ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్: బోనస్ వస్తువు

  • 27 నవంబర్ 2018
ప్రశ్నార్థకం చిత్రం

మా ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్ ప్రాజెక్టు.. 1978లో అమెరికా స్త్రీవాదుల ప్రఖ్యాత నిరసనకు డిజిటల్ రూపం.

ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తాము కోరుకున్న విధంగా జీవించటానికి అవరోధాలుగా ఉన్నాయని వారు భావిస్తున్న వస్తువులు ఏమిటి అని మేం అడుగుతున్నాం.

ఈ గేమ్‌లోని వస్తువులను.. మా పాఠకులు, శ్రోతలు సూచించినవి. ఈ వస్తువులను మా డిజిటల్ ట్రాష్‌క్యాన్‌లోకి డ్రాగ్ చేయటం ద్వారా, ఇంకా తెలుసుకోవటం కోసం బటన్‌ను క్లిక్ చేయటం ద్వారా వాటి గురించి మరింత చదవవచ్చు.

ఇంకా మీ సూచనలను మేం కోరుతున్నాం.

మతపరమైన వస్త్రధారణ, లింగాన్ని బట్టి ఉండే చిన్నారుల దుస్తులు, వేతన వ్యత్యాసాలను ప్రతిఫలించే పే స్లిప్‌లు కూడా చాలా మంది సూచించారు. అటువంటివి మరి కొన్ని ఇవి...

ఎయిర్‌బ్రిషింగ్

వాణిజ్యప్రకటనలు, సోషల్ మీడియాలకు సంబంధించి చాలా వివాదాస్పదమైన కోణాల్లో ఇది ఒకటి. మనుషులను సన్నగా కనిపించేలా, లోపాలను దాచేసేలా చేసే ఫొటో-ఎడిటింగ్ టెక్నిక్ ఇది.

ఈ సంవత్సరపు బీబీసీ 100 మంది మహిళల్లో ఒకరైన జమీలా జమీల్ వంటి నటులు.. మేగజీన్ ఎడిటర్లు వారి కవర్ ఫొటోలను ఎయిర్‌బ్రష్ చేయవద్దని చెప్తున్నారు. అలా చేయటం వల్ల తమ అభిమానులకు అవాస్తవికమైన శరీరాకృతి ఆకాంక్షలు కలుగుతాయన్నది వారి ఆందోళన.

అయితే.. సోషల్ మీడియా వినియోగదారుల్లో సగం మందికి పైగా తమ ఫొటోలను ఫిల్టర్ చేస్తారని 2015 నాటి అంకెలు చెప్తున్నాయి. మరి.. మేగజీన్ల తప్పు ఎంతుందో మన తప్పూ అంతే ఉందా?

ఫ్యామిలీ ఆర్గనైజర్స్

కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కో కాలమ్ ఉండే క్యాలండర్లు లేదా అందరి అపాయింట్‌మెంట్లు చూసుకునేది ‘అమ్మ’ అని సూచించే డైరీలు.. అన్నీ ఎక్కువగా మహిళలను లక్ష్యంగా చేసుకున్నవే.

స్త్రీవాదులు ‘మానసిక భారం’ అని పిలిచే - ఇంటి పనుల గురించి ఆలోచించటం, ఏం చేయాలన్నది గుర్తుంచుకోవటమనే మానసిక శ్రమను మహిళలు చేపట్టాలని అవి సూచిస్తుంటాయి.

కానీ.. ఇలా ముద్రపడినప్పటికీ.. మాతృత్వంలో అనివార్యమైనవని తాము భావించే పనుల నిర్వహణలో అవి చాలా ఉపయోగపడతాయని చాలా మంది తల్లులు చెప్తున్నారు.

స్త్రీవాదం

అసలు ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్ ఆలోచననే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరు స్త్రీవాదంతోనే మొత్తంగా విభేదిస్తున్నారు.

ఈ కాన్సెప్ట్ మరీ దూరం వెళ్లిందని.. మహిళలు తమ పిల్లలను ఇంటి దగ్గర వదిలి పనికి వెళ్లాలంటూ ఒత్తిడి చేయటం ద్వారా స్త్రీవాదమనేది మహిళలకు కీడు చేస్తోందని కొందరు భావిస్తున్నారు.

టైలు, కఫ్‌లింక్‌లు, సూట్లు

వస్తువులను సూచిస్తున్నది కేవలం మహిళలు మాత్రమే కాదు.. ఫ్రీడమ్ ట్రాష్‌క్యాన్‌లోకి వస్తువులను విసిరేస్తున్న పురుషులు కూడా చాలా మంది ఉన్నారు. ‘‘మహిళల లోదుస్తుల్లాగా ఇవి కూడా భౌతిక అవరోధాలు’’ అని ఒక వ్యక్తి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)