బ్రెగ్జిట్: యురోపియన్‌ యూనియన్‌ను వదిలేస్తున్న బ్రిటన్... ఎందుకు? ఏమిటి? ఎలా?

  • 15 నవంబర్ 2018
జెండాలు Image copyright Getty Images

బ్రెగ్జిట్... చాలా కాలంగా యురోపియన్ దేశాలను కుదిపేస్తోన్న పదం ఇది. తాజాగా బ్రెగ్జిట్‌ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఆమోదించారు. ఈ ముసాయిదా గురించి థెరిసా బుధవారం నాడు తమ క్యాబినెట్ మంత్రులతో చర్చించారు. ‘బ్రెగ్జిట్‌’కు సమయం చాలా దగ్గర పడిందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్‌ గురించి తెలుసుకోవాల్సిన పది విషయాలు.

1. ఏంటీ బ్రెగ్జిట్?

యురోపియన్ యూనియన్ దేశాల్లో యూకే కూడా ఓ భాగస్వామి. కానీ, ఇప్పుడు ఆ యురోపియన్ యూనియన్ నుంచి యూకే వైదొలగనుంది. అలాంటి యూనియన్ నుంచి 'బ్రిటన్’, 'ఎగ్జిట్'(తప్పుకోవడం) అవ్వడాన్నే 'బ్రెగ్జిట్' అని పిలుస్తున్నారు. దీన్ని, బ్రిటన్‌కు ఇతర యురోపియన్ యూనియన్ దేశాలకు మధ్య విడాకులుగా కూడా అభివర్ణిస్తున్నారు.

2. ఎలా విడిపోతోంది?

యురోపియన్ యూనియన్‌లో యూకే కొనసాగాలా వద్దా అనే దానిపై 2016, జూన్ 23న రెఫరెండం నిర్వహించారు. ఆ రెఫరెండంలో 71.8శాతం, అంటే 3 కోట్లమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా 51.9శాతం మంది ఓటేశారు. 48.1శాతం మంది బ్రిటన్ యురొపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని కోరుకున్నారు.

3. ఎప్పుడు విడిపోతుంది?

2019 మార్చి 29, శుక్రవారం రాత్రి 11గంటలకు యురోపియన్ యూనియన్ నుంచి అధికారికంగా విడిపోవడానికి బ్రిటన్ కట్టుబడి ఉంది. బ్రెగ్జిట్ అనంతర పరిణామాలకు సంబంధించిన ఒప్పందాన్ని థెరిసా మే ప్రభుత్వంతో పాటు యురోపియన్ యూనియన్‌లోని 27 ఇతర దేశాలు ఆమోదించాల్సి ఉంది.

Image copyright Getty Images

4. ఎందుకు విడిపోతోంది?

యురోపియన్ యూనియన్‌లో ఉన్న కారణంగా తాము వెనకబడిపోతున్నట్లు బ్రిటన్ భావిస్తోంది. వ్యాపార విషయాల్లో అనేక పరిమితులు విధిస్తున్నారని, సభ్యత్వ రుసుం కింద ఏటా వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, కానీ దానికి సరైన ప్రతిఫలం దక్కట్లేదని ఆ దేశం చెబుతోంది. ఇతర ఈయూ దేశాల నిర్ణయాలపై ఆధారపడ్డ చట్టాలు కాకుండా మొత్తంగా కొత్త చట్టాలను రూపొందించుకోవాలని కూడా బ్రిటన్ చూస్తోంది.

బ్రిటన్ తన సరిహద్దుల విషయంలో పూర్తి నియంత్రణ పొందాలని, స్థిరపడటానికి, పనిచేయడానికి బ్రిటన్ వచ్చే వారి సంఖ్యను తగ్గించాలని బ్రెగ్జిట్ మద్దతుదారులు కోరుకుంటున్నారు.

'స్వేచ్ఛాయుత గమనం' అన్నది ఈయూ సభ్యత్వ ప్రధాన సూత్రం. అంటే, ఇతర ఈయూ దేశంలోకి వెళ్లి జీవించాలంటే ఎలాంటి వీసా అవసరం లేదు.

5. యురోపియన్ యూనియన్ అంటే ఏంటి?

వాణిజ్య, రాజకీయ సహకారం కోసం వివిధ దేశాల భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమే యురోపియన్ యూనియన్. ఇందులో ప్రస్తుతం యూకేతో కలిపి 28 దేశాలున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దేశాల మధ్య వాణిజ్యపరమైన సహకారం కోసం యురోపియన్ యూనియన్ ఆవిర్భవించింది. ఒకదానితో ఒకటి వ్యాపారం చేసే దేశాలు పరస్పరం యుద్ధానికి దిగబోవన్నదే ఈ యూనియన్ ఏర్పాటు వెనకున్న ఉద్దేశం.

యూనియన్‌లోని అన్ని దేశాల మధ్య ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తిరగొచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు. యూనియన్‌లోని 19 దేశాలు 'యూరో'ను కరెన్సీగా ఉపయోగిస్తాయి. దానికి సొంతంగా పార్లమెంటుతో పాటు పర్యావరణం, రవాణా, వినియోగదారుల హక్కులు లాంటి అనేక అంశాల్లో స్వతంత్ర నియమ నిబంధనలున్నాయి.

6. రెఫరెండం తరువాత ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది?

2016 జూన్‌లో బ్రెగ్జిట్ రెఫరెండం ముగిసన అనంతరం థెరిసా మే బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె బ్రిటన్ హోం మంత్రిగా ఉండేవారు. నాటి ప్రధాని డేవిడ్ కామెరూన్ యూకే, యురోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని కోరుకునేవారు. కానీ, రెఫరెండంలో ఆ వాదనకు బలం లభించకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. థెరిసా మే ఆయన స్థానంలో బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టారు.

యురోపియన్‌ యూనియన్‌కు యూకే చెల్లించాల్సిన రుణం, ఉత్తర ఐర్లాండ్ సరిహద్దు అంశం, ఈయూలో ఉండే యూకే ప్రజలు-యూకేలో ఉంటున్న ఈయూ ప్రజల భవిష్యత్తు... 'విడాకుల'కు సంబంధించిన ఈ మూడు ప్రధాన అంశాలపై యూకే, ఈయూలు తాత్కాలికంగా ప్రస్తుతం ఓ అంగీకారానికి వచ్చాయి. బ్రెగ్జిట్ ప్రక్రియ సజావుగా పూర్తవడానికి రెండు పక్షాలు 21 నెలల 'పరివర్తనా' కాలానికి అంగీకరించాయి.

7. బ్రెగ్జిట్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందా?

43ఏళ్ల ఒప్పందాలు, వేలాది అంశాలపై జరిగిన ఒడంబడికల నుంచి వైదొలగడం అంత సులువు కాదు. బ్రెగ్జిట్ అనంతరం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అంశమే ప్రస్తుతం అత్యంత క్లిష్టంగా మారింది. ఈ వ్యాపార ఒప్పందంపై యూరప్‌లోని 30 దేశాలు, పార్లమెంట్‌లు అంగీకారం తెలపాలి. వీటిలో కొన్ని దేశాలు స్వతంత్రంగా తమ దేశాల్లోనూ రెఫరెండంలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాయి. అందుకే బ్రెగ్జిట్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Image copyright Getty Images

8. వ్యాపార ఒప్పందాలు లేకపోతే ఏమవుతుంది?

యురోపియన్ యూనియన్‌కు, యూకేకు మధ్య వ్యాపార ఒప్పందం జరగకపోతే, బ్రెగ్జిట్ అనంతరం 'వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్' నియమాలకు అనుగుణంగా వ్యాపారం జరుగుతుంది. దానివల్ల కస్టమ్స్ తనిఖీలు, పన్నులు, ప్రయాణికులకు సరిహద్దుల దగ్గర తనిఖీలు లాంటి అనేక నిబంధనలు అమల్లోకి వస్తాయి.

ఈ పరిస్థితులు తలెత్తకూడదంటే యూకే, ఈయూలు సరైన ఒప్పందంతో విడిపోవడం కీలకం.

9. వీసా అవసరమా?

ఇప్పటిదాకా యురోపియన్ యూనియన్‌లోని దేశాల ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. బ్రెగ్జిట్ తరువాత కూడా ఈయూ నుంచి యూకే వచ్చే పర్యటకులకు వీసా రహిత ప్రయాణం కల్పించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల యూకే ప్రజలు కూడా స్వేచ్ఛగా ఇతర యురోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లే సౌలభ్యం ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన.

కానీ, చదువు, ఉద్యోగం, లేదా స్థిరపడటానికి యూకే వచ్చే యురోపియన్లు మాత్రం బ్రెగ్జిట్ అనంతరం దానికి అనుమతి పొందాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం వాళ్లకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు.

10. గతంలో ఏదైనా దేశం ఈయూను వదిలిందా?

ఇప్పటిదాకా ఏ జాతి రాజ్యం కూడా యురోపియన్ యూనియన్ నుంచి వైదొలగలేదు. కానీ, 1982లో డెన్మార్క్ కౌంటీ గ్రీన్‌లాండ్ రెఫరెండం నిర్వహించింది. అందులో యురోపియన్ కమ్యూనిటీ నుంచి వైదొలగడానికి అనుకూలంగా 52శాతం ఓట్లు లభించాయి. దాంతో ఆ దేశం యురోపియన్ కమ్యూనిటీ నుంచి వైదొలగినా, ఇతర దేశాలతో ఉన్న ఒప్పందాల కారణంగా ఇప్పటికీ యురోపియన్ యూనియన్ ఒప్పందాలకు సైతం లోబడే ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

టర్కీ బహిష్కరించిన ఐఎస్ జిహాదీల పరిస్థితి ఏమిటి... తమ దేశం వద్దంటే వారు ఎటు పోవాలి?

'దెయ్యాలను 12 ట్రక్కుల్లో మూడు రోజుల పాటు మరో చోటుకు తరలించాం'

సోషల్ మీడియాతో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు... ఎలా?

భాయిచంద్ పటేల్: 'ఆ అమ్మాయిలకు తిరగడానికి తెల్లవాళ్ళు, పెళ్లికి మాత్రం మనలాంటి వాళ్లు కావాలి'

ప్రెస్ రివ్యూ: 'జగన్‌తోనే నా ప్రయాణం... చంద్రబాబు ఇసుకదీక్ష సరికాదు' - టీడీపీ ఎమ్మెల్యే వంశీ

కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది...

పాకిస్తాన్: 10 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ మ్యాచ్: శ్రీలంక జట్టుకు ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు

హైదరాబాద్: బడి దగ్గర అన్నం గిన్నెతో చిన్నారి ఫొటో వెనుక నిజాలేమిటి