కరాచీలో చైనా దౌత్య కార్యాలయంపై కాల్పులు, నలుగురు మృతి

  • 23 నవంబర్ 2018
చైనా దౌత్య కార్యాలయంపై కాల్పులు Image copyright Getty Images

పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న చైనా దౌత్యకార్యాలయంపై కొందరు సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు చైనా దౌత్యకార్యాలయం వెలుపల కాల్పుల శబ్దాలు వినిపించాయని పోలీసులు తెలిపారు.

పోలీసుల ఎదురు కాల్పుల్లో దాడికి పాల్పడ్డవారిలో ముగ్గురు మరణించారు.

ఈ దాడికి పాల్పడింది తామేనని పశ్చిమ పాకిస్తాన్‌లో చైనా పెట్టుబడి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న వేర్పాటువాద మిలిటెంట్లు తెలిపారు.

గత శుక్రవారం కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ పేలుడు ఘటనలో కనీసం 20మంది మరణించారు.

కరాచీలో ఏం జరిగింది?

తుపాకులతో చైనా దౌత్య కార్యాలయంలోకి ప్రవేశించడానికి నలుగురు వ్యక్తులు ప్రయత్నించగా, వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

పేలుడు సంభవించడం తాము చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ప్రాంతంలో పొగ అలముకున్న ఫోటోలను స్థానిక టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. పెద్దఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.

కార్యాలయం లోపలి సిబ్బంది అందరూ సురక్షితంగానే ఉన్నారని చైనా తెలిపింది. పాకిస్తాన్‌లోని చైనా జాతీయులను రక్షించేందుకు అవసరమైన అదనపు చర్యలు చేపట్టాలని చైనా విదేశాంగ శాఖ కోరింది.

‘‘పాకిస్తానీ పోలీసుల మృతి పట్ల మేం సంతాపం తెలుపుతున్నాం, వారి కుటుంబాలకు మా సానుభూతి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

Image copyright XINHUA

ఈ దాడికి పాల్పడింది తామేనంటూ వేర్పాటువాద సంస్థ 'బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ' ప్రకటించింది.

''పాకిస్తాన్ బలగాలతోపాటు చైనాను కూడా మా శతృవు కిందే పరిగణిస్తున్నాం''అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు.

గత కొన్నేళ్లుగా బలూచిస్తాన్‌లోని చైనా కార్మికులను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు.

దాడిని ఖండించిన భారత్

చైనా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించింది. ఆ మేరకు విడుదల చేసిన ప్రకటనలో..

‘‘టెర్రరిజం ఏవిధంగానూ సమర్థనీయం కాదు. ఈ దాడికి పాల్పడ్డవారిని వెంటనే శిక్షించాలి. ఇలాంటి దాడులు.. టెర్రరిజంతో పోరాడాలన్న అంతర్జాతీయ సమాజపు సంకల్పాన్ని బలోపేతం చేస్తాయి’’ అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

బెలూచిస్తాన్‌లో చైనా ఏం చేస్తోంది?

చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్' ప్రాజెక్టులో బలూచిస్తాన్‌ ఓ కీలక ప్రాంతం.

చైనా, పాకిస్తాన్ రెండూ మిత్ర దేశాలే. ఇప్పటికే పాకిస్తాన్‌లో చైనా కొన్ని వందల కోట్లను గుమ్మరించింది. కానీ తాజా సంఘటన ఈ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నవారిలో ఆందోళన కలిగిస్తోంది.

బలూచిస్తాన్‌లో జనాభా ఎక్కువే. అక్కడ గ్యాస్, బొగ్గు నిక్షేపాలతోపాటు రాగి, బంగారు నిక్షేపాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ పాకిస్తాన్‌ని పేదరికం వైపు నడిపిస్తున్న అంశాల్లో ఇది కూడా ప్రధానాంశం.

తమను పాక్ ప్రభుత్వం మోసం చేస్తోందని, తమ ప్రాంతపు హక్కులను కాలరాస్తోందని బెలూచ్ జాతీయవాదులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం