రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తత; మూడు యుద్ధనౌకలపై రష్యా కాల్పులు

  • 27 నవంబర్ 2018
ఉక్రెయిన్ నౌకలను చుట్టుముడుతున్న రష్యా యుద్ధనౌకలు Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉక్రెయిన్ నౌకలను చుట్టుముడుతున్న రష్యా యుద్ధనౌకలు

ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాయని ఆరోపిస్తూ మూడు ఉక్రెయిన్ యుద్ధనౌకలను రష్యా తన అధీనంలోకి తీసుకోవడమే దీనికి కారణం.

ఆదివారం క్రిమియా ద్వీపకల్ప తీరంలో వెళ్తుండగా వీటిని రష్యా తన అధీనంలోకి తీసుకొంది. రష్యా ఈ యుద్ధనౌకలపై కాల్పులు జరపడంతో వీటిలోని ఆరుగురు గాయపడ్డారు.

క్రిమియా ప్రాంతాన్ని రష్యా 2014 మార్చిలో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకొన్న తర్వాత ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అజోవ్ సముద్రంలోకి రాకపోకలను అడ్డుకొనేందుకు కెర్చ్ జలసంధిపై, వంతెన కింద రష్యా నిలిపి ఉంచిన ట్యాంకర్ (నవంబరు 25)

వివాదం రాజుకుంది ఇలా

క్రిమియా, రష్యా మధ్య ఉన్న కెర్చ్ జలసంధిని దాటేందుకు ఉక్రెయిన్ యుద్ధనౌకలు యత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. అజోవ్ సముద్ర తీరంలోని ఉక్రెయిన్ నగరమైన మరియుపోల్‌కు వెళ్లేందుకు ఈ జలసంధే మార్గం.

2003లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ప్రకారం కెర్చ్ జలసంధి, అజోవ్ సముద్రం ఇరు దేశాలూ కలసి పంచుకొనే ప్రాదేశిక జలాల కిందకు వస్తాయి. అయితే ఈ ప్రాంతంలోని ఉక్రెయిన్ నౌకాశ్రయాలకు వెళ్లి వచ్చే నౌకలన్నింటినీ రష్యా ఇటీవలి కాలంలో తనిఖీ చేయడం మొదలుపెట్టింది.

తమ ప్రాదేశిక జలాల్లోకి ఉక్రెయిన్ చొరబడిందని ఆరోపించిన రష్యా, అజోవ్ సముద్రానికి వెళ్లేందుకుగాని, అక్కడి నుంచి వచ్చేందుకుగాని ఉక్రెయిన్ నౌకలకు వీలు లేకుండా చర్యలు చేపట్టింది. కెర్చ్ జలసంధిపై, వంతెన కింద అడ్డంగా ఒక ట్యాంకర్‌ను నిలిపి ఉంచింది. రెండు యుద్ధ విమానాలు, రెండు హెలికాప్టర్లతో సముద్రంపై చక్కర్లు కొట్టిస్తోంది.

క్రిమియా ద్వీపకల్పాన్ని దక్షిణ రష్యాతో కలుపుతూ కెర్చ్ జలసంధిపై ఈ వంతెనను రష్యా ఈ ఏడాదే నిర్మించింది. దీని నిర్మాణంపై ఉక్రెయిన్ వ్యతిరేకతను తోసిపుచ్చింది.

ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోయేందుకు తమ నౌకలు ప్రయత్నించినప్పుడు రష్యా కాల్పులు జరిపిందని, దీనివల్ల వీటికి నష్టం వాటిల్లిందని, అక్కణ్నుంచి కదలడానికి వీటికి వీలు కావడం లేదని ఉక్రెయిన్ నౌకాదళం చెప్పింది. తమ నౌకల్లో 23 మంది ఉక్రెయిన్ వాసులు ఉన్నారని, వీరిలో ఆరుగురు గాయపడ్డారని తెలిపింది.

రష్యా, ఉక్రెయిన్ సైనిక బలగాల మధ్య ఇంత తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడటం ఇటీవలి సంవత్సరాల్లో ఇదే తొలిసారి.

ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా మద్దతున్న వేర్పాటువాదులతో ఉక్రెయిన్ పోరాడుతోంది.

ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా ప్రవేశపెట్టడంపై ఓటింగ్ కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. యుద్ధ సన్నద్ధ స్థితిలో ఉండాలంటూ సైన్యానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ చర్య యుద్ధ ప్రకటన కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో స్పష్టం చేశారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదాులకు సాయం చేస్తోంది స్వచ్ఛంద మద్దతుదారులని, తమ సైనికులు కాదని రష్యా చెబుతోంది.

ఎవరేమంటున్నారు?

మరియుపోల్‌కు నౌకల తరలింపు ప్రణాళికలపై తాము రష్యాకు ముందస్తు సమాచారం ఇచ్చామని ఉక్రెయిన్ చెప్పింది. తమ నౌకలను రష్యా తన అధీనంలోకి తీసుకోవడం మరో సాయుధ దుశ్చర్యేనని ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది.

తమను రెచ్చగొట్టాలనే ముందస్తు వ్యూహంతోనే ఉక్రెయిన్ నౌకల తరలింపు చేపట్టిందని రష్యా ఆరోపించింది. వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించతలపెట్టిన అధ్యక్ష ఎన్నికల్లో సానుకూల ఫలితాల కోసమే నౌకల తరలింపు, మార్షల్ లా విధించడం, ఇతర చర్యలను ప్రభుత్వం చేపడుతోందని విమర్శించింది.

ప్రజల నిరసన ప్రదర్శనలపై ఆంక్షలకు, మీడియాపై నియంత్రణకు, ఎన్నికల సస్పెన్షన్‌కు మార్షల్ లా ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది. రక్షణ రంగంలో పనిచేయడం లాంటి 'సామాజిక బాధ్యతలు' నిర్వర్తించేలా పౌరులను ఆదేశించేందుకు కూడా ఇది వీలు కల్పిస్తుంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని రష్యా దౌత్య కార్యాలయం కారును తగులబెట్టిన ఒక ఆందోళనకారుడు

రష్యా చర్యపై స్పందన?

రష్యా చర్యను నిరసిస్తూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని రష్యా దౌత్య కార్యాలయం వెలుపల 150 మందికి పైగా ప్రజలు ఆందోళన నిర్వహించారు. దౌత్య కార్యాలయానికి చెందిన ఒక కారును ఓ నిరసనకారుడు తగులబెట్టాడు.

రష్యా చర్యపై నాటో, యూరోపియన్ యూనియన్ స్పందించాయి. కెర్చ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఉక్రెయిన్ నౌకలను అనుమతించాలని రష్యాకు పిలుపునిస్తూ ప్రకటనలు విడుదల చేశాయి.

ఉద్రిక్తతలు తగ్గించేందుకు అన్ని పక్షాలూ అత్యంత సంయమనంతో వ్యవహరించాలని ఈయూ సూచించింది.

కెర్చ్ వంతెనను రష్యా నిర్మించడం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని ఈయూ విమర్శించింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక మరియుపోల్‌ నౌకాశ్రయంలో నిలిపి ఉంచిన ఓ నౌక

సోమవారం భద్రతా మండలి అత్యవసర భేటీ

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తెలిపింది.

2014 మార్చిలో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత నెల రోజులకు ఉక్రెయిన్ తూర్పు భాగంలోని డొనెస్క్, లుహాన్‌స్క్ ప్రాంతాల్లో రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్ సైనిక బలగాలకు మధ్య పోరాటం మొదలైంది. ఇప్పటివరకు ఈ పోరాటంలో పది వేల మందికి పైగా చనిపోయారు.

ఈ ప్రాంతాలకు రష్యా సైనికులను పంపిస్తోందని, వేర్పాటువాదులకు ఆయుధాలు అందిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను రష్యా ఖండిస్తోంది. అయితే వేర్పాటువాదులకు సహకరిస్తోంది స్వచ్ఛంద మద్దతుదారులని, తమ సైనికులు కాదని చెబుతోంది.

ఈ ఏడాది మార్చిలో క్రిమియా నుంచి వచ్చిన ఒక మత్స్యకార బోటును ఉక్రెయిన్ అదుపులోకి తీసుకొన్న తర్వాత రష్యా కెర్చ్ జలసంధిని దాటే అన్ని ఉక్రెయిన్ నౌకలను తనిఖీ చేయడం మొదలుపెట్టింది.

కెర్చ్ జలసంధిపై ఉన్న వంతెనకు ఉక్రెయిన్ ర్యాడికల్స్ నుంచి ముప్పు ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా తనిఖీలు అవసరమని రష్యా చెబుతోంది.

తమ నౌకల రాకపోకలపై ఆంక్షల వల్ల తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు సెప్టెంబరులో ద వాషింగ్టన్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు

పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు

ప్రెస్‌ రివ్యూ: గోదావరిలో 315 అడుగుల లోతులో బోటు

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

సెప్టెంబర్ 17: విలీనమా.. విమోచనా... 1948లో జరిగిన హైదరాబాద్ విలీనాన్ని ఎలా చూడాలి

డాక్టర్ కోడెల శివప్రసాద్: ప్రేమాస్పదుడు - వివాదాస్పదుడు

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై డ్రోన్ దాడులతో పెరిగిన ఆయిల్ ధరలు

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు