అంగారకుడిపై నాసా ఇన్‌సైట్ ల్యాండర్: దిగిన తర్వాత మొదటి 7 నిమిషాలే కీలకం

  • 26 నవంబర్ 2018
అంగారకుడి చిత్రం

అంగారకుడిపై మరో రొబోటిక్ పరిశోధనకు నాసా సిద్ధమవుతోంది. అంగారకుడి ఉత్తర భాగంలోని చదును ప్రాంతం లక్ష్యంగా 'ఇన్‌సైట్ ల్యాండర్'ను ప్రయోగించారు. ఈ ప్రాంతాన్ని ఎలిసియమ్ ప్లానిషియా అని పిలుస్తారు.

ఇందులోని యంత్ర సామాగ్రిలో చాలా భాగం యూరప్‌కు చెందినదే. ఈ పరికరాల సాయంతో అంగారకుడిపై ఉన్న రాతిపొరల లోపలి నిర్మాణాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు.

భారత కాలమానం ప్రకారం నవంబర్ 27 తెల్లవారుజాము 1:23 గంటలకు కాస్త అటుఇటుగా ఇన్‌సైట్ ల్యాండర్ అంగారకుడిపై ల్యాండ్ అవ్వనుంది.

గతంలోకూడా నాసా ఇలాంటి ప్రయోగాలను చేసింది. కానీ ఆ ప్రయోగాల్లో చాలావరకు విఫలమయ్యాయి. అంగారకుడి ఉపరితలంలోని వాతావరణాన్ని స్పేస్ క్రాఫ్ట్ తట్టుకుని నిలవాలి. అందుకే అంగారకుడిపై చేరిన మొదటి 7 నిమిషాలు ఈ ప్రయోగంలో అత్యంత కీలకం.

అంగారకుడిపై ఉన్న పలుచటి వాతావరణంలో అత్యంత వేగంతో ప్రవేశించే ఇన్‌సైట్ ల్యాండర్, తన వేగాన్ని నియంత్రించుకుంటూ అంగారకుడి ఉపరితల వాతావరణానికి అనువైన వేగంతో ల్యాండ్ అవ్వాలి.

''ఇంతవరకూ చాలా ప్రయోగాలు జరిగాయి. అందులో చాలా విఫలమయ్యాయి కూడా. అంగారకుడిపైకి వెళ్లడం చాలా చాలా కష్టం'' అని నాసా ఉన్నతాధికారి థామస్ జర్బుచన్ అన్నారు.

ప్రయోగం ఖర్చు ఎంత?

ఈ ప్రయోగానికి ఓ వారసత్వ సాంకేతిక పరిజ్ఞానం దోహదం చేస్తోంది.

2007లో నాసా ప్రయోగించిన ‘ఫీనెక్స్‌’ను అంగారకుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన హీట్ షీల్డ్, పారాచూట్, రెట్రో-రాకెట్ల సాంకేతిక పరిజ్ఞానాన్నే మళ్లీ ఈ ప్రయోగంలో ఉపయోగిస్తున్నారు.

ఈ ప్రయోగం సత్ఫలితాలను ఇస్తుందని ప్రయోగాన్ని సమీక్షిస్తున్న ఈడీఎల్(ఎంట్రీ, డీసెంట్ అండ్ ల్యాండింగ్) ఇంజనీర్లు ధీమా వ్యక్తం చేశారు. గతంలోని ఫలితాల తాలూకు గణాంకాల పట్ల తమకు అవగాహన ఉందంటున్నారు.

''అంగారకుడిపై స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా ల్యాండ్ అవ్వడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేశాం'' అని ప్రాజెక్ట్ మేనేజర్ టామ్ హాఫ్‌మ్యాన్ అన్నారు.

''అంగారక గ్రహం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రయోగానికి మేం సిద్ధంగా ఉన్నాం. మా స్పేస్ క్రాఫ్ట్ కూడా సిద్ధంగానే ఉంది. కానీ అంగారకుడే సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు'' అని టామ్ బీబీసీతో అన్నారు.

తాజా సమాచారం ఏమిటి?

ఈడీఎల్ ఇంజనీర్లు.. అంగారకుడిపైని వాతావరణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా అంగారకుడి వాతావరణంలోకి ఇన్‌సైట్ ప్రవేశాన్ని కష్టతరం చేసే దుమ్ము తుపానులు, పెనుగాలులు వీచే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

లక్ష్యానికి అనుగుణంగా ఇన్‌సైట్‌కు నిర్దేశించిన గతి మార్గంలో ఆదివారం నాడు స్వల్ప మార్పులు చేశారు.

ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటెడ్ విధానంలోనే ఉంటుంది. అలాకాకుండా కమాండ్స్ ద్వారా ప్రయోగాన్ని నిర్వహించాలంటే ఇక్కడ ఇచ్చే కమాండ్లు అంగారకుడికి చేరడానికి 8 నిమిషాల సమయం పడుతుంది.

అంగారకుడిపై అడుగుపెట్టిన వెంటనే ఇన్‌సైట్ వెలువరించి సందేశాలు.. రెండు చిన్న ఉపగ్రహాల ద్వారా భూమికి చేరతాయి.

ప్రాథమిక సమాచార వ్యవస్థ పని చేయక, ఇన్‌సైట్‌తో సంబంధాలు కోల్పోయిన పక్షంలో ఇన్‌సైట్ పనితీరును గమనించడానికి భూమి మీద నుంచి రేడియో టెలిస్కోప్‌కూడా ఈ ప్రక్రియను గమనిస్తూనే ఉంటుంది.

ల్యాండ్ అయిన వెంటనే ఈ స్పేస్‌క్రాఫ్ట్.. పరిసరాలను ఫోటోతీసి భూమికి పంపేలా సిద్ధం చేస్తుందని ఊహించుకుంటే.. ఆ ఫోటోలు భూమిని చేరడానికి 30 నిమిషాల సమయం పట్టవచ్చు.

Image copyright Getty Images

దీని ప్రత్యేకతలు ఏమిటి?

అంగారకుడి లోపలి నిర్మాణాలను అధ్యయనం చేయడానికి ఉద్దేశించిన మొట్టమొదటి ప్రయోగం ఇది.

ప్రపంచం ఎలా ఏర్పడిందన్న అంశాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌సైట్ ముందు 3 ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. అందులో..

ఫ్రాన్కో-బ్రిటీష్ సిస్మోమీటర్స్:

భూకంపన తరంగాల లాగే అంగారకుడి అంతర్భాంగంలోని కంపన తరంగాలను విశ్లేషించడం ద్వారా, అంగారకుడిపై ఉన్న రాతిపొరలు ఎక్కడివి? ఎప్పుడు ఏర్పడ్డాయి అన్న ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు.

జర్మన్ మోల్:

అంగారకుడి ఉపరితలం నుంచి 5 మీటర్ల లోతుకు రంధ్రం చేసి, ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రతల ద్వారా అంగారక గ్రహం పనితీరును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

రేడియో ట్రాన్స్‌మిషన్స్:

రేడియో ట్రాన్స్‌మిషన్స్ ద్వారా, అంగారక గ్రహం ఏవిధంగా తన ‘అక్షం’ మీద ఆధారపడి ఉందన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధరించడానికి ప్రయత్నిస్తారు.

''ఉడకబెట్టిన గుడ్డు, సాధారణ గుడ్డును ఒకేసారి గిరగిరా తిప్పితే, అవి తిరిగే విధానం వేరు వేరుగా ఉంటుంది. ఆ తేడా.. వాటిలోపల ఉన్నటువంటి పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. అలానే, అంగారకుడి అంతర్భాగం ద్రవరూపమా లేక ఘనరూపంలో ఉందా మనకు తెలీదు. అసలు ఈ గ్రహపు అంతర్భాగం ఎంత పెద్దదో కూడా తెలీదు. కానీ ఈ ప్రయోగం ఆ సమాచారాన్ని మనకిస్తుంది'' అని డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ సుజానే స్మ్రేకర్ అన్నారు.

ఇది తెలుసుకోవడం ఎందుకు?

భూమి అంతర్గత నిర్మాణం ఎలా ఉందో శాస్త్రజ్ఞులకు బాగా తెలుసు. 450 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ సౌర వ్యవస్థ ఆవిర్భావం మొదలైన విధానాన్ని వివరించడానికి అవసరమైన నమూనాలు వారి వద్ద ఉన్నాయి. కానీ అంగారకుడిపై జరిపే పరిశోధనలు శాస్త్రవేత్తలను మరో కోణంలో ఆలోచింపచేస్తాయి.

గ్రహాల ఆవిర్భావానికి సంబంధించిన కొన్ని చిన్నచిన్న విషయాలు.. భూమిపై బయటకు వెళితే ఎందుకు నల్లబడతారు? శుక్ర గ్రహంపై సెకెన్లలోనే ఎందుకు మాడిపోతారు? అదే అంగారకుడిపై బయటకు వెళితే ఎందుకు గడ్డకట్టుకుపోయి చనిపోతారు అన్నవాటిని వివరిస్తాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)