యుక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు: సముద్ర జలాలపై అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి

  • 28 నవంబర్ 2018
రష్యా భద్రతా బలగాల అదుపులో ఉక్రెయిన్ నావికుడు Image copyright AFP
చిత్రం శీర్షిక రష్యా భద్రతా బలగాల అదుపులో ఉక్రెయిన్ నావికుడు

తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాయని ఆరోపిస్తూ రష్యా మూడు యుక్రెయిన్ బోట్లను తన అధీనంలోకి తీసుకోవడంతో యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి.

ఆదివారం క్రిమియా ద్వీపకల్ప తీరంలో వెళ్తుండగా రష్యా వాటిని తన అధీనంలోకి తీసుకొంది. రష్యా ఈ బోట్లపై కాల్పులు జరపడంతో వాటిలోని ఆరుగురు గాయపడ్డారు.

క్రిమియా ప్రాంతాన్ని రష్యా 2014 మార్చిలో యుక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకొన్న తర్వాత ఉభయదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఈ విషయంలో అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించారని రష్యా, యుక్రెయిన్ ఒక దానిపై మరొకటి ఆరోపించుకుంటున్నాయి.

ఈ మూడు బోట్లూ యుక్రెయిన్‌లోని మారియుపోల్‌కు వెళ్ళాల్సి ఉంది. ఆ క్రమంలో అవి ఒక చిన్న జలసంధి గుండా వెళ్లాల్సి ఉండగా, ఒక రష్యా కార్గో షిప్ దానికి అడ్డంగా ఉంది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య ఘర్షణ తలెత్తింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రష్యా అదుపులోని ఉక్రెయిన్ బోట్లు

అధికార దుర్వినియోగం

రష్యా గత ఏడాది నుంచి కెర్చ్ జలసంధి గుండా యుక్రెయిన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే నౌకలను తనిఖీ చేస్తోంది.

రష్యా 2003 నుంచి సీ ఆఫ్ అజోవ్‌లోకి ప్రవేశించే, ఆ సముద్రం నుంచి వచ్చే నౌకలను తనిఖీలు చేసే అధికారాన్ని కలిగి ఉంది.

అయితే రష్యా ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. రష్యా, క్రిమియాలను కలిపే కెర్చ్ జలసంధికి అడ్డంగా రష్యా ఒక బ్రిడ్జిని నిర్మించడాన్ని కూడా యుక్రెయిన్ వ్యతిరేకిస్తోంది.

అంతే కాకుండా.. 2014లో రష్యా.. క్రిమియాను తమ దేశంలో కలిపేసుకోవడాన్ని యుక్రెయిన్ కానీ, యూరోపియన్ కానీ, అమెరికా కానీ గుర్తించడం లేదు.

క్రిమియా.. రష్యాలో చేరతామంటూ నిర్వహించిన రెఫరెండం ఫలితాలను అంతర్జాతీయ సమాజం, యుక్రెయిన్ తిరస్కరిస్తున్నాయి.

యుక్రెయిన్ బోట్లను రష్యా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సీ ఆఫ్ అజోవ్ జలాలపై అధికారం ఎవరికుంటుంది అన్నదే ఇప్పుడు కీలకం.

రష్యా ఏమంటోంది?

క్రిమియా ద్వీపకల్ప తీరాన్ని తాత్కాలికంగా మూసేశామని, యుక్రెయిన్ బోట్లు అక్రమంగా తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడమే కాకుండా, రెచ్చగొట్టే చర్యలు చేపట్టిందని రష్యా ఆరోపిస్తోంది.

తమ బోట్లు సురక్షితంగా ప్రయాణించేలా భద్రత కల్పించాలని యుక్రెయిన్ సరైన దరఖాస్తులు సమర్పించలేదని కూడా తెలిపింది. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల సదస్సుకు లోబడి ఆర్టికల్ 19, 21 లను ఆ దేశం ఉల్లంఘించిందని ఆరోపించింది.

యుక్రెయిన్ వాదన ఏమిటి?

కెర్చ్ జలసంధికి అటు సీ ఆఫ్ అజోవ్, ఇటు నల్ల సముద్రం ఉన్నాయి. నల్ల సముద్రంలో అన్ని నౌకలూ స్వేచ్చగా ప్రయాణించే వీలుంది కాబట్టి, రష్యానే అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించిందనేది యుక్రెయిన్ ఆరోపణ.

2003లో రష్యాతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమ నౌకలన్నీ కెర్చ్ జలసంధి ద్వారా సీ ఆఫ్ అజోవ్‌లోకి ప్రవేశించవచ్చని యుక్రెయిన్ వాదిస్తోంది. తమ బోట్లు కెర్చ్ జలసంధి ద్వారా వెళుతున్నట్లు రష్యాకు సమాచారం అందించామని స్పష్టం చేసింది.

ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల సదస్సుకు అనుగుణంగా ఆర్టికల్ 38, 44 ప్రకారం.. 'సముద్రయాన స్వేచ్ఛ'కు రష్యా విఘాతం కలిగిస్తోందని యుక్రెయిన్ తెలిపింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక రష్యాపై చర్యలు తీసుకోవాలంటూ ఉక్రెయిన్‌లో ఆందోళనలు

ఇంతకూ ఆ జలాలు ఎవరివి?

ఒక దేశం తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం వరకు ఆ దేశపు జలాలుగానే పరిగణిస్తారు. యుక్రెయిన్ నౌకలను తమ జలాలలో స్వాధీనం చేసుకున్నామని వాదించడం ద్వారా అవి తమ ప్రాదేశిక జలాలలో ఉన్నాయని రష్యా అంటోంది.

అయితే క్రిమియా తమదే అని వాదిస్తున్న యుక్రెయిన్, తమ బోట్లు వెళుతున్నది తమ దేశ ప్రాదేశిక జలాలలోనే అని వాదిస్తోంది.

క్రిమియా ఎవరిదన్న విషయం పక్కనబెడితే.. కెర్చ్ జలసంధి, సీ ఆఫ్ అజోవ్‌లో వెళ్లడానికి తమకు స్వేచ్ఛ ఉందని యుక్రెయిన్ అంటోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్రిమియాలో రష్యా సైనిక విన్యాసాలు

అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఏమంటున్నాయి?

నౌకలు ఏయే సందర్భాలలో ఏ దేశానికి చెందిన ప్రాదేశిక జలాలలో అయినా స్వేచ్ఛగా వెళ్లవచ్చో ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాల సదస్సు (యూఎన్‌సీఎల్‌ఓఎస్) నియమాలు స్పష్టం చేస్తున్నాయి.

వాటి ప్రకారం, యుద్ధనౌకలు సహా అన్ని నౌకలకూ - అవి ఏ ప్రాదేశిక జలాల గుండా వెళ్తున్నామో తెలియని (ఇన్నోసెంట్ పాసేజ్) సందర్భంలో - ఇతర దేశాలకు చెందిన సముద్ర జలాలలో కూడా స్వేచ్ఛగా వెళ్లే హక్కు ఉంది.

అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక యుద్ధ నౌక దుందుడుకుగా వ్యవహరించినప్పుడే మరో దేశ యుద్ధనౌక దానిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ హామ్‌బర్గ్‌లో పబ్లిక్ ఇంటర్నేషనల్ లా పరిశోధకుడు వాలెంటీన్ షట్జ్ తెలిపారు.

యుక్రెయిన్ బోట్లకు అవి ఏ దేశపు జలాల గుండా వెళ్తున్నాయో స్పష్టంగా తెలుసు అనేది రష్యా వాదన. సముద్ర తీరం ఏ దేశానికి చెందినదైతే, ఆ దేశం భద్రతకు భంగం కలిగించనంత వరకే 'ఇన్నోసెంట్ పాసేజ్' నియమం వర్తిస్తుందని రష్యా వాదిస్తోంది. యుక్రెయిన్ బోట్లు దుందుడుకుగా వ్యవహరించడం వల్లే వాటిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రష్యా అంటోంది.

'ఇన్నోసెంట్ పాసేజ్' నియమానికి విరుద్ధంగా యుక్రెయిన్ బోట్లు యుద్ధరంగానికి వెళ్తున్నట్లు ఉన్నాయని రష్యా పేర్కొంది.

తమ హక్కును ఉపయోగించుకోవడానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ.. ఆ హక్కును ఉపయోగించుకునే సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని రష్యా తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)