ఇన్‌స్టాగ్రామ్: నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లు ఇక కుదరవు

  • 21 నవంబర్ 2018
ఇన్స్టాగ్రామ్ లోగో Image copyright Getty Images

నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లను నియంత్రించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది.

థర్డ్ పార్టీ సర్వీసులు, కొన్ని యాప్‌లు.. తమ సంస్థ ప్రచారం కోసం ఉపయోగించే అకౌంట్లను కనుగొనడానికి ప్రత్యేకమైన విధానాలను అభివృద్ధి చేశామని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

నిబంధనలను ఉల్లంఘించిన ఖాతాలకు హెచ్చరికలు పంపి, వెంటనే వారి పాస్‌వర్డ్ మార్చుకోవాలని సూచిస్తామని సంస్థ తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా వినియోగదారులు తమ ఉత్పత్తులను కొనేలా కొన్ని సంస్థలు ప్రభావితం చేస్తున్నాయి.

Image copyright Getty Images

నకిలీ ఖాతాల ద్వారా కొన్ని సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నవారికి, ఆ అకౌంట్ల ఫాలోయర్స్ సంఖ్యను బట్టి డబ్బులు చెల్లిస్తారు.

ఈ విధంగా ప్రచారం చేయడం చాలా సులువు అని, మార్కెటింగ్ ఏజెన్సీ 'మీడియా కిజ్' గతేడాది చేసిన ఓ పరిశీలనలో వెల్లడించింది.

తమ ఫాలోయర్స్ సంఖ్యను పెంచుకోవడానికి ఖాతాదారులు వాడే కొన్ని యాప్స్‌ను ఈమధ్యనే తొలగించారు. కానీ ఈ యాప్స్‌కు నెలనెలా డబ్బులు చెల్లిస్తున్న వినియోగదారులు మాత్రం ఇంకా వాటిని వాడగలుగుతున్నారని 'టెక్ క్రన్చ్' వెబ్‌సైట్ తెలిపింది.

ఇలాంటి యాప్స్.. ఖాతాదారుల లాగిన్ సమాచారాన్ని ఇవ్వాలని అడుగుతాయి. కానీ తమ లాగిన్ సమాచారం ఇతరులకు ఇవ్వడం ఇన్‌స్టాగ్రామ్ నిబంధనలకు విరుద్ధం. అలా చేస్తే, వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఇన్‌స్టాగ్రామ్ చెబుతోంది.

Image copyright INSTAGRAM

నకిలీ ప్రచారం కోసం థర్డ్ పార్టీ యాప్స్ వినియోగిస్తున్నవారి అకౌంట్ల పనితీరులో మార్పు రావడం ఖాతాదారులు గమనించవచ్చు అని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.

నకిలీ కామెంట్లు, నకిలీ లైక్‌లను అరికట్టే దిశగా తాము చేస్తున్న ఈ ప్రయత్నం, తమ సంస్థ ప్రతిష్టను కాపాడటంలో మరో అడుగు అని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధులు చెప్పారు.

నకిలీ వార్తలు, నకిలీ వినియోగదారులు, మోసపూరితమైన చర్యలను అరికట్టడానికి సోషల్ మీడియా మాధ్యమాలు చేస్తున్న ప్రయత్నంలో ఇది ఓ తాజా పరిణామం.

Image copyright Getty Images

2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను 100కోట్ల డాలర్లకు ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఈమధ్యనే 100 కోట్ల వినియోగదారుల సంఖ్యను కూడా దాటిన ఇన్‌స్టాగ్రామ్ ఓ ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమంగా నిలిచింది.

గత సెప్టెంబర్‌లో ఫేస్‌బుక్‌ యాజమాన్యంతో వచ్చిన విభేదాల కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌ వ్యవస్థాపకులు తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు