సుహాయీ అజీజ్: కరాచీలో చైనా కాన్సులేట్‌పై దాడి ఘటనలో సిబ్బందిని కాపాడిన లేడీ పోలీస్ ఆఫీసర్

  • 24 నవంబర్ 2018
పాక్ లేడీ పోలీస్ Image copyright SUHAIAZIZ/FACEBOOK
చిత్రం శీర్షిక సుహాయీ అజీజ్

"అమ్మాయిలు సున్నితంగా ఉన్నా, సాహసాలూ చేయగలరు. ఒక మహిళ ధైర్యంగా ఉండడమే కాదు, అవసరమైనప్పుడు తన సత్తా చూపించగలదు".

సుహాయీ అజీజ్ తల్పూర్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మాటలు చెప్పారు. ఇప్పుడు వాటిని చేతల్లో చూపారు.

సుహాయీ పాకిస్తాన్ సింధ్ పోలీస్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 23న కరాచీలోని చైనా కాన్సులేట్‌పై దాడి జరిగిన సమయంలో ఆమె సెక్యూరిటీ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. దాడిని తిప్పికొట్టారు.

పాకిస్తాన్ అంతా ఇప్పుడు సుహాయీ ధైర్యాన్ని ప్రశంసిస్తోంది.

పాకిస్తాన్ కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో ఉన్న చైనా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది.

దాడికి పాల్పడ్డవారు కాన్సులేట్‌లో చొరబడకుండా పోలీసులు అడ్డుకున్నారు. లోపల ఉన్న ఉద్యోగులందరి ప్రాణాలూ కాపాడారు.

ఈ దాడికి పాల్పడింది తామేనని వేర్పాటువాద సంస్థ 'బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ' ప్రకటించింది.

Image copyright DAWN

సాహసానికి సలాం

పాకిస్తాన్ మీడియా సుహాయీ అజీజ్ తల్పూర్‌పై ప్రశంసలు కురిపిస్తోంది. సుహాయీ ఈ దాడిని అడ్డుకోడంలో కీలక పాత్ర పోషించారని చెబుతోంది. లేదంటే ఈ దాడిలో నష్టం తీవ్రంగా ఉండేదని చెబుతోంది.

సుహాయీ అజీజ్ 2013లో పాకిస్తాన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాసయ్యారు. తర్వాత పోలీస్ ఫోర్సులో చేరారు. రిపోర్టుల ప్రకారం లోయర్ సింధ్‌లో ఆమె మొదటి లేడీ పోలీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్.

ఇంటర్నెట్‌లో ప్రశంసలు

సుహాయీ అజీజ్ తల్పూర్ పాకిస్తాన్‌లో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నారు. అందరూ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు.

దాడిని అడ్డుకోవడంలో సింధ్ పోలీసుల సాహసాన్ని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ప్రశంసించారు. సుహాయీ అజీజ్ సహా అధికారులందరికీ సలాం చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ఆయేషా అనే యువతి "రక్షించేవారి అవసరం లేనప్పుడు మాత్రం, మహిళను వంటింటికే పరిమితం అని చెబుతారు" అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు