అంగారక గ్రహంపై క్షేమంగా దిగిన ఇన్‌సైట్ ల్యాండర్.. మార్స్ అంతర్భాగాన్ని శోధించనున్న నాసా

  • 27 నవంబర్ 2018
శాస్త్రవేత్తల విజయోత్సాహం Image copyright EPl

అంగారకుడిపై ప్రయోగించిన ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్‌కు 7 నిమిషాల గండం గడిచింది. భారత కాలమానం ప్రకారం, నవంబర్ 27 మంగళవారం అర్థరాత్రి దాటాక 1:27గంటలకు అంగారకుడిపై ఇన్‌సైట్ విజయవంతంగా ల్యాండ్ అయినట్లు సంకేతాలు అందాయి.

అంగారక గ్రహ అంతర్భాగ(రాతి పొరల) నిర్మాణాలను పరిశోధించడానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఇలాంటి ప్రయోగాన్ని భూగ్రహం తర్వాత ఇతర గ్రహంపై నిర్వహించడం ఇదే తొలిసారి.

అంగారక గ్రహ ఉపరితలంలోని పలుచటి వాతావరణానికి అనుగుణంగా తన వేగాన్ని మార్చుకుంటూ ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వగానే, కాలిఫోర్నియాలోని 'జెట్ ప్రొపల్షన్ ల్యాబ్' ఆనందంలో మునిగిపోయింది.

ఈ సందర్భంగా ఏజెన్సీ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ జేమ్స్ బ్రిడెన్‌స్టీన్ స్పందిస్తూ.. ఇది ఒక అద్భుతమైన రోజు అని, అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫోన్ చేసి శాస్త్రవేత్తలను అభినందించారని మీడియాకు తెలిపారు.

అంగారకుడిపై అతిపెద్ద విస్తీర్ణంలోని మైదాన ప్రాంతంలో ఈ స్పేస్‌క్రాఫ్ట్ దిగింది. ఈ ప్రాంతాన్ని ఎలిసియమ్ ప్లానిషియా అంటారు. భూమధ్య రేఖ లాగ అంగారక గ్రహ మధ్య రేఖకు ఈ ప్లానిషియా దగ్గరగా ఉంటుంది.

చిత్రం శీర్షిక అంగారకుడిపై ల్యాండ్ అవుతున్న స్పేస్‌‌క్రాఫ్ట్ ఊహాచిత్రం

ల్యాండ్ అయిన కొన్ని నిమిషాలకే స్పేస్‌క్రాఫ్ట్ తన పరిసరాల ఫోటోను పంపింది. అంగారకుడిపై 2012లో చేసిన ప్రయోగం తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అలాంటి ఉత్కంఠభరితమైన ప్రయాణం సాగింది.

ఇన్‌సైట్‌.. తన ప్రయాణంలో ప్రతి దశ, ప్రతి మలుపులోనూ ఎప్పటికప్పుడు సమాచారం అందవేస్తూనేవుంది.

ఎక్కువ వేగంతో ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్, అంగారకుడిపై నెమ్మదిగా ల్యాండ్ అవ్వడానికి అందులో వాడిన హీట్ షీల్డ్, పారాచూట్, రాకెట్ల సాంకేతిక పరిజ్ఞానం దోహదపడింది.

Image copyright NASA
చిత్రం శీర్షిక మార్కో తీసిన అంగారకుడి ఛాయా చిత్రం. కుడివైపున కనిపించే యాంటెనాలు ఇన్‌సైట్ తరంగాలను భూమికి పంపుతాయి

అంగారకుడిపై 2007లో ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్‌కు కూడా ఇదే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

అంగారకుడిపై సున్నా డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి వాతావరణంలో స్పేస్‌క్రాఫ్ట్ పరికరాలు సమర్థవంతంగా పనిచేయడానికి స్పేస్‌క్రాఫ్ట్‌కు అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.

ఈ రోబో ల్యాండర్‌ను అంగారకుడిపై చేర్చడంలో బ్రీఫ్‌కేస్ పరిమాణంలో ఉండే రెండు శాటిలైట్లు కీలకపాత్ర పోషించాయి. స్పేస్‌క్రాఫ్ట్ నుంచి భూమికి సిగ్నల్స్ పంపడానికి మినీ స్పేస్‌క్రాఫ్ట్ 'మార్కో ఏ అండ్ బీ' పని చేస్తుంది.

''ఉత్కంఠభరితమైన ల్యాండింగ్ ప్రక్రియ మొదలైన 10-15 నిమిషాలకు, అంగారకుడికి 4,700మైళ్ల దూరం నుంచి ఓ ఫోటో మా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది'' అని మార్కో చీఫ్ ఇంజనీర్ ఆండీ క్లెష్ అన్నారు.

అంగారకుడికి కన్నం వేసి.. నాసా ఏం శోధించనుంది? అంగారక గ్రహం అంతర్భాగం గురించి తెలుసుకోవడం ఎందుకు? ఈ ప్రయోగం ఖర్చు ఎంత? ఇన్‌సైట్ స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రత్యేకతలు ఏమిటి?... ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే.. ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)