ఫ్రాన్స్ చమురు ధరలు: లీటర్ డీజిల్ రూ.120 – వాహనాలకు నిప్పుపెట్టిన జనం

  • 25 నవంబర్ 2018
ఫ్రాన్స్ ఆందోళనలు Image copyright AFP

ఫ్రాన్స్‌లో డీజిల్, పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా రాజధాని పారిస్‌లో ప్రజలు ఆందోళనలకు దిగారు. ప్రదర్శనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో వారిని చెదరగొట్టారు.

పారిస్‌లో గత రెండు వారాలుగా ప్రతి వారాంతంలో ప్రజలు ఈ ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు.

పారిస్‌లోని షాంజ్ ఎలీజేలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించడానికి ప్రయత్నించిన ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆందోళనకారులు చాలా వాహనాలకు నిప్పుపెట్టారు.

వేలాది మంది ఆందోళనకారులు గుమిగూడడంతో వారిని అదుపు చేసేందుకు సుమారు 3 వేల మంది పోలీసులను మోహరించారు.

ఇంధన ధరలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో నిరసనకారులందరూ పసుపు రంగు జాకెట్లు ధరించారు.

Image copyright Reuters

పసుపు జాకెట్లు ఎందుకు?

ఫ్రాన్స్‌లో కార్లు ఆగిపోయిన సమయంలో రోడ్డుపై ఉన్న డ్రైవర్లు కచ్చితంగా పసుపు జాకెట్లు ధరించాలనే నియమం ఉంది.

దూరం నుంచి స్పష్టంగా కనిపించే ఈ పసుపు జాకెట్ల వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే అందరూ వీటిని కార్లలో పెట్టుకుంటారు.

ఇప్పుడు వాటినే నిరనసకారులు తమ ఆందోళనల్లో ధరిస్తున్నారు.

షాంజ్ ఎలీజేలో ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు ఇతర ప్రభుత్వ భవనాలున్నాయి. ప్రదర్శనకారులను అడ్డుకునేందుకు ఈ భవనాల ముందు భద్రత కట్టుదిట్టం చేశారు. మెటల్ బ్యారికేడ్స్ పెట్టారు.

ఆందోళనకారుల్లో కొందరు రోడ్డుపైనే టపాసులు పేల్చారు, ఫుట్ పాత్‌పై ఉన్న రాళ్లను పోలీసులపైకి విసిరారు. అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బ్యారికేడ్లకు నిప్పు పెడుతున్న ఆందోళనకారులు

ధరలపై ఆగ్రహం ఎందుకు?

ఫ్రాన్స్‌లో డీజిల్ కార్ల వినియోగం ఎక్కువ. దేశంలో గత 12 నెలలుగా డీజిల్ ధరలు 23 శాతం పెరిగాయి. సగటున లీటరు ధర 1.71 డాలర్లు (రూ.120) ఉంది. 2000 తర్వాత దేశంలో చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరాయి.

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగి, తర్వాత మళ్లీ తగ్గాయి. కానీ ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం డీజిల్‌పై లీటరుకు 7.6 సెంట్లు, పెట్రోల్‌పై లీటరుకు 3.9 సెంట్లు హైడ్రోకార్బన్ ట్యాక్స్ విధించింది. విద్యుత్ కార్లు, గ్రీన్ ఫ్యూయల్ వినియోగించాలనే ప్రచారం కోసమే ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

2019 జనవరి 1 నుంచి డీజిల్ ధరను లీటరుకు 6.5 సెంట్లు, పెట్రోలుపై 2.9 సెంట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమైంది.

ఇటు, ధరలు పెంచడానికి ప్రధాన కారణం ముడి చమురు ధరలే అని దేశాధ్యక్షుడు మేక్రాన్ చెబుతున్నారు. పునరుత్పాదక శక్తిలో పెట్టుబడుల కోసం శిలాజ ఇంధనంపై పన్నులు వేయడం అవసరం అంటున్నారు.

'పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడం సిగ్గుచేటు'గా మేక్రాన్ వర్ణించారు. 'ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదని' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)