మిథాలీరాజ్‌ను ఆడించకపోవడం వల్లే భారత జట్టు ఓడిందా? : మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్

  • 23 నవంబర్ 2018
మిథాలీ రాజ్ ఆడకపోవడం వల్లేనా Image copyright Getty Images
చిత్రం శీర్షిక ‘‘మిథాలీని ముందు ముందు టీ20 టోర్నీల్లో ఆడిస్తారా అనేది కూడా అనుమానమే’’

మహిళా టీ20 వరల్డ్ కప్‌లో ఏ బ్యాటింగ్ బలంతో భారత జట్టు ప్రతి మ్యాచ్ గెలుస్తూ వచ్చిందో, అదే బ్యాటింగ్ సెమీ ఫైనల్లో జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ఫలితంగా భారత జట్టు 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 19.2 ఓవర్లలో కేవలం 112 పరుగులకే ఆలౌటైంది.

భారత జట్టులో బ్యాటింగ్ ఎంత ఘోరంగా ఉందంటే, కేవలం నలుగురు బ్యాట్స్‌విమెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో సులభంగా చేధించింది.

ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నప్పుడు, కెమెరా మాటిమాటికీ డగౌట్‌లో కూర్చున్న మిథాలీ రాజ్‌పైకి వెళ్తూ కనిపించింది. తనను జట్టులోకి తీసుకోకపోవడం వల్ల జట్టు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో ఆమె ముఖమే చెప్పింది.

మిథాలీ రాజ్ చాలా నిరాశగా కనిపించారు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆమె ఆడలేకపోయారు. దాంతో ఆమె జట్టు కూడా మ్యాచ్ ఓడిపోయింది.

Image copyright TWITTER @M_RAJ03

మిథాలీని ఆడించకపోవడం వల్లేనా?

"ఇంత కీలకమైన మ్యాచ్‌లో జట్టులో అత్యంత అనుభవం ఉన్న మిథాలీరాజ్‌ను ఆడించకపోవడం వల్లే భారత్ మూల్యం చెల్లించుకుంది" అని ప్రముఖ క్రికెట్ సమీక్షకులు అయాజ్ మెమన్ తెలిపారు.

భారత జట్టు గ్రూప్ మ్యాచుల్లో దానికంటే ఎంతో బలంగా ఉన్న న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లను ఓడించింది. వాటితోపాటు పాకిస్తాన్, ఐర్లండ్ టీమ్స్‌పైనా విజయం సాధించింది.

"మిథాలీ రాజ్ యువ ప్లేయరేం కాదు. కానీ ఆమె జట్టులో అత్యంత అనుభవజ్ఞురాలు. ఆమె సెమీ ఫైనల్లో ఆడుంటే మిథాలీ మనతో ఉందని జట్టులో ఒక ధైర్యం వచ్చుండేది" అని అయాజ్ మెమన్ అన్నారు.

"భారత జట్టు ఓపెనింగ్ బాగానే ఉంది. కానీ ఏ ప్లేయరూ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అలాంటి సమయంలో మిథాలీ రాజ్ ఉండుంటే, ఆమె ఒక వైపు నిలబడి ఉండేవారు. ఇంకో వైపు ఉన్న వారిని స్వేచ్ఛగా ఆడనిచ్చేవారు".

గ్రూప్ మ్యాచుల్లో పాకిస్తాన్, ఐర్లండ్‌పై హాఫ్ సెంచరీలు చేసిన మిథాలీ రాజ్ తను ఫాంలో ఉన్నానని, యువ టీమ్ మేట్స్‌తో సమానంగా ఫూర్తిగా ఫిట్ అని నిరూపించారు. అలాంటి సమయంలో ఆమెను జట్టు నుంచి తప్పించి యువ క్రీడాకారిణులకు అవకాశం ఇచ్చారు. కానీ వాళ్లు ఒత్తిడిలో చిత్తైపోయారు.

Image copyright TWITTER @IMHARMANPREET
చిత్రం శీర్షిక భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

మిథాలీని ఆడించకపోవడంపై కెప్టెన్ ఏమన్నారు?

సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఇదే ప్రశ్న అడిగారు. దానికి ఆమె "అది జట్టు నిర్ణయం. చాలాసార్లు అది పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. కానీ అంతమాత్రాన ఏదో తప్పుచేసినట్లు కాదు" అని చెప్పారు.

"మొత్తం టోర్నమెంటులో భారత జట్టు అద్భుతంగా ఆడింది. ఒక చెత్త మ్యాచ్ వల్ల జట్టు బాగుంది, లేదు అని నిర్ణయించలేం. నా జట్టును చూసి నేను గర్విస్తున్నా. ఇది ఒక యువ జట్టు. మేం రాబోయే టోర్నమెంట్లలో మెరుగైన ప్రదర్శన అందిస్తాం" అన్నారు.

మిథాలీ రాజ్ ఇంతకు ముందు భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. "పొట్టి ఫార్మాట్‌ వరల్డ్ కప్‌లో ఎదుర్కునే పెద్ద టీముల కోసం తమ దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి" అని ఆమె టోర్నమెంటు ప్రారంభానికి ముందే చెప్పారు.

Image copyright TWITTER @M_RAJ03
చిత్రం శీర్షిక మిథాలీ రాజ్

భారత్ గేమ్ ప్లాన్ ఏంటి?

"టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రెండేళ్ల నుంచి జట్టు పగ్గాలు అందుకున్నారు. దానివల్ల జట్టుకు లాభం ఉంటుంది" అని మిథాలీ అన్నారు.

కానీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాంటి ప్లానూ కనిపించకపోగా, యువ ఆటగాళ్లు కూడా తమ సత్తా చూపించలేక చేతులెత్తేశారు.

మిథాలీని ఈ మ్యాచ్‌లో ఆడించకుండా పక్కన కూచోబెట్టినందుకు జట్టు మేనేజ్‌మెంటే దీనికి బాధ్యత వహించాలని అయాజ్ మెమన్ ఆరోపించారు. జట్టు ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరు నిపుణులు కూడా మిథాలీని పక్కనపెట్టడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు.

"మిథాలీ రాజ్‌ను జట్టులో ఆడించకపోతే, ఈ ప్రపంచంలోని ఏ జట్టుతో అయినా మీరు రెండింతలు మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సుంటుంది" అని క్రికెట్ కామెంటరేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.

"మీరు ఏదైనా 180 పరుగుల మ్యాచ్‌లో మిథాలీని పక్కన పెట్టుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ కీలకమైన మ్యాచ్‌లో ఆమెను తీసుకోరా? ఇలాంటి మ్యాచుల్లో మీరు మీ బెస్ట్ ప్లేయర్స్‌ను ఆడిస్తారు, మిథాలీ బెస్ట్ ప్లేయరే" అన్నారు.

ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మహిళా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. ఆ జట్టు ఆదివారం(నవంబర్ 25న) ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది.

ఈ టోర్నీలో లీగ్ మ్యాచులన్నిటిలో విజయం సాధించడంతో సెమీ ఫైనల్లో కూడా భారత్ గెలుస్తుందని చాలామంది భావించారు. 2017 ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్‌ పైనల్లో పరాభవానికి ఇంగ్లండ్‌పై పరాభవం తీర్చుకుంటుందని అనుకున్నారు.

13వ ఓవర్ వరకూ రెండు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసిన భారత జట్టు తర్వాత 8 వికెట్లను 23 పరుగులకే కోల్పోయింది.

సోషల్ మీడియాలో మిథాలీ రాజ్‌ను ఎంపిక చేయక పోవడం వల్లే జట్టు ఓడిందనే విమర్శలు వస్తున్నాయి.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: హైదరాబాద్ అమ్మాయిల్లో క్రికెట్ క్రేజ్

"మిథాలీ లేకపోవడం కచ్చితంగా లోటే. అనుభవం ఉన్న ప్లేయర్ ను ఆడించకపోవడం జట్టును దెబ్బతీసింది. ఉదాహరణకు 'ధోనీ అంత ఫిట్‌గా లేకపోయినా అతడి అనుభవం జట్టుకు ఎంతో ప్లస్ అయ్యేది' అని సీనియర్ జర్నలిస్ట్ విజయ్ లోకపల్లి బీబీసీకి చెప్పారు.

"ఫిట్‌నెస్ లేకుండా ఆమెను ఎంపిక చేయకుంటే, అందులో పెద్దగా చేయాల్సిందేం లేదు. కానీ ఆమె ఫిట్‌గా ఉండి, తీసుకోకపోతే.. అది ఒక చర్చనీయాంశమే అవుతుంది. మిథాలీని ముందు ముందు టీ20 టోర్నీల్లో ఆడిస్తారా అనేది కూడా అనుమానమే" అన్నారు.

కీలక మ్యాచుల్లో ఒత్తిడికి చిత్తు

భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి కూడా మిథాలీని ఎంపిక చేయకపోవడం పెద్ద తప్పిదం అన్నారు. "ఆమె అనుభవం జట్టుకు అమూల్యం. పూర్తిగా ఫిట్‌గా ఉన్న 10 మంది కంటే సగం ఫిట్ ఉన్న మిథాలీ మెరుగ్గా ఆడగలరు. ఆమె అనుభవం, ఆటలో స్థిరత్వం జట్టుకు లాభిస్తుంది" అన్నారు.

ఇంగ్లండ్ ప్రిపరేషన్

భారత స్పిన్ అటాక్ ఎదుర్కోడానికి ఎలా సన్నద్ధం అయ్యామో ఇంగ్లండ్ కెప్టెన్ హీదెర్ నైట్ బీబీసీకి వివరించారు.

భారత జట్టులో ప్రధాన బౌలర్ అయిన పూనమ్ యాదవ్‌ను సమర్థంగా ఎదుర్కునేలా అసిస్టెంట్ కోచ్‌ అలిస్టర్ మైడెన్‌ ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను ట్రైన్ చేశారు. పూనమ్ లాగే అలీ మెయిడెన్‌తో లెగ్ స్పిన్ వేయించారు.

భారత ప్లేయర్లను కట్టడి చేసిన ఇంగ్లండ్ బౌలర్లను హీదెర్ నైట్ ప్రశంసించారు. ఇటు భారత జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయిందని మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ చార్లొట్ ఎడ్వర్డ్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అఫ్గానిస్థాన్ యుద్ధంలో రోజూ 74 మంది చనిపోతున్నారు... బీబీసీ పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలు

ఆత్మహత్యలకు కారణమవుతున్న పురుగుమందులను భారత్ నిషేధించిందా?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మృతి... పోలీసుల నివేదికను తప్పుపట్టిన బాధితురాలి కుటుంబం

ఇ-సిగరెట్లపై కేంద్రం నిషేధం: వీటివల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయి?

పీరియడ్ బ్లడ్ చూపిస్తే తప్పేంటి... శానిటరీ ప్యాడ్స్ యాడ్‌పై ఫిర్యాదులను తిరస్కరించిన ఆస్ట్రేలియా

చంద్రయాన్ 2: ఇస్రో విక్రమ్ ల్యాండర్‌తో మళ్లీ కనెక్ట్ అయ్యేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది...

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల వల్ల భారత్‌లో ధరలు పెరుగుతాయా?

క్యాన్సర్ చికిత్స పేరుతో యూట్యూబ్ నకిలీ వీడియోలతో సొమ్ము చేసుకుంటోందా?