కశ్మీర్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలకు భారత్ సంతోషించాలా?

  • 15 నవంబర్ 2018
షాహిద్ అఫ్రిది Image copyright Getty Images

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కశ్మీర్ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

కశ్మీర్‌ను భారత్ లేదా పాకిస్తాన్‌ అధీనంలో ఉంచడానికి బదులు ఒక ప్రత్యేక దేశంగా ఉంచాలని అఫ్రిది అన్నాడు.

బ్రిటిష్ పార్లమెంటులో విద్యార్థులతో మాట్లాడిన అఫ్రిది "నేనైతే, పాకిస్తాన్‌కు అసలు కశ్మీర్ అక్కర్లేదనే అంటాను. భారత్‌కు కూడా ఇవ్వకూడదు. కశ్మీర్ స్వతంత్ర దేశం కావాలి. కనీసం మానవత్వమైనా మిగలాలి. అక్కడ ఉన్నవారి మరణాలు ఆగాలి. అది పాకిస్తాన్‌కు అవసరం లేదు. ఉన్న నాలుగు ప్రావిన్సులనే పాకిస్తాన్ చూసుకోలేకపోతోంది" అన్నాడు.

"అక్కడ అలా జనం మరణిస్తుంటే, కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా మనిషి చనిపోతే, తను ఏ మతం వాడైనా, బాధగా ఉంటుంది".

అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. వీటి ద్వారా "కశ్మీర్‌ మాది అనడం వదులుకోవాలని అఫ్రిది పాకిస్తాన్‌కు చెప్పాలని అనుకున్నట్టు" భారత మీడియాలోని కొన్ని పత్రికలు, చానళ్లు చెప్పాయి.

Image copyright Getty Images

వ్యాఖ్యలపై అఫ్రిది వివరణ

కానీ భారత మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపిస్తూ షాహిద్ అఫ్రిది ట్వీట్ చేశాడు.

"నా క్లిప్ అసంపూర్తిగా ఉంది. దాని ముందు చెప్పిన సందర్భాన్ని తీసేసి చూపిస్తున్నారు. అది ఇందులో లేదు. కశ్మీర్ ఒక అపరిష్కృత అంశం. అది భారత్ క్రూర ఆక్రమణలో ఉంది. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం దానిని పరిష్కరించుకోవాలి. కశ్మీర్ స్వతంత్ర పోరాటానికి నాతోపాటు ప్రతి పాకిస్తానీ మద్దతుగా నిలుస్తాడు. కశ్మీర్ పాకిస్తాన్‌దే" అని అఫ్రిది పోస్ట్ చేశాడు.

అంతకు ముందు అఫ్రిది "నా ప్రకటనను భారత మీడియా వక్రీకరించింది. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా. కశ్మీరీల పోరాటాన్ని కూడా గౌరవిస్తున్నాను. మానవత్వం గెలవాలి. వారికి వారి హక్కులు లభించాలి" అన్నాడు.

అఫ్రిది వ్యాఖ్యలపై విమర్శలు

కానీ అఫ్రిది వివరణ ఇవ్వక ముందే అతడి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తం కావడం ప్రారంభమైంది.

సోహెల్ చీమా అనే యూజర్ తన ట్విటర్‌లో "షాహిద్ అఫ్రిది భారత్ మార్కెట్‌లో చోటు సంపాదించేందుకు తపించిపోతున్నాడు. స్వార్థంతో భారతీయులను సంతోషపరచాలనుకుంటున్నాడు. అతడు తన క్రికెట్ కెరీర్ అంతా స్వార్థం కోసమే ఆడాడు. ఇప్పుడు క్రికెట్ కెరీర్ ముగిసేసరికి భారతీయులను సంతోషపెట్టాలని దేశం పరువును బజారుకీడ్చాడు" అన్నాడు

"షాహిద్ అఫ్రిదీ.. మీ మాటల్లో ఎలాంటి తత్వం, ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. బదులుగా వాటిలో అతి-ఆత్మవిశ్వాసం ఉంది. దానివల్ల పాకిస్తాన్‌కు అవమానం జరిగింది. భారతదేశమంతా మనల్ని నవ్వులపాలు చేసింది" అని ఇస్లామాబాద్‌కు చెందిన ఒజిర్ అలీ సయ్యద్ ట్వీట్ చేశాడు.

జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా భారత్‌ను సంతోషపెట్టేలా అఫ్రిది ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని అన్నారు.

ఆయన తన ట్విటర్‌లో "భారత మీడియాలో ఏ భాగం వారికి అఫ్రిది చెప్పిన మాటలు సంతోషం కలిగించాయో నాకైతే అర్థం కావడం లేదు. అతడు పాకిస్తాన్ నాలుగు ప్రాంతాల గురించి చెప్పిన విషయం, పక్కనపెడదాం. నేను చూసిన బైట్‌లో తను స్పష్టంగా కశ్మీర్ స్వతంత్రాన్ని సమర్థించాడు. మానవ హక్కుల ఉల్లంఘనను విమర్శించాడు. అది భారత్ విజయం ఎలా అవుతుంది" అన్నారు.

పాకిస్తాన్‌కు చెందిన ఫాయకా "నాకు అఫ్రిది వ్యాఖ్యల్లో ఏ తప్పూ కనిపించలేదు. మనం నిజంగానే మన నాలుగు ప్రాంతాలను సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. పాలన సరిగా లేదు, అవినీతి, పేదరికం ఉన్నాయి. వారికోసం మనమేమైనా స్వర్గాన్ని అలంకరించి పెట్టామా? ఆ.. కశ్మీరును స్వతంత్రంగా ఉండనివ్వండి" అన్నారు.

"భారత మీడియా షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలను ఎలా చూపిస్తోందో చూడండి. మీరు పూర్తి ఇంటర్వ్యూ చూస్తే అఫ్రిది పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్‌కు అనుకూలంగా మాట్లాడలేదని తెలుస్తుంది. అతడు కశ్మీరీల తరఫున మాట్లాడాడు. కశ్మీరును వదలాలని భారత్‌కు చెప్పాడు. కశ్మీరీలను బతకనివ్వాలని, ఎక్కడికి వెళ్లాలో వాళ్లనే నిర్ణయించుకోనివ్వాలన్నాడు" అన్నారు అబ్దుల్లా అనే మరో యూజర్.

షాహిద్ అఫ్రిది ఇంతకు ముందుకూడా కశ్మీర్ అంశం గురించి కామెంట్ చేశాడు. 2016లో భారత్‌ వచ్చినపుడు మొహాలీ మ్యాచ్ తర్వాత టీవీలో లైవ్‌లో "పాకిస్తానీ క్రికెట్ టీమ్‌కు కశ్మీర్ నుంచి కూడా మంచి మద్దతు లభిస్తోంది" అని చెప్పాడు.

అప్పట్లో ఆ ప్రకటనను భారత మీడియాలో కొన్ని చానళ్లు, పత్రికలు విమర్శించాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ కార్యదర్శి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ కూడా దానిపై అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు