శ్రీలంకలో శవాల దిబ్బ: మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు... అవి ఎవరివి? హంతకులెవరు?

  • 22 నవంబర్ 2018
మన్నార్ సమాధిలో 230 అస్థిపంజరాలు
చిత్రం శీర్షిక మృతులు ఎవరు.. వారిని చంపిందెవరన్నది ఇప్పటికీ మిస్టరీ

శ్రీలంకలోని మన్నార్ పట్టణంలో ఈ ఏడాది మొదట్లో బయటపడిన ఒక సామూహిక సమాధి దేశంలోనే అతి పెద్దదని తేలిందని నిపుణులు చెప్తున్నారు.

కొంత కాలం కిందట ఇది యుద్ధ ప్రాంతంగా ఉండేది. అక్కడి సమాధి నుంచి గత ఆగస్టులో 90 అస్థిపంజరాలను వెలికి తీయగా ఇప్పుడా సంఖ్య 230 దాటింది.

సుదీర్ఘంగా సాగిన శ్రీలంక అంతర్యుద్ధంలో కనీసం 20,000 మంది అదృశ్యమైనట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. రక్తసిక్తంగా సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసింది.

శ్రీలంక ప్రభుత్వ దళాలకు, తమిళ తిరుగుబాటుదారులకు మధ్య 26 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో కనీసం లక్ష మంది చనిపోయారు.

ఇటీవల బయటపడ్డ సమాధి.. మన్నార్ ప్రధాన బస్ స్టేషన్ సమీపంలోని మాజీ సహకార డిపోలో ఉంది. అక్కడ కొత్త భవనం నిర్మించటం కోసం పునాదులు వేయటానికి కార్మికులు తవ్వటం మొదలుపెట్టినపుడు మానవ అస్థిపంజరాలు వెలుగుచూశాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక అంతర్యుద్ధ కాలంలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.. వేలాది మంది అదృశ్యమయ్యారు

ఈ ప్రాంతంలో లోతుగా తవ్వకాలు జరపాలని కోర్టు ఆదేశించింది. ఆ సామూహిక సమాధిలో బయల్పడిన అస్థిపంజరాలు ఎవరివి? వారు ఎలా చనిపోయారు? అనేది ఇంకా తెలియదు.

‘‘ఇప్పటివరకూ 230 పైగా అస్థిపంజరాలను తవ్వకాల్లో వెలికి తీశాం’’ అని కొలంబో సమీపంలోని యూనివర్సిటీ ఆఫ్ కెలానియాకు చెందిన ఫోరెన్సిక్ ఆర్కియాలజిస్ట్ ప్రొఫెసర్ రాజ్ సోమదేవ చెప్పారు. సమాధి వద్ద తవ్వకాల బృందానికి ఆయన సారథ్యం వహిస్తున్నారు.

‘‘నా అనుభవంలో ఇప్పటివరకూ తవ్విన అతి పెద్ద సామూహిక సమాధి ఇదే’’ అని ఆయన తెలిపారు.

మానవ అస్థికలతో పాటు కొన్ని లోహ వస్తువులు, బాధితుల నగలు కూడా బయటపడ్డాయని అన్నారు.

‘‘ఎముకలు చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్ని ఎముకలు కనిపించటం లేదు. మృతుల శరీరాల ఆకృతులను రూపొందించటం చాలా కష్టంగా ఉంది. అంతా గందరగోళంగా ఉంది’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.

మన్నార్ పట్టణంలో జాతిపరంగా మైనారిటీలైన తమిళులు అధికంగా ఉంటారు. శ్రీలంక భద్రతా దళాలకు, తిరుగుబాటుదారులైన తమిళ పులులకు మధ్య ఘర్షణలో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది అదృశ్యమయ్యారని స్థానిక నాయకులు చెప్తున్నారు.

చిత్రం శీర్షిక అస్థిపంజరాలు లభించిన చోట ఫోరెన్సిక్ నిపుణులు

అంతర్యుద్ధ కాలంలో మన్నార్ పట్టణం చాలా వరకూ సైన్యం నియంత్రణలో ఉండేది. తమిళ పులులు ఆ చుట్టు పక్కల ప్రాంతాలు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో బలంగా ఉండేవారు.

భీకర పోరాటాల అనంతరం సైన్యం మొత్తం జిల్లాలను తన గుప్పిట్లోకి తీసుకుంది. ఆ యుద్ధం దాదాపు పదేళ్ల కిందట ముగిసింది.

ఇక్కడి సామూహిక సమాధిలో వెలికితీసిన అస్తిపంజరాలను మన్నార్ కోర్టు కస్టడీకి తరలించారు. తవ్వకాలు పూర్తయిన తర్వాత ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుంది.

అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచీ శ్రీలంక వార్ జోన్‌లో అనేక సామూహిక సమాధులు వెలుగుచూశాయి.

2014లో మన్నార్‌లో తిరుకేతీశ్వరం ఆలయం సమీపంలోని మరొక ప్రాంతంలో 96 మంది అస్థికలు బయటపడ్డాయి.

చిత్రం శీర్షిక మృతుల వివరాలను గుర్తించలేకపోతున్నారు

అయితే.. నాలుగేళ్లు గడిచినా ఆ మృతులు ఎవరు? వారిని ఎవరు చంపారు? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

సైనికులు, తమిళ తిరుగుబాటుదారులు ఇరువురూ పౌరులపై హత్యాకాండకు పాల్పడ్డారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కానీ., పౌరుల మరణాలతో కానీ, అదృశ్యాలతో కానీ తన బలగాలకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం తిరస్కరిస్తూనే ఉంది. మన్నార్‌లోని సామూహిక సమాధిలో బయటపడ్డ మృతదేహాలకు సైనికులతో సంబంధం ఉందన్న వాదనలను సైన్యం తోసిపుచ్చుతోంది.

అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా ఒత్తిడి రావటంతో మానవ అదృశ్యాలపై దర్యాప్తు చేయటానికి శ్రీలంక ప్రభుత్వం ఈ ఏడాది ‘ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ (ఓఎంపీ)’ పేరుతో ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసింది.

మన్నార్‌లో సమాధి తవ్వకాలకు ఓఎంపీ పాక్షికంగా నిధులు సమకూర్చింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు LIVE: జగన్ సునామీ... 152 స్థానాల్లో ఆధిక్యం... 23 స్థానాల్లోనే టీడీపీ ప్రభావం.. మనుగడ కోసం జనసేన పోరాటం

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 300 స్థానాల్లో బీజేపీ.. 49 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: నిజామాబాద్‌లో కవిత వెనుకంజ, మాల్కాజిగిరిలో రేవంత్ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

అమేఠీలో రాహుల్ గాంధీ వెనుకంజ.. ఆధిక్యంలో స్మృతీ ఇరానీ

‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా

‘జగన్‌కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్‌కు మాత్రమే ఉండేది’

నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు