భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఎక్కడుందో తెలుసా?

  • 23 నవంబర్ 2018
భూప్రళయం Image copyright Simon Dannhauer / Alamy
చిత్రం శీర్షిక మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో సెనోట్స్

ఒకప్పుడు, భూమిపై డైనోసార్ల హవా నడిచింది. పొడవుగా, భారీ ఆకారంలో, ఎగిరే, పరుగులు తీసే రకరకాల డైనోసార్లు భూమి అంతటా కనిపించేవి. కానీ ఇప్పటికి సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల ముందు వచ్చిన ప్రళయం డైనోసార్లనే కాదు, భూమిపై ఉన్న 80 శాతం జీవరాశులను అంతం చేసింది.

సుమారు 12 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఒక ఉల్క భూమిని గుద్దుకుంది. ఆ భారీ విస్పోటనంతో భూమి కంపించిపోయింది.

భూమిపై ఆ ఉల్క ఢీకొన్న ప్రాంతం ఎక్కడుందనేది తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ అది ఎక్కడో కనిపెట్టలేకపోయారు.

1980వ దశకంలో అమెరికాలోని పురాతత్వవేత్తల బృందం ఒకటి అంతరిక్షం నుంచి తీసిన కొన్ని ఫొటోలను నిశితంగా పరిశీలించింది. వాటిలో మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం ఫొటోలు కూడా ఉన్నాయి. యుకాటన్ దగ్గరగా సముద్రం లోపల గుండ్రంగా ఒక ప్రాంతం కనిపించింది.

సెనోట్స్.. అంటే గుండ్రంగా ఉండే సింక్ హోల్ లాంటివి యుకాటన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఇక్కడ పర్యటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన బ్రోచర్స్‌లో కూడా సెనోట్స్ ప్రస్తావన ఉంది. సెనోట్స్ యుకాటన్ సమతల మైదాన ప్రాంతంలో చాలా దూరం వరకూ వ్యాపించి ఉంది.

కానీ మనం దాన్ని అంతరిక్షం నుంచి చూస్తే మాత్రం, అది ఒక అర్దగోళంలా కనిపిస్తుంది. ఎవరో వృత్తలేఖినితో వృత్తం గీసినట్టుంటుంది. భూమిపై దాన్ని సగం గీసిన తర్వాత భూమి అయిపోయిందేమో అనిపిస్తుంది.

Image copyright NASA Image Collection / Alamy
చిత్రం శీర్షిక 1980 మధ్యలో పురాతత్వవేత్తలు యుకాటన్ సెనోట్స్ గుర్తించారు

ఒకప్పుడు మాయా నాగరికతకు కేంద్రం

అమెరికా పురాతత్వశాస్త్రవేత్తలు అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫొటోలను దానికి జోడించి చూసినప్పుడు యుకాటన్ రాజధాని మెరీడా, ఓడ రేవు సిసాలా, ప్రోగ్రెసో, ఈ వృత్తాకారం లోపలే ఇమిడిపోయి ఉన్నట్టు కనిపించింది.

ఒకప్పుడు ఈ ప్రాంతం మాయా నాగరికతకు కేంద్రంగా ఉండేది. అమెరికా వాసులైన మాయా ప్రజలు తాగునీటి కోసం ఈ సెనోట్స్ నీళ్లపైనే ఆధారపడేవారు.

వారందరూ ఈ గోళాకార పరిధిలోనే ఉండేవారనే విషయం శాస్త్రవేత్తలకు చాలా వింతగా అనిపించింది. 1988లో మెక్సికోలోని అకాపల్కోలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించినపుడు అమెరికా పురాతత్వవేత్తలు ఈ విషయాన్ని అందరికీ వివరించారు.

ఈ కాన్ఫరెన్సులో ఎడ్రియానా ఒకెంపో కూడా ఉన్నారు. ఎడ్రియానా అప్పుడే నాసాలో పనిచేయడం ప్రారంభించారు. ఆమె ఒక భూగర్భ శాస్త్రవేత్త. ఇప్పుడు 63 ఏళ్ల వయసులో ఉన్న ఎడ్రియానా "అర్ధగోళాకార పరిధిలో వ్యాపించి ఉన్న సింక్ హోల్ చూడగానే మా లక్ష్యాన్ని చేరుకున్నట్టు నాకు అనిపించింది" అన్నారు.

ఎడ్రియానా ఇప్పుడు నాసా లూసీ మిషన్‌కు సంబంధించిన పనులు చూస్తున్నారు. ఈ మిషన్ ద్వారా 2021 నాటికి గురు గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపించాలని అనుకుంటున్నారు.

ఆ ఫొటోలు చూడగానే ఒకప్పుడు ఉల్క ఢీకొనడం వల్లే అక్కడ అలాంటి వృత్తం ఏర్పడిందనే విషయం అర్థమైంది. కానీ ఆధారాలు లేకుండా అది ఆ ప్రాంతమేనని ఆమె కచ్చితంగా చెప్పలేకపోయారు.

దాంతో, మీకు కూడా నాలాగే అనిపిస్తోందా అని ఎడ్రియానా మిగతా శాస్త్రవేత్తలను అడిగారు. "అప్పుడు నేను ఏం అడుగుతున్నానో వాళ్లకు అర్థం కాలేదు" అని ఆమె చెప్పారు.

కానీ ఆ ఫొటోలను ఎడ్రియానా ఒకెంపో చూడడం అనేది ఒక భారీ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. అందులో యుకాటన్ ద్వీపకల్పం తీరంలో ఏర్పడిన ఆ సెనోట్స్ అనే సింక్ హోల్ నిజానికి ఆరున్నర కోట్ల ఏళ్ల ముందు ఉల్క భూమిని ఢీకొన్న ప్రాంతమేనని తెలుసుకోగలిగారు.

Image copyright Science History Images / Alamy
చిత్రం శీర్షిక ఉల్క ఢీకొనడం వల్ల భారీ గొయ్యి పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఉల్క ఢీకొనడం వల్ల ఏమేం జరిగాయి?

ఈ మహా విస్ఫోటనం వల్ల జరిగిన వినాశనం చెప్పలేనిది. ఆ ప్రళయానికి అక్కడున్న రాళ్లే కరిగిపోయాయి.

1990 దశకం నుంచే అమెరికా, యూరప్, ఆసియా శాస్త్రవేత్తలు ఈ చిక్కుముడిలోని భాగాలను జోడిస్తూ వచ్చారు. 6.5 కోట్ల ఏళ్ల క్రితం 12 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఉల్క భూమిని గుద్దుకోవడం వల్ల భూమిపై 30 కిలోమీటర్ల లోతున గుంత ఏర్పడిందని ఇప్పుడు వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు.

చెరువులో రాయి వేసినప్పుడు నీళ్లు ఎలా పక్కకు చెదురుతాయో సరిగ్గా అలాగే, ఈ ఉల్క ఢీకొనడం వల్ల కరిగిపోయిన రాళ్లతో మౌంట్ ఎవరెస్టు కంటే ఎత్తైన పర్వతాలు ఏర్పడ్డాయి. కానీ అవి తర్వాత శిథిలమై కూలిపోయాయి. ఆ ప్రళయంతో భూమి పూర్తిగా మారిపోయింది.

Image copyright SCIENCE PHOTO LIBRARY/ALAMY
చిత్రం శీర్షిక ఉల్క ఢీకొనడం వల్ల డైనోసార్లతోపాటు భూమిపై 75 శాతం జీవరాశులు అంతం అయ్యాయి

ఉల్క ఢీకొన్న తర్వాత సుమారు ఏడాదిపాటు దుమ్ము, ధూళి భూమిని కప్పేశాయి. సూర్యుడి కిరణాలు భూమిపైకి చేరడం ఆగిపోయాయి. మొత్తం ఏడాదంతా భూమి చీకట్లో ఉండిపోయింది. దాంతో భూమిపై ఉష్ణోగ్రతలు సున్నా కంటే ఎన్నో డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోయాయి.

ఫలితంగా భూమిపై 75 శాతం జీవరాశులు నశించిపోయాయి. డైనోసార్లన్నీ దాదాపు అప్పుడే అంతమైపోయాయి.

ఉల్క భూమిని సరిగ్గా ఎక్కడ ఢీకొందో, దాని కేంద్రం ఇప్పటికీ మెక్సికో లోని చిక్సులబ్ ప్యూర్టో అనే పట్టణం అడుగున కప్పుకుపోయి ఉంది.

చాలా తక్కువ మంది నివసించే చిక్సులబ్ పట్టణంలో పక్కా భవనాలు కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ జనాభా వెయ్యి మాత్రమే. ఈ పట్టణం గురించి ప్రపంచంలో ఎవరికీ పెద్దగా తెలీదు. తెలిసిన వారు ఇక్కడికొచ్చి డైనోసార్లకు నివాళి అర్పిస్తుంటారు.

చిక్సులబ్ పట్టణం చేరుకోడానికి చాలా మెలికలు తిరిగే దారుల్లో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. జనాలకు ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలో కచ్చితంగా తెలీదు. దాంతో ఇక్కడకు రావాలనుకునే చాలా మంది ఇదే పేరుతో ఉన్న చిక్సులబ్ పుఎల్బో అనే మరో పట్టణానికి చేరుకుంటారు.

Image copyright ADAMCASTFORTH/WIKIMEDI
చిత్రం శీర్షిక డైనోసార్లకు నివాళిగా చిన్నారులు వేసిన చిత్రాలు

డైనోసార్లను గుర్తు చేసుకునే గ్రామం

చిక్సులబ్ పట్టణం ప్రోగ్రెసో అనే రేవుకు సుమారు 7 కిలోమీటర్లు తూర్పుగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినవారికి ఇక్కడ ఒకప్పుడు భూమిని పూర్తిగా మార్చేసే ఘటన జరిగిందని అసలు అనిపించదు.

పట్టణంలోని ఒక ప్రధాన కూడలిలో మనకు పిల్లలు వేసిన ఒక డైనోసార్ పెయింటింగ్ కనిపిస్తుంది. అందులో డైనోసార్ అస్థిపంజరాలు ఉంటాయి.

1991లో ఎడ్రియానా ఒకెంపో తన పరిశోధనను ప్రచురించారు. అప్పటివరకూ యుకాటన్ ద్వీపకల్పంలో ఈ ప్రాంతం గురించి ఎవరూ అంత ఆసక్తి చూపించేవారు కాదు.

కానీ, ఇటీవల అంటే 2018 సెప్టెంబర్లో ఇక్కడ ఒక మ్యూజియం ప్రారంభించారు. దీని పేరు 'మ్యూజియం ఆఫ్ సైన్స్ ఆఫ్ ద చిక్సులబ్ క్రేటర్'. ప్రజలకు 6.5 కోట్ల ఏళ్ల ముందు వచ్చిన ప్రళయం గురించి తెలిసేలా చేయడమే ఈ మ్యూజియం లక్ష్యం. దీని సాయంతో ఇక్కడ టూరిజంను కూడా అభివృద్ధి చేయాలని చర్యలు చేపట్టారు.

అంతే కాదు, ఈ ప్రాంతం మాయా నాగరికతకు నిలయంగా కూడా ఉంది. ఇక్కడ నివసించిన ప్రజల నాగరికతను వెలుగులోకి తెచ్చే ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

చిక్సులబ్ ప్యూర్టో, దాని సమీప ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు రావాలని ఎడ్రియానా ఒకెంపో అన్నారు. ఆ ప్రళయం వల్లే ప్రస్తుతం మనిషి ప్రపంచంపై అధికారం చెలాయిస్తున్నాడని చెప్పారు. ఉల్క ఢీకొనకుండా, డైనోసార్లు జీవించి ఉంటే, మనం ఈ స్థాయిలో ఉండేవాళ్లమే కాదని అంటారు.

"ఆ ప్రళయం వల్ల మానవ నాగరికత వర్ధిల్లడానికి గొప్ప అవకాశం లభించిందని" ఎడ్రియానా భావిస్తున్నారు.

Image copyright Graham Prentice / Alamy
చిత్రం శీర్షిక యుకాటన్ బిలాన్ని విలేఖరి కార్లోస్ బాయర్స్ అల్వారెజ్ థియరీతో జోడించారు

చంద్రుడిపై ఎవరి చితాభస్మం ఉంది?

ఉల్క సరిగ్గా ఎక్కడ ఢీకొంది అనే కచ్చితమైన వివరాలు సేకరించడంలో ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త యుజీన్ షూమేకర్ తనకు సాయం చేశారని ఎడ్రియానా తెలిపారు. యుజీన్ షూమేకర్ మరణానంతరం అరుదైన ఘనత పొందారు. ఆయన చితాభస్మాన్ని చంద్రుడిపై చల్లారు. భూమికి అవతల చితాభస్మం ఉన్న ఒకే ఒక వ్యక్తి షూమేకర్.

ఆ ఘటన తర్వాత జరిగిన ఏ ఖగోళ ఘటనలకూ యుకాటన్ వృత్తంతో సంబంధం ఉండే అవకాశం లేదని షూమేకర్ ఎడ్రియానాకు చెప్పారు. అందుకే, ఎడ్రియానా అన్వేషణ పూర్తైపోయి ఉంటే, ఆమెకు భౌగోళిక వృద్ధి గురించి ఒక రేఖను గీయడానికి సాయం లభిస్తుంది.

ఉల్క ఢీకొనడం వల్ల డైనోసార్లు అంతమైపోయాయనే థియరీని మొట్టమొదట 1980లో కాలిఫోర్నియాలోని తండ్రీకొడుకులు లూయీ, వాల్టర్ అల్వారెజ్ జంట ప్రస్తావించింది. కానీ అప్పుడు దానిపై చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ, ఎడ్రియానా అన్వేషణతో అల్వారెజ్ శాస్త్రవేత్తల జంట థియరీ నిజమనే విషయం నిరూపితమైంది.

ఈ చిక్కుముడిలోని చాలా భాగాలు ఇంకా లభించలేదు. అంటే 1978లో భూగర్భశాస్త్రవేత్త గ్లెన్ పెన్‌ఫీల్డ్ మెక్సికో చమురు కంపెనీ పెమెక్స్ కోసం కరేబియన్ సముద్రంలో ఒక సర్వే చేశారు. చమురు నిల్వలు అన్వేషిస్తూ ఆయన సముద్రం లోపల ఒక విశాలమైన బిలం గుర్తించారు.

కానీ ఆ ఆధారాలు చమురు కంపెనీ పెమెక్స్ అధీనంలో ఉండిపోయాయి. దాంతో దాని గురించి వివరాలేవీ బయటకు రాలేదు.

కార్లోస్ బాయర్స్ అనే టెక్సాస్ విలేఖరి యుకాటన్‌లో ఉన్న ఈ వృత్తాన్ని అల్వారెజ్ థియరీకి జోడించే ప్రయత్నం చేశారు. 1981లో ఆయన హూస్టన్ క్రానికల్ పత్రికలో రాసిన వ్యాసంలో రెండింటికీ ఏదైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న లేవనెత్తారు.

Image copyright Reinhard Dirscherl / Alamy
చిత్రం శీర్షిక చిక్సులబ్ బిలాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని నామినేట్ చేశారు

అంగారకుడిపై భూమిలాంటి వాతావరణం

బాయర్స్ తన ఈ థియరీని అలెన్ హిల్డెబ్రెండ్ అనే ఒక విద్యార్థితో షేర్ చేసుకున్నారు. అలెన్ తర్వాత పెన్‌ఫీల్డ్‌ను సంప్రదించారు. తర్వాత ఇద్దరూ కలిసి సముద్రంలో ఉన్న బిలం అగ్నిపర్వతానిది కాదని, అది ఉల్క ఢీకొనడం వల్ల ఏర్పడిన ఒక బిలం అని నిర్ణయానికి వచ్చారు.

"ఒక విలేఖరి ఇంత పెద్ద అన్వేషణను పూర్తి చేశారు" అని ఎడ్రియానా ఒకెంపో అంటారు.

కానీ ఈ కథ విడిపోయిన చరిత్ర పేజీలను తిరిగి జోడించడం మాత్రమే కాదు, భూమిపైన అభివృద్ధి చెందిన ప్రపంచం గురించి వివరాలు తెలుసుకోడానికి కూడా మనకు సాయం చేస్తుంది. నాసా కూడా అంగారకుడిపైకి పంపిన అంతరిక్ష నౌక క్యూరియాసిటీ ద్వారా గణాంకాలు సేకరించడానికి ఈ వివరాలనే ఉపయోగించింది.

ఉల్క గుద్దుకోవడం వల్ల అంగారకుడిపై ఏం జరిగుంటుందో తెలుసుకోడానికి ఆ గ్రహం ఉపరితలాన్ని, భౌగోళిక నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ పరిశోధనలో అంగారకుడిపై కూడా భూమి లాంటి వాతావరణమే ఉండేదనే సంకేతాలు లభిస్తున్నాయి.

"గతంలో జరిగిన ఘటనలు మనకు భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తాయి. వాటికి సన్నద్ధంగా ఉండేలా చేస్తాయి. యుకాటన్ ద్వీపకల్పంలో జరిగిన ఘటనల వల్ల, అంగారకుడిపై జరిగిన భౌగోళిక ఘటనలకు సంకేతాలు లభిస్తున్నాయి" అని ఎడ్రియానా తెలిపారు.

అక్కడి తీయటి నీటి గుంటల్లో చేపలతో కలిసి ఈదుతున్నప్పుడు బహుశా ప్రళయానికి సాక్ష్యంగా నిలిచిన చోటు ఇదేనని ప్రజలకు గుర్తురావచ్చు. కానీ, మన భూమి అలాంటి వినాశనాన్ని 10 కోట్ల ఏళ్లలో కేవలం ఒకే ఒక్కసారి చూసింది.

కానీ ఎడ్రియానా మాత్రం, "ఇది మన గ్రహంపై చాలా ప్రత్యేకమైన ప్రాంతం. మన విశ్వం వారసత్వం" అని వర్ణిస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)