అడాల్ఫ్ హిట్లర్ ప్రాణాలు కాపాడేందుకు విషం తినడానికైనా సిద్ధమైన మహిళలు

  • 24 నవంబర్ 2018
హిట్లర్ టేస్టర్స్ Image copyright EXPRESS NEWSPAPERS / GETTY IMAGES
చిత్రం శీర్షిక హిట్లర్‌తో ఆయన ప్రియురాలు ఇవా బ్రౌన్

రకరకాల రుచికరమైన పదార్థాలు ఉంచిన ఒక టేబుల్, దాని చుట్టూ చాలా మంది యువతులు కూర్చున్నారు. వారందరికీ చాలా ఆకలిగా ఉంది.

కానీ ఆ పదార్థాలు తింటే వాళ్ల ప్రాణమే పోవచ్చు. అయినా వాళ్లు వాటిని తినాల్సివస్తోంది. ఇది ఒక రచయిత్రి ఊహ.

కానీ, 1942లో ఇది నిజంగానే జరిగింది. అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అప్పుడు ప్రాణాలకు తెగించి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రాణాన్ని కాపాడే విధులను 15 మంది మహిళలకు అప్పగించారు.

హిట్లర్ కోసం తయారు చేసిన పదార్థాల్లో విషం కలిపారేమో తెలుసుకోడానికి ఆయన కంటే ముందు వాటిని రుచిచూడడమే ఆ యువతుల పని.

2012 డిసెంబర్ ముందు వరకూ ఈ విషయం ఎవరికీ తెలీదు. మార్గట్ వోక్ అనే ఒక మహిళ 70 ఏళ్ల తర్వాత మౌనం వీడడంతో ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. హిట్లర్ ప్రాణాలు కాపాడేందుకు అతడి వంటలు రుచిచూసే ఆ టీంలో తను కూడా పనిచేశానని ఆ మహిళ బయటపెట్టింది. తమను 'టేస్టర్స్' అని పిలిచేవారని చెప్పింది.

మార్గట్ వోక్ చెప్పిన ఈ విషయాన్ని ఇటలీ రచయిత రోజెలా పాస్టోరినో రోమ్‌కు చెందిన ఒక వార్తాపత్రికలో చదివారు. ఆమె చెప్పిన విషయం చదివేసరికి రోజెలాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.

తర్వాత రోజెలా పాస్టోరినో ఆ మహిళ కోసం వెతకడం ప్రారంభించారు. తన అన్వేషణల ఫలితంగా 'లా కాటాదోరా' అనే పుస్తకం రాశారు. ఈ పోర్చుగీస్ పదానికి ఇంగ్లిష్‌లో 'ది పికర్' అని అర్థం. ఇది మార్గట్ వోక్ బయటపెట్టిన విషయంతో ప్రారంభమవుతుంది. ఈ పుస్తకం ఇటలీలో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఇప్పుడు ఇది స్పానిష్‌లో కూడా ప్రచురితం కాబోతోంది.

Image copyright PASQUALE DI BLASIO
చిత్రం శీర్షిక 'లా కాటాదోరా' పుస్తక రచయిత్రి రోజెలా పోస్టోరినో

పుస్తకం ఎందుకు రాశారు?

ఈ పుస్తకం రాయడం వెనుక తన ప్రయత్నం, అందులో ఉన్న ఎన్నో అంశాల గురించి రోజెలా సమాధానాలు ఇచ్చారు. "ఒక రోజు నేను ఇటలీలోని ఒక పత్రికలో మార్గట్ వోక్ గురించి రాసిన వార్తను చదివాను. మార్గట్ బెర్లిన్‌లోని 96 ఏళ్ల వృద్ధురాలు. ఆమె మొదటిసారి హిట్లర్ కోసం టేస్టర్ పని చేశానని ప్రకటించారు" అన్నారు.

"అది ఆశ్చర్యం కలిగించింది. దాని గురించి ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. నేను స్వయంగా పోలెండ్‌లోని వుల్ఫ్‌షాంజ్ వెళ్లాను. దాన్ని 'వుల్ఫ్ డెన్' అని కూడా అంటారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో అడాల్ఫ్ హిట్లర్‌కి అది అతిపెద్ద మిలిటరీ బ్యారక్. హిట్లర్‌ కోసం టేస్టర్స్‌గా పనిచేసిన వారి గురించి మీకేమైనా తెలుసా? అని అక్కడ చాలామందిని అడిగాను. కానీ ఎవరూ దాని గురించి వినలేదని చెప్పారు. అసలు ఆ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ ప్రచురించలేదు" అన్నారు రోజెలా.

హిట్లర్ టేస్టర్స్ గురించి పరిశోధన

"ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలీలేదు. కానీ నేను మార్గట్ వోక్‌ను కలవాలని మాత్రం అనుకున్నాను. ఆమెను ఇంటర్వ్యూ చేసిన మీడియా హౌస్ సాయం కూడా అడిగాను. కానీ అక్కడి నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. కానీ, జర్మనీలోని ఒక స్నేహితుడు నాకు మార్గట్ ఇంటి అడ్రస్ ఇచ్చాడు. నేను మిమ్మల్ని కలవాలని ఆమెకు లేఖ కూడా రాశాను. కానీ అదే వారం ఆమె మృతి చెందారు" అని పోస్టోరినో చెప్పారు.

"తర్వాత నిరాశకు గురయ్యా. మార్గట్ మృతితో ఆ ప్రాజెక్టును వదిలేయాలేమో అనుకున్నాను. కానీ మానవత్వానికి విరుద్ధంగా ఉన్న అలాంటి విషయం అందరికీ తెలియాలని అనుకున్నా. దానికి అందరి ఆమోదం లభిస్తుందని భావించాను" అని ఆమె తెలిపారు.

Image copyright COVER OF THE BOOK "LA CATADORA"
చిత్రం శీర్షిక 'లా కాటదోరా' పుస్తకం ముఖచిత్రం

మృత్యువుతో చెలగాటం

"నాజీ అయినప్పటికీ మార్గట్ వోక్‌ను హిట్లర్ కోసం బలవంతంగా టేస్టర్‌గా చేశారు. ఆమెకు హిట్లర్‌పై నమ్మకం ఉండేది కాదు. ఆయన్ను కాపాడాలని కూడా అనుకోలేదు. కానీ ఆమె ఆ పని చేసేలా ఒత్తిడి చేశారు. ఆమె ప్రాణాలనే ప్రమాదంలో పడేశారు" అని పోస్టోరినో తన పుస్తకంలో చెప్పారు.

"ఆమె బాధితురాలిగా మారారు. ఎందుకంటే ఆమె రోజుకు మూడు సార్లు మృత్యువును ఎదుర్కునేవారు. కానీ ఆమె హిట్లర్ ప్రాణాలు కాపాడుతూ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవారు. 20వ శతాబ్దంలో అతిపెద్ద నేరస్థుడిని కాపాడడంలో ఆమె ఒక భాగం అయ్యారు." ఆ భావనే నన్ను ఈ పుస్తకం రాసేలా చేసిందని రోజెలా అన్నారు.

మార్గట్ వోక్ కథ

మార్గట్ వోక్‌ది చాలా ప్రత్యేకమైన కథ. కానీ అది చాలా సాదాసీదాగా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని బతికించడానికి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె నియంతృత్వ పాలనకు సహకరించింది.

రోజెలా తన పుస్తకంలో "హిట్లర్ బయటకు ఎలా కనిపిస్తాడో, లోపల దానికి పూర్తి విరుద్ధంగా ఉండేవారని చెప్పారు. 60 లక్షల మంది యూదుల హత్యకు కారణమైన హిట్లర్ లాంటి నియంత మాంసాహారం తినేవారు కాదు. ఎందుకంటే జంతువులను చంపడం ఆయనకు క్రూరంగా అనిపించేది". అయితే హిట్లర్ నిజంగానే శాకాహారా, దాని వెనుక ఏదైనా కారణం ఉందా?

ఈ వివరాలు హిట్లర్ సెక్రటరీ నుంచి లభించాయని రోజెలా తెలిపారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. హిట్లర్ శాకాహారి అని ఆయనే చెప్పారు. తనకు అత్యంత నమ్మకస్తులైన కొందరితో భోజనం చేస్తున్న హిట్లర్ వారితో ఒకసారి "ఒక కబేళాను చూసిన తర్వాత నేను మాంసం తినడం మానేశాను, వాళ్లు అక్కడ అప్పుడే చిందిన రక్తంపై బూట్లతో ఎలా నడుస్తారో" అన్నారట.

హిట్లర్ లాంటి నియంతకు కబేళా నచ్చకపోవడం అనేది వింతగా అనిపిస్తుంది. అదే ఏడాది ఆయన జాత్యహంకార చట్టం అమలు చేశారు. దానితో యూదుల సంహారం మొదలైంది. కానీ అదే సమయంలో పెంపుడు కుక్కల తోక, చెవులు కత్తిరించడాన్ని నిషేధిస్తూ కూడా హిట్లర్ ఒక చట్టం చేశారు.

హిట్లర్‌లో చాలా విరుద్ధ స్వభావాలు ఉండేవి. ఆయనకు పేగుల్లో సమస్య ఉన్నప్పటికీ చాక్లెట్ తినేవారు. కానీ ఆ తర్వాత డైటింగ్ చేసి, ఉపవాసాలు ఉండి వారంలోనే చాలా కిలోల బరువు తగ్గేవారు.

Image copyright HERITAGE IMAGES / GETTY IMA
చిత్రం శీర్షిక పెంపుడు కుక్కలు వుల్ఫ్, బ్రాండీతో హిట్లర్, ఇవా బ్రౌన్

ఒక హిట్లర్‌ రెండు ముఖాలు

రోజెలా తన పుస్తకంలో హిట్లర్ విరుద్ధ స్వభావాల గురించి రాశారు. నాజీలు ఆయన్ను దేవుడిలా భావిస్తే, ఆయన మాత్రం తన ఎసిడిటీ సమస్య తగ్గడం కోసం రోజూ 16 మాత్రలు మింగేవారని తెలిపారు.

హిట్లర్‌కు కుక్కలంటే చాలా ఇష్టమని కూడా రోజెలా చెప్పారు. ఆయనకు కుక్కలపై ఉన్న ప్రేమ చూసి ఆయన ప్రియురాలు ఇవా బ్రౌన్ (హిట్లర్‌తో కలిసి ఈమె ఆత్మహత్య చేసుకున్నారు) కూడా అసూయపడేవారని రాశారు.

"హిట్లర్‌కు కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయనకు జర్మన్ షెపర్డ్ అంటే చాలా ఇష్టం. హిట్లర్ పెంపుడు కుక్క బ్లాండీ ఒక జర్మన్ షెపర్డ్. వియెన్నాలో ఉంటున్నప్పుడు ఎవరో ఆయనకు ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను ఇచ్చారు. అప్పుడు హిట్లర్ యువకుడిగా ఉండేవారు, ఆర్టిస్ట్ కావాలనుకునేవారు. కానీ అప్పుడు హిట్లర్‌కు కుక్కను పెంచే స్థోమత ఉండేది కాదు. దాంతో ఆయన దాన్ని తిరిగి ఇచ్చేశారు. కానీ ఆ కుక్కతో బంధం ఏర్పడడంతో దాన్ని తిరిగి తెచ్చుకున్నారు. అప్పటి నుంచీ ఆయనకు జర్మన్ షెపర్డ్ అంటే ఇష్టం ఏర్పడింది.

కానీ నిజానికి హిట్లర్ ఇవా బ్రౌన్‌తో కలిసి విషం తాగాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మొదట దానిని బ్లాండీపైనే ప్రయోగించాడు. విషం వల్ల అది చనిపోయింది. అలా హిట్లర్ ఆత్మహత్యకు ముందు తనకిష్టమైన కుక్కను తనే చంపుకున్నాడు."

Image copyright UNIVERSAL HISTORY ARCHIVE / GETTY IMAGE IMAGES
చిత్రం శీర్షిక తన అధికారులతో భోంచేస్తున్న హిట్లర్

ఒకరి భోజనం 15 మంది ఎందుకు రుచి చూడాలి

"మార్గట్ వోక్ చనిపోకుండా ఉంటే, ఆమెను ఈ విషయం కచ్చితంగా అడిగేదాన్ని" అని రోజెలా అంటారు. అయితే అంతమంది టేస్టర్స్ ఎందుకు ఉండేవారు అనే విషయం గురించి యూనివర్సిటీ ఆఫ్ బోలోగ్నాలో బయాలజీ ప్రొఫెసర్ వివరంగా చెప్పారు.

"మొదటి టీమ్ భోజనంలో మొదటి భాగం ఆహార పదార్థాలు రుచిచూసేవారు. రెండో గ్రూప్.. రెండో భాగం పదార్థాలు తిని చూసేవారు. మిగతా వారు డెజర్ట్ తినేవారు. అలా చేయడం వల్ల ఏ పదార్థంలో విషం కలిపారో సులభంగా గుర్తించవచ్చని భావించేవారు" అని తెలిపారు.

కానీ టేస్టర్స్‌గా మహిళలే ఎందుకు?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పురుషులందరూ యుద్ధంలో ఉండేవారు. యుద్ధం చేయలేని వారు అనారోగ్యంతోనో, వృద్ధులుగానో ఉండేవారు. అందుకే టేస్టర్స్‌గా మహిళలను మాత్రమే ఉపయోగించేవారు.

"హిట్లర్ యూదులను టేస్టర్స్‌గా ఎందుకు పెట్టుకోలేదు? అనే సందేహం కూడా వచ్చింది. మార్గట్ వోక్ లేకపోవడంతో, నేనే దానికి సమాధానం వెతికాను. హిట్లర్ యూదులను తన ఇంట్లో చూడాలని కోరుకోలేదు. ఎందుకంటే ఆయన వారిని పశువుల కంటే హీనంగా చూసేవారు. అంతే కాకుండా తన టేస్టర్స్‌ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నట్టు ఆయన భావించేవారు. అందుకే ఆ పనిని జర్మనీ మహిళలకే అప్పగించారు" అంటారు రోజెలా.

Image copyright HULTON ARCHIVE / GETTY IMAGES IMAGE

టేస్టర్స్ హిట్లర్‌ను చూళ్లేదు

వాస్తవ ఘటనల ఆధారంగానే తన పుస్తకం రాశానని రోజెలా చెప్పారు.

"రోజా జావ్, మార్గట్ వోక్ జీవితాల ఆధారంగా దీనిని రాశాను. రోజా కూడా బెర్లిన్‌లోనే ఉండేవారు. వోక్ లాగే రోజాకు భర్త ఉన్నారు. కానీ తర్వాత బ్యారెక్స్‌లో టేస్టర్స్ ఎలా ఆహారం రుచిచూసేవారు, వారి మధ్య బంధం ఎలా ఉండేది అనేది నేను కల్పించి రాశాను" అన్నారు.

టేస్టర్స్ కొందరు హిట్లర్‌ను చూళ్లేదని రోజెలా చెప్పారు. మార్గట్ వోక్, రోజా కూడా ఆయన్ను ఎప్పుడూ చూళ్లేదు. టేస్టర్స్ వుల్ఫ్‌షాంజ్‌ వరకే వెళ్లేవారు. హిట్లర్‌ను ఆయన బంకర్‌లో చూసే అవకాశం కొంతమందికి మాత్రమే లభించేది" అన్నారు.

"నియంతృత్వం మనిషిని మార్చేస్తుంది. ఎందుకంటే అది ఎంత క్రూరంగా ఉంటుందంటే, మనుషుల డీఎన్ఏ, వారి మానసిక స్థితిని కూడా మార్చేయగలదు అంటారు రోజెలా. అందుకే జర్మనీ మహిళలు అయిష్టంగానే హిట్లర్‌కు టేస్టర్స్ విధులు నిర్వహించేలా చేసిందని" రోజెలా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు