రన్‌వేపై అదుపు తప్పిన విమానం, 127 మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం

  • 23 నవంబర్ 2018
విమానం Image copyright EPA

ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో 127మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం బొలీవియా విమానాశ్రయంలో రన్‌వేపై అదుపుతప్పి జారి ఓ పక్కకు ఒరిగిపోయింది. కుజ్కో నుంచి వస్తున్న పెరూవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం ఎల్ ఆల్టో విమానాశ్రయంలో దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే ఈ ఘటనలో విమానంలోని 122 మంది ప్రయాణికులకు, ఐదుగురు సిబ్బందికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు జరిగిన ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయాన్ని కొన్ని గంటలపాటు మూసేశారు. విమానాల రాకపోకలను రద్దు చేశారు.

Image copyright EPA

ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో, టైర్లు పేలిపోయి ఒరిగి పోయిన విమానాన్ని రన్‌వేపై నుంచి తొలగించడానికి క్రేన్ సిద్ధం చేశారు.

విమానం ల్యాండ్ అయ్యే సమయంలో పైలట్ నుంచి ఎలాంటి హెచ్చరికలూ లేవని ప్రయాణికులు తెలిపారు.

ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామని పెరూవియన్ ఎయిర్‌లైన్స్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)