థాయ్ బఫెలో ఫ్రెండ్: బర్రెతో కలిసి సెలబ్రిటీగా మారిన కాపరి

  • 25 నవంబర్ 2018
బఫెలో ఫ్రెండ్ Image copyright FACEBOOK/สุรัตน์ แผ้วเกตุ

జంతువులతో చాలామంది స్నేహం చేస్తుంటారు. అది మామూలే. కానీ ఒక పశువుల కాపరి తాను మేపే బర్రెతో స్నేహం చేశాడు. దానితో కలిసి థాయ్‌లాండ్‌ సెలబ్రిటీగా మారిపోయాడు.

థాయ్‌లాండ్‌లో సురత్ పేవ్కాటే అనే ఒక రైతు థాంగ్ ఖామ్ అనే బర్రెకు కాపరి. బర్రెను మేపుకొచ్చినందుకు దాని యజమాని అతడికి కొంత డబ్బు ఇచ్చేవాడు.

థాంగ్ ఖామ్‌ను రోజూ మేపుకొచ్చే అతడికి మెల్లగా దానితో మంచి స్నేహం ఏర్పడింది. ఆ బర్రె వీపున పడుకుని వరిపొలాల్లోకి వెళ్లడం అంటే పెవ్యాటేకు ఇష్టం. అంతే కాదు రోజూ దానితో సెల్ఫీలు కూడా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు.

వాటిని అతడి ఫ్రెండ్స్ కూడా ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవడంతో ఈ ఫొటోలు మరింత వైరల్ అయ్యాయి. థాంగ్ ఖామ్‌తో కలిసి పెవ్కాటే బఫెలో ఫ్రెండ్‌గా ఇంటర్నెట్ సెలబ్రిటీగా అయిపోయాడు.

కానీ థాంగ్ ఖామ్‌ యజమాని దానిని వేరేవాళ్లకు అమ్మేయాలనుకోవడంతో పెవ్కాటేకు కష్టాలు మొదలయ్యాయి. తన ఫ్రెండును వదిలి ఎలా ఉండాలా అని పెవ్కాటే కొన్నిరోజులు బాధపడిపోయాడు.

Image copyright FACEBOOK/สุรัตน์ แผ้วเกตุ

ఇంటర్నెట్ సెలబ్రిటీ

థాంగ్ కామ్ బర్రెతో పెవ్కాటే స్నేహం రెండు నెలల క్రితం మొదలైంది. చాయ్నట్ ప్రావిన్సు వాసి అయిన అతడు ఉపాధి కోసం ఆ బర్రెను మేపే పనికి చేరాడు.

ఒకరోజు థాంగ్ ఖామ్‌తో సెల్ఫీలు తీసుకుంటున్న పెవ్కాటే అది కూడా తనను అనుకరిస్తున్నట్టు గుర్తించాడు.

"థాంగ్ ఖామ్ నేను చేసినట్టే చేస్తుంది. నేరుగా ఫోను వైపు చూడ్డం. నాకు దగ్గరగా రావడం, నవ్వినట్టు ఉండడం లాంటివాటికి అలవాటు పడింది" అని పేవ్కాటే చెప్పాడు.

అతడు సరదాగా వాటిని తన ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. అవి ఎంతగా పాపులర్ అయ్యాయయంటే, ఫేస్‌బుక్‌లో అతడు పోస్ట్ చేసిన ఫొటోలు 32 వేల సార్లు షేర్ అయ్యాయి.

బర్రె కొనుగోలు కోసం విరాళాల సేకరణ

అంతే కాదు ఇంకా ఫొటోలు పెట్టమని అతడికి సందేశాలు వస్తూనే ఉన్నాయి.

కానీ థాంగ్ ఖామ్‌ను అమ్మేయాలని దాని యజమాని నిర్ణయించడంతో పెవ్కాటే బెంగ పడిపోయాడు. ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో చెప్పుకున్నాడు.

"నాకు చాలా బాధగా ఉంది. థాంగ్ ఖామ్(బర్రె)ను కొనేంత డబ్బు నా దగ్గర లేదు. దాన్ని కొనడానికి లక్ష థాయ్ బత్‌లు(రూ.2 లక్షలకు పైగా) కావాలి" అని చెప్పాడు.

"నా స్నేహితుల్లో కొందరు మేం ఇస్తామని చెప్పారు. దాంతో నేను థాంగ్ ఖామ్‌ను కొనడానికి అందరినీ విరాళాలు అడుగుదామని నిర్ణయించుకున్నాను"

రెండ్రోజుల్లోనే అతడు లక్షా 35 వేలకు పైగా థాయ్ భత్‌లు(దాదాపు రూ.3 లక్షలు) విరాళంగా సేకరించగలిగాడు.

Image copyright FACEBOOK/สุรัตน์ แผ้วเกตุ

బఫెలో ఫ్రెండ్ ఫరెవర్

విరాళాల డబ్బుతో పెవ్కాటే ఇప్పుడు అధికారికంగా థాంగ్ ఖామ్ యజమాని అయ్యాడు. ఆ సందర్భాన్ని అందరితో ఘనంగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు.

స్థానిక అధికారులు కోరిక మేరకు బర్రెను కొనడానికి తనకు ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారో కూడా పెవ్కాటే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

"నేను సాయం చేసిన అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నా. థాంగ్ ఖామ్‌ను దాని జీవితాంతం సంతోషంగా చూసుకుంటాను. క్రమం తప్పకుండా దాని ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎవరైనా థాంగ్ ఖామ్‌ను చూడాలనుకుంటే వారికి స్వాగతం" అని పేవ్కాటే చెప్పాడు.

బర్రెను కొనగా మిగిలిన డబ్బును ఏం చేయాలో కూడా మీరే చెప్పాలని అతడు తన ఫేస్‌బుక్ స్నేహితులనే అడుగుతున్నాడు.

"నేను ఒక పొలం, ఒక ఇల్లు, ఒక బర్రె కొనుక్కుని, ఆ బర్రెపై పడుకుని పొలం దగ్గరకు వెళ్లాలని కలలు కనేవాడ్ని. థాంగ్ ఖామ్‌ వల్ల ఇప్పుడు నా చివరి కల నెరవేరింది" అంటున్నాడు పెవ్కాటే.

మొన్నటివరకూ 'బఫెలో ఫ్రెండ్' అనిపించుకున్న పెవ్కాటే ఇప్పుడు 'బఫెలో ఫ్రెండ్ ఫరెవర్' అయ్యాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు LIVE: జగన్ సునామీ... 152 స్థానాల్లో ఆధిక్యం... 23 స్థానాల్లోనే టీడీపీ ప్రభావం.. రాజోలులో జనసేన గెలుపు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 300 స్థానాల్లో బీజేపీ.. 49 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: నిజామాబాద్‌లో కవిత వెనుకంజ, మాల్కాజిగిరిలో రేవంత్ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

57 ఏళ్ల తరువాత తెలుగు నేలపై యంగ్ సీఎం

అమేఠీలో రాహుల్ గాంధీ వెనుకంజ.. ఆధిక్యంలో స్మృతీ ఇరానీ

‘జగన్‌కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్‌కు మాత్రమే ఉండేది’

నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు