జమాల్ ఖషోగ్జీ హత్య కేసు: సౌదీ క్రౌన్ ప్రిన్స్‌ను సీఐఏ నిందించలేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • 23 నవంబర్ 2018
సౌదీ సింహాసనానికి వారసుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ Image copyright FAYEZ NURELDINE

జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీని హత్య చేయమని సౌదీ సింహాసనానికి వారసుడైన (క్రౌన్ ప్రిన్స్) మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశించినట్లు సీఐఏ నిర్థరించలేదని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పారు.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో అక్టోబర్ 2వ తేదీన ఖషోగ్జీ మరణించారు.

ఇలాంటి ఆపరేషన్లకు ప్రిన్స్ అనుమతి అవసరమవుతుందని అమెరికా అధికారులు చెప్పారు. అయితే సౌదీ అరేబియా మాత్రం ఇది ‘వంచకుల ఆపరేషన్’ అని చెబుతోంది.

ఈ కేసులో అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ నిర్థరణలపై ఫ్లోరిడాలో విలేకరులు ప్రశ్నించగా.. ‘‘వాళ్లింకా నిర్థరించలేదు’’ అని ట్రంప్ స్పందించారు.

ఖషోగ్జీ హత్య తర్వాత మొహమ్మద్ బిన్ సల్మాన్ తొలి అధికారిక పర్యటనలో భాగంగా మధ్య ప్రాచ్యంలో పర్యటిస్తున్నారు. గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఈ పర్యటన ప్రారంభమైంది.

ఈ నెలాఖరున బ్యూనోస్ ఎయిర్స్‌లో జరుగనున్న జీ20 ప్రపంచ నేతల సదస్సుకు కూడా మొహమ్మద్ బిన్ సల్మాన్ హాజరుకావాల్సి ఉంది. ఈ సదస్సుకు అమెరికా, టర్కీ దేశాలతో పాటు యురోపియన్ యూనియన్‌లోని పలు దేశాల నేతలు కూడా హాజరవుతారు.

కాగా, ఖషోగ్జీ హత్య కేసు విషయంలో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 18 మంది సౌదీ పౌరులపై అమెరికా, యూకే, జర్మనీలు ఆంక్షలు విధించగా.. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వారిపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.

Image copyright Reuters

సీఐఏ నివేదికపై ట్రంప్ ఏం చెప్పారు?

‘‘కొన్ని నిర్దిష్ట మార్గాలపై వారికి భావాలు ఉన్నాయి. నివేదిక నా వద్ద ఉంది.. వాళ్లింకా నిర్థరించలేదు.. ఇది చేసింది క్రౌన్ ప్రిన్సే అని ఎవరైనా స్పష్టంగా చెప్పబోతున్నారన్నది నాకు తెలియదు’’ అని ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.

‘‘కానీ, ఆయన చేశారా.. చేయలేదా, ఆయన మాత్రం గట్టిగా ఖండిస్తున్నారు. ఆయన తండ్రి.. (సౌదీ) రాజు కూడా ఖండిస్తున్నారు’’ అని ట్రంప్ చెప్పారు.

ఇంతకు ముందు.. ఇదే వారంలో.. ఈ విషయంపై ట్రంప్ ఒక ప్రకటన చేస్తూ.. హత్య గురించి క్రౌన్ ప్రిన్స్‌కు బహుశా స్పష్టంగా తెలిసి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు.

‘‘ఈ విషాద సంఘటన గురించి క్రౌన్ ప్రిన్స్‌కు చాలా బాగా తెలిసి ఉండొచ్చు. బహుశా ఆయన చేసి ఉండొచ్చు.. చేసి ఉండక పోవచ్చు’’ అని ఆ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.

హత్య అనంతరం.. అమెరికాకు సౌదీ అరేబియా ఎంత ముఖ్యమో ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. సౌదీ అరేబియా ‘‘దృఢమైన భాగస్వామి’’ అని, అమెరికాలో రికార్డు స్థాయిలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిందని ట్రంప్ నొక్కి చెప్పారు.

అమెరికా మీడియా ప్రస్తావించిన సోర్సుల ప్రకారం.. ఈ హత్య కేసుతో క్రౌన్ ప్రిన్స్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని నిర్థరించేందుకు అవసరమైన ఒక్క ఆధారం కూడా లేదు, కానీ హత్యకు ఆయన ఆమోదం అవసరమని అధికారులు విశ్వసిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సౌదీ రైటర్‌ను వీలైనంత త్వరగా ‘మౌనం’ వహించేలా చేయాలని క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు ఇచ్చారని, ఆ రికార్డింగ్ సీఐఏ వద్ద ఉందని గత నెలలో టర్కీ అధికారులతో సీఐఏ డైరెక్టర్ హస్పెల్ చెప్పారని హురియత్ న్యూస్ పేపర్ గురువారం ఒక వార్తను ప్రచురించింది.

దీనిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘నేను దీని గురించి మాట్లాడదల్చుకోలేదు. మీరు వాళ్లని అడగండి’’ అని ట్రంప్ బదులిచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఒక పెళ్లి పత్రాన్ని పొందేందుకు జమాల్ ఖషోగ్జీ ఇస్తాంబుల్ వెళ్లారు

సౌదీ అరేబియా ఏం చెబుతోంది?

ఖషోగ్జీ హత్యకు క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలు ఇచ్చారని వస్తున్న వార్తలు నిజం కాదని, ఆయనకు దీని గురించి ఏమీ తెలియదని సౌదీ చెబుతోంది.

సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్పందిస్తూ.. ఖషోగ్జీ రాయబార కార్యాలయంలోపలే చనిపోయారని, అది ఒక నిఘా అధికారి ఆదేశాల ప్రకారం జరిగిన ‘వంచకుల ఆపరేషన్’ అని తెలిపారు.

"కాన్సులేట్‌ భవనంలో ఖషోగ్జీకి ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ భవనంలోనే శవాన్ని ముక్కుముక్కలు చేశారు. తర్వాత ఆ శరీర భాగాలను ఓ స్థానిక 'సహాయకుడి'కి ఇచ్చారు" అని సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు.

ఆ శరీర భాగాలు ఎక్కడ వేశారో కనుగొనేందుకు సోదాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

ఈ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అయితే వారెవరో గుర్తించలేదు. తమ దర్యాప్తులో.. ఈ హత్యకు ఆదేశాలు ఇచ్చింది దర్యాప్తు బృందానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి అని తేలిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెల్లడించారు.

జమాల్ ఖషోగ్జీ ఎవరు?

జమాల్ ఖషోగ్జీ జర్నలిస్టు, రచయిత. ఆయన దశాబ్దాలపాటు సౌదీ అరేబియా రాజ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. ప్రభుత్వ సలహాదారుగా కూడా వ్యవహరించారు.

రాజ కుటుంబానికి దూరమైన తర్వాత ఆయన గత ఏడాది అమెరికా వెళ్లిపోయి అక్కడే ఉండిపోయారు. వాషింగ్టన్ పోస్ట్‌లో కాలమ్స్ రాస్తున్న ఖషోగ్జీ వాటిలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ విధానాలను విమర్శించేవారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)