అడుక్కోవడానికి సిగ్గు అనిపించింది, అందుకే నా ‘కాళ్లపై’ నేను నిలబడ్డా

  • 25 నవంబర్ 2018
బాను

చేతులు లేవని తల్లి దూరం పెట్టింది. ఏ పనీ రాదని ఊళ్లో వాళ్లు పట్టించుకోలేదు. యాచించడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చింది. అయితేనేం, ఆ యువతి ఇప్పుడు తన 'కాళ్ల'పైనే ఆధారపడి జీవిస్తోంది.

బంగ్లాదేశ్‌కు చెందిన బాను అక్తర్‌కు పుట్టుకతో చేతులు లేవు. అయినా ఆమె అధైర్యపడలేదు. కాళ్లనే చేతుల్లా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎన్నో కష్టాలను దాటి కళాకృతులు తయారు చేయడంలో నైపుణ్యం సాధించింది.

‘పుట్టగానే నన్ను చూసి మా అమ్మ భయపడిందట. తను నాకు పాలు కూడా ఇవ్వలేదు. వికలాంగులను పెంచడం భారమని, నన్ను చంపేయమని చుట్టుపక్కలవాళ్లు మా అమ్మానాన్నకు సలహా ఇచ్చారు. కానీ, మా అమ్మ నన్ను చంపలేదు.

మా తల్లిదండ్రులు నాకు నడక కూడా నేర్పలేదు. బడికి పంపలేదు. చిన్నప్పుడు సొంతంగా నడవడం నేర్చుకున్నా. ఊళ్లో ఓ పెద్దమనిషి సాయంతో స్కూలుకు వెళ్లా. ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదన్న బాధతో ఇల్లొదిలి ఢాకా వచ్చేశా.

ఇంటింటికీ వెళ్లి పనికోసం అడిగా. కానీ, నాకు చేతులు లేవని ఎవరూ అవకాశం ఇవ్వలేదు. నాకు అడుక్కోవడానికి సిగ్గుగా అనిపించింది. అందరిలానే నేనూ కష్టపడి సంపాదించాలని అనుకున్నా. క్రమంగా బట్టలు కుట్టడం, కళాకృతులు చేయడం నేర్చుకున్నా’ అంటూ బాను తన కథను చెబుతోంది.

ప్రస్తుతం తాను బతకడానికి సరిపడా డబ్బును ఆమే సంపాదించుకుంటోంది..

‘చేతులు లేకపోతేనేం, కాళ్లతో పాటు కొండంత ఆత్మవిశ్వాసం ఉందిగా’ అంటున్న బాను అక్తర్ కథను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు