ఐర్లండ్ తీరంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువులు: విమానాలపైకి ‘చాలా ప్రకాశవంతమైన వెలుగు’.. పరిశోధిస్తున్న ఐర్లండ్

  • 12 నవంబర్ 2018
యూఎఫ్ఓలు Image copyright Science Photo Library
చిత్రం శీర్షిక ఐర్లండ్ తీరంలో పైలట్లు ఏం చూసి ఉంటారు?

ఐర్లండ్ నైరుతి తీరంలో గుర్తు తెలియని ఎగిరే వస్తువులు (అనైడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ - యూఎఫ్ఓలు) కనిపించాయన్న వార్తలపై ఆ దేశ విమానయాన సంస్థ దర్యాప్తు చేపట్టింది.

శుక్రవారం ఉదయం 06:47 గంటలకు (స్థానిక కాలమానం) బ్రిటిష్ ఎయిర్‌వేస్ పైలట్ ఒకరు.. షానాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సంప్రదించారు.

ఆ ప్రాంతంలో ఏదో ‘‘చాలా వేగంగా కదులుతోంద’’ని చెప్తూ.. అక్కడ ఏమైనా సైనిక విన్యాసాలు జరుగుతున్నాయా అని ఆమె ఏటీసీని అడిగారు.

అటువంటి విన్యాసాలేవీ జరగటం లేదని ఏటీసీ బదులిచ్చింది.

ఆ మహిళా పైలట్ నడుపుతున్న విమానం.. కెనడాలోని మాంట్రియల్ నుంచి బ్రిటన్‌లోని లండన్ హీత్రూ విమానాశ్రయానికి ప్రయాణిస్తోంది.

‘‘చాలా ప్రకాశవంతమైన వెలుగు’’తో పాటు ఆ వస్తువు తన విమానం ఎడమవైపు వచ్చిందని.. అక్కడి నుంచి ‘‘శరవేగంగా ఉత్తరానికి మళ్లింద’’ని ఆమె చెప్పారు.

అది ఏమిటన్నది ఆమెకు అంతుచిక్కలేదు. అయితే.. అది తమ విమానాన్ని ఢీకొట్టటానికి వచ్చినట్లు కనిపించలేదని చెప్పారు.

వర్జిన్ విమానం నడుపుతున్న మరో పైలట్ ఈ సంభాషణలో జత కలిసి.. అది అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న గ్రహశకలం అయిఉండవచ్చునని సూచించారు.

Image copyright Twitter

‘‘అదే తరహా ప్రయాణ మార్గాన్ని అనుసరించిన అనేక వస్తువులు’’ ఉన్నాయని ఆయన చెప్పారు. అవి చాలా ప్రకాశవంతంగా ఉన్నాయనీ పేర్కొన్నారు.

తాను ‘‘రెండు ప్రకాశవంతమైన వెలుగుల’’ను చూశానని. అవి చాలా వేగంగా పైకి దూసుకెళ్లాయని ఆ పైలట్ చెప్పారు.

ఆ వేగం ‘‘అనూహ్యంగా ఉంది.. అది మాక్ 2 వేగం లాగా ఉంది’’ అని ఒక పైలట్ పేర్కొన్నారు. ధ్వని వేగం కన్నా రెండు రెట్లు అధిక వేగాన్ని మాక్-2 గా వ్యవహరిస్తారు.

‘‘అసాధారణ వైమానిక కార్యకలాపాల గురించి కొన్ని విమానాల నుంచి నవంబర్ 9వ తేదీన వచ్చిన రిపోర్టుల నేపథ్యంలో ఒక ఫిర్యాదును నమోదు చేశాం’’ అని ఐరిష్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.

దీనిపై దర్యాప్తు నిర్వహిస్తామని పేర్కొంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఅమెరికా యుద్ధ విమానాల నుంచి చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియోలో ఎగురుతున్నది ఏంటి?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు