బ్రెగ్జిట్‌కు ఈయూ లైన్ క్లియర్: మరి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదిస్తుందా?

  • 25 నవంబర్ 2018
బ్రస్సెల్స్‌లో థెరెసా మే Image copyright Reuters
చిత్రం శీర్షిక బ్రస్సెల్స్‌లో థెరెసా మే

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణకు ఈయూ నేతలు అంగీకరించారు. ఈ మేరకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ ఒక ప్రకటన చేశారు.

బ్రస్సెల్స్‌లో గంటలోపే ముగిసిన చర్చల్లో 27 మంది నేతలు బ్రెగ్జిట్‌కు అంగీకారం తెలిపారు.

రెండు వర్గాలు సుమారు 18 నెలల పాటు చర్చలు జరిపిన అనంతరం ఈ ఒప్పందానికి అంగీకారం లభించింది.

వచ్చే ఏడాది మార్చి 29న బ్రెగ్జిట్‌కు ముహూర్తంగా నిర్ణయించారు.

ఈ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉండగా, అనేక మంది ఎంపీలు దీనిని వ్యతిరేకిస్తున్నారు.

బ్రెగ్జిట్‌పై వచ్చే నెలలో బ్రిటన్ పార్లమెంట్‌లో ఓటింగ్ జరగనుంది. అయితే దానికి ఆమోదం లభిస్తుందన్న గ్యారంటీ లేదు.

లేబర్, లిబరల్ డెమోక్రాట్లు, స్కాటిష్ నేషనల్ పార్టీ, డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ ఎంపీలు, అనేక మంది కన్జర్వేటివ్ ఎంపీలు దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావిస్తున్నారు.

ఈ ఒప్పందానికి ముందు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జక్నర్.. ఈయూ నుంచి బ్రిటన్ విరమించుకోవడం విషాదకరంగా అభివర్ణించారు.

తర్వాతేం జరుగుతుంది?

బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం తెలపమని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులను కోరవచ్చు.

డిసెంబర్ రెండోవారంలో పార్లమెంటులో బ్రెగ్జిట్‌పై ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఆమె బ్రిటన్ అంతటా పర్యటించి, బ్రెగ్జిట్‌కు మద్దతుగా ప్రచారం చేయవచ్చు.

ఒకవేళ ఓటింగ్‌లో ఎంపీలు బ్రెగ్జిట్‌ను నిరాకరిస్తే, మరోసారి చర్చలు జరగవచ్చు.

ఈ ఒప్పందానికి యూరోపియన్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలపాల్సి ఉంది. అక్కడ మొత్తం 27 దేశాలలో కనీసం 20 దేశాలు దానికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే యూరోపియన్ పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనికి ఆమోదం లభించాలి.

Image copyright Getty Images

బ్రెగ్జిట్‌ గురించి తెలుసుకోవాల్సిన 7 విషయాలు

1. ఏంటీ బ్రెగ్జిట్?

యూరోపియన్ యూనియన్ దేశాల్లో బ్రిటన్ ఓ భాగస్వామి. కానీ, ఇప్పుడు ఆ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని అనుకుంటోంది.

ఈయూ నుంచి 'బ్రిటన్', 'ఎగ్జిట్'(తప్పుకోవడం) కావడాన్నే 'బ్రెగ్జిట్' అని పిలుస్తున్నారు. దీన్ని, బ్రిటన్‌కు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలకు మధ్య విడాకులుగా కూడా అభివర్ణిస్తున్నారు.

2. ఎలా విడిపోతోంది?

యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా వద్దా అనే దానిపై 2016, జూన్ 23న రెఫరెండం నిర్వహించారు. ఆ రెఫరెండంలో 71.8% అంటే 3 కోట్లమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి అనుకూలంగా 51.9శాతం మంది ఓటేశారు.

3. ఎప్పుడు విడిపోతుంది?

2019 మార్చి 29, శుక్రవారం రాత్రి 11గంటలకు యురోపియన్ యూనియన్ నుంచి అధికారికంగా విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించింది.

Image copyright Getty Images

4. యురోపియన్ యూనియన్ అంటే ఏమిటి?

వాణిజ్య, రాజకీయ సహకారం కోసం వివిధ దేశాల భాగస్వామ్యంతో ఏర్పడిన కూటమే యూరోపియన్ యూనియన్. ఇందులో ప్రస్తుతం యూకేతో కలిపి 28 దేశాలున్నాయి.

రెండో ప్రపంచ యుద్ధం తరువాత దేశాల మధ్య వాణిజ్యపరమైన సహకారం కోసం యురోపియన్ యూనియన్ ఆవిర్భవించింది. ఒకదానితో ఒకటి వ్యాపారం చేసే దేశాలు పరస్పరం యుద్ధానికి దిగకూడదన్నదే ఈ యూనియన్ ఏర్పాటు వెనకున్న ఉద్దేశం.

యూనియన్‌లోని అన్ని దేశాల మధ్య ప్రజలు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా తిరగొచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు. యూనియన్‌లోని 19 దేశాలు 'యూరో'ను కరెన్సీగా ఉపయోగిస్తాయి.

5. ఎందుకు విడిపోతోంది?

యురోపియన్ యూనియన్‌లో ఉన్న కారణంగా తాము వెనకబడిపోతున్నట్లు బ్రిటన్ భావిస్తోంది.

వ్యాపార విషయాల్లో అనేక పరిమితులు విధిస్తున్నారని, సభ్యత్వ రుసుం కింద ఏటా వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, కానీ దానికి సరైన ప్రతిఫలం దక్కట్లేదని ఆ దేశం చెబుతోంది.

ఇతర ఈయూ దేశాల నిర్ణయాలపై ఆధారపడ్డ చట్టాలు కాకుండా మొత్తంగా కొత్త చట్టాలను రూపొందించుకోవాలని బ్రిటన్ భావిస్తోంది.

Image copyright Getty Images

6. వ్యాపార ఒప్పందాలు లేకపోతే ఏమవుతుంది?

యూరోపియన్ యూనియన్‌కు, యూకేకు మధ్య వ్యాపార ఒప్పందం జరగకపోతే, బ్రెగ్జిట్ అనంతరం 'వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్' నియమాలకు అనుగుణంగా వ్యాపారం జరుగుతుంది.

దానివల్ల కస్టమ్స్ తనిఖీలు, పన్నులు, ప్రయాణీకులకు సరిహద్దుల దగ్గర తనిఖీలు లాంటి అనేక నిబంధనలు అమల్లోకి వస్తాయి.

7. వీసా అవసరమా?

ఇప్పటిదాకా యూరోపియన్ యూనియన్‌లోని దేశాల ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడానికి వీసా అవసరం లేదు. బ్రెగ్జిట్ తర్వాత కూడా ఈయూ నుంచి యూకే వచ్చే పర్యటకులకు వీసా రహిత ప్రయాణం కల్పించాలని యూకే ప్రభుత్వం భావిస్తోంది.

దానివల్ల యూకే ప్రజలు కూడా స్వేచ్ఛగా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్లే సౌలభ్యం ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన.

కానీ.. చదువు, ఉద్యోగం, లేదా స్థిరపడటానికి యూకే వచ్చే యూరోపియన్లు మాత్రం బ్రెగ్జిట్ అనంతరం దానికి అనుమతి పొందాలనే ప్రతిపాదనలున్నాయి. ప్రస్తుతం వాళ్లకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)