్ సంచుల కోసం. అవును.. మార్కెట్లో సరకులు కొనేవారికి దుకాణదారులు ప్లాస్టిక్ సంచుల్లో విక్రయిస్తున్నారేమోనని, అలాంటి సంచుల్లో సరకులు తీసుకెళ్తున్నారేమోనని క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

ప్లాస్టిక్ సంచుల తనిఖీలకే జనం అంతగా భయపడడానికి కారణం ఉంది. దొరికితే నాలుగేళ్లు జైలులో గడపాల్సిందే. అవును.. కెన్యాలో ప్లాస్టిక్ నిషేధ చట్టం అంత కఠినమైనది మరి.

ఏడాదిగా కఠిన చర్యలు

కెన్యాలో 2017 ఆగస్టులో ప్లాస్టిక్ సంచులపై నిషేధం అమల్లోకి వచ్చింది.

ఎవరైనా పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ సంచులను వాడితే వారికి 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు.

జేమ్స్ వకీబియా అనే ఓ సామాజిక కార్యకర్త ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంపై ఒక ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ప్రచారానికి కెన్యాలో మంచి ఆదరణ లభించింది.

నిషేధం తరువాత ఇప్పుడు కెన్యాలో సరికొత్త బ్యాగులు మార్కెట్లోకి వచ్చాయి. వాటిలోనూ ప్లాస్టిక్ బ్యాగులున్నాయి. అయితే.. ఆ కొత్తరకం ప్లాస్టిక్ సంచులు పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించవు. వీటి ఖరీదు కాస్త ఎక్కువే అయినా, పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రజలు వీటిని కొంటున్నారు.

Image copyright Getty Images

నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారూ ఉన్నారు

అయితే కెన్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా .. ప్లాస్టిక్ సంచులను నిషేధించడం వల్ల, చాలామంది ఉపాధి కోల్పోయారని, ఈ రంగానికి సంబంధించిన పెట్టుబడులన్నీ పొరుగు దేశాలకు తరలి వెళ్లాయని తయారీదారులు విమర్శిస్తున్నారు.

కెన్యాలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నా, ఇంకా కొన్ని చోట్ల ప్లాస్టిక్ కవర్లను అక్రమంగా విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

కెన్యా కంటే ముందు రువాండా తమ దేశంలో ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించింది. కొన్ని ఐరోపా దేశాలు మాత్రం, ప్లాస్టిక్ కవర్లను నిషేధించడానికి బదులు, వాటిపై పన్ను విధించాయి.

ప్రపంచంలోనే మొదటిసారిగా ప్లాస్టిక్ కవర్లపై నిషేధించిన దేశం బంగ్లాదేశ్. 2002లో బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు