అండమాన్ సెంటినలీస్: మిషనరీలు దేవుడికి సేవ చేస్తున్నాయా? దేవుడిలా వ్యవహరిస్తున్నాయా?

  • 29 నవంబర్ 2018
ఆదివాసీలతో ఒక మిషనరీ Image copyright Getty Images
చిత్రం శీర్షిక మిషనరీలను ప్రపంచం ఎలా అర్థం చేసుకోవాలి?

''ఇదంతా నా పిచ్చి అని మీరు అనుకోవచ్చు... కానీ ఈ జనానికి జీసస్ గురించి ప్రకటించటం విలువైనదని నేను అనుకుంటున్నా.''

నార్త్ సెంటినల్ దీవి ప్రజల చేతిలో గత వారం చనిపోవటానికి ముందు జాన్ అలెన్ చౌ తన తల్లిదండ్రులకు పంపిన చివరి లేఖలో తుది పలుకులు ఇవి.

చౌ తాను స్వయంగా మిషనరీ (మతప్రబోధకుడు) కాకపోయినప్పటికీ.. సువార్తను ఈ తెగ వారికి అందివ్వటం తన లక్ష్యమని అతడు చెప్పాడు.

అందుకోసం అతడు చేసిన ప్రయత్నాలతో.. ప్రపంచ వ్యాప్తంగా తమ విశ్వాసాన్ని వ్యాప్తి చేస్తున్న వేలాది మంది క్రైస్తవుల విషయం చర్చనీయాంశంగా మారింది.

అసలు ఈ మిషనరీలు ఎవరు? వారు ఏం సాధించాలనుకుంటున్నారు? ప్రపంచంలో వారు సానుకూల శక్తా? లేక అవాంఛిత అతిథులా?

మిషనరీ అంటే ఎవరు?

ఇతర మతాలు కూడా ప్రపంచం నలుమూలలకూ తమ మిషనరీలను (మతప్రబోధకులును) పంపించాయి. కానీ అవేవీ.. క్రైస్తవ మిషనరీలంత విస్తృతమైనవీ కావు. అంతగా తెలిసినవీ కావు.

అన్ని క్రైస్తవ సంప్రదాయాలూ బైబిల్‌లోని మత్తయి సువార్తలో.. ''సమస్త జనులను శిష్యులనుగా చేయుడి'' అంటూ జీసస్ తన అనుయాయులను కోరిన చాలా ప్రముఖమైన వాక్యాన్ని ఉదహరిస్తాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్రైస్తవ మిషనరీలు శతాబ్దాలుగా ప్రపంచమంతా పనిచేస్తున్నాయి

మిషనరీలన్నీ ఈ వాక్యాన్ని 'సార్వత్రిక ఆజ్ఞ'గా పరిగణిస్తాయి. జీసస్ స్వర్గారోహణకు ముందు తన శిష్యులకు ఇచ్చిన తుది నిర్దేశాలుగా వీటిని భావిస్తాయి.

వలసవాద ప్రయత్నాల్లో మత విశ్వాసకులు తరచుగా ముందు శ్రేణిలో ఉంటారు. యూరప్, అమెరికాలకు వెలుపల ఉండే ప్రజలను 'నాగరికులు'గా మలచటానికి మతాన్ని వ్యాప్తి చేయటం ఒక మార్గంగా పరిగణిస్తారు.

కాలక్రమంలో ఇది భౌతిక, ఆధ్యాత్మిక అభివృద్ధిగా మారింది.

''ఈ ఘటన మిషనరీ ప్రాజెక్టుల మీద చర్చను ఎంతగా ప్రేరేపించినప్పటికీ.. జాన్ చౌ ఒక సువార్త ప్రతినిధి కాదు'' అని బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఎమిరైటస్ డేవిడ్ హోలింగర్ బీబీసీతో పేర్కొన్నారు.

''సువార్తికులు ఇంకా మతమార్పిడిలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వాళ్లు ఇప్పుడు ఆస్పత్రులు, స్కూళ్లు కూడా నిర్మిస్తున్నారు. చాలా సంస్థలకు చాలా బలమైన సేవా ప్రాజెక్టులు ఉన్నాయి'' అని ఆయన చెప్పారు.

అమెరికా సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ గ్లోబల్ క్రిస్టియానిటీ సంస్థ అంచనా ప్రకారం.. 2018లో 4,40,000 మంది క్రైస్తవ మిషనరీల తరపున విదేశాల్లో పనిచేస్తున్నారు.

వీరిలో.. క్యాథలిక్కులు, ప్రెటెస్టెంట్లు, సనాతన క్రైస్తవులతో పాటు.. యెహోవా విట్నెసెస్, మర్మోన్స్‌గా పిలిచే చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్‌డీఎస్ చర్చ్) వంటి ఉత్తర అమెరికా సంస్థల వారు ఉన్నారు.

కేంద్రీకృత మిషనరీ కార్యక్రమాన్ని నడిపే కొన్ని సంస్థల్లో ఎల్‌డీఎస్ చర్చి ఒకటి. మార్మోన్ మిషనరీల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 66,000 మందిగా ఉంది. చారిత్రకంగా చూస్తే ఈ చర్చి ఇప్పటివరకూ 10 లక్షల మందికి పైగా మిషనరీలను పంపించింది.

2017లో తమ తమ మిషనరీలు.. కొత్తగా మతం మారిన 2,33,729 మందికి బాప్తిజం ఇచ్చాయని ఈ చర్చి చెప్తోంది.

మిషనరీలు ఏం చేస్తారు?

జాన్ అలెన్, ఆయన భార్య లీనా - రిజిస్టర్డ్ మిడ్‌వైఫ్, నర్స్ - పపువా న్యూగినీల్లో 15 ఏళ్ల పాటు క్రైస్తవ మిషనరీలుగా పనిచేశారు.

ఈ అమెరికా జంటకి ''క్రైస్తవ విలువలు, పరివర్తక సువార్త నమూనాను ప్రచారం చేయాలన్నది ఆకాంక్ష'' అని అలెన్ ఈమెయిల్ ద్వారా బీబీసీకి తెలిపారు.

''ఇది మేము విశ్వసించినట్లుగా ఇతరులూ విశ్వసించేలా చేయటం కాదు. సమస్త మానవాళికి, ప్రతి వ్యక్తికీ దేవుడి ప్రణాళిక ఒకటి ఉంది అని జనం తమకుతాముగా బైబిలు ద్వారా తెలుసుకోవటం'' అని ఆయన రాశారు.

ఈ జంట తాము నివసించే గల్ఫ్ ప్రావిన్స్‌లోని కామియా ప్రజలకు సాయం చేయటానికి పదేళ్ల కిందట ఒక మెడికల్ క్లినిక్‌ను నెలకొల్పారు.

ఐదుగురు పపువా న్యూగినీ పౌరులు, ముగ్గురు అమెరికా నర్సులు వారితో కలిసి కునాయ్ హెల్త్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. అనారోగ్యాలు, గాయాలకు చికిత్స చేయటంతో పాటు.. గర్భిణిలు, నవజాత శిశువులకు పలు కార్యక్రమాలను కూడా ఈ బృందం ఏర్పాటు చేసింది.

అక్కడ వాణిజ్య భాష టోక్ పిసిన్‌ ఈ జంటకు బాగా వచ్చునని.. 2009 వరకూ అలిఖితంగా ఉన్న కమియా భాషను అధ్యయనం చేస్తున్నారని అలెన్ చెప్పారు. 2009లో వీరే కమియా భాషను లిఖితం చేయటం ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.

''అది నేర్చుకోవటం చాలా కష్టం. ఎందుకంటే దానిని లిఖించటం, నమోదు చేయటం చేస్తున్నది మేమే. మాకు తెలిసినంతవరకూ ఆ భాష బయటివారెవరికీ పూర్తిగా రాదు'' అంటారాయన.

''నేటి మిషనరీ పని మొత్తం ఒకే తరహాలో ఉండదు. మేం చేస్తున్న పని ఇది'' అని వివరించారు.

చారిత్రకంగా కూడా భాషలను నేర్చుకోవటంలో కొన్ని మిషనరీలు ముందు వరుసలో ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో అమెరికన్ హిస్టరీ ప్రొఫెసర్ ఆండ్రూ ప్రిస్టన్ చెప్తారు.

''అయితే ఇప్పటి పరిస్థితి అప్పటిలా లేదు. కానీ 100 సంవత్సరాల కిందట.. నిగూఢమైన ఆఫ్రికా లేదా ఆసియా భాషల్లోనే కాదు చైనీస్, జపనీస్ భాషలనూ ధారాళంగా నేర్చుకున్నది మిషనరీలు మాత్రమే'' అని ఆయన బీబీసీతో పేర్కొన్నారు.

స్థానిక సంప్రదాయాలు ''నిరంతర అభ్యసన అనుభవం'' అని.. దానికి తాము నిబద్ధులమై ఉన్నామని అలెన్ అభివర్ణించారు.

''ఒక జనం గురించి తెలుసుకోవాలంటే.. వారితో కలిసి మట్టిలో కూర్చోవటం, వారితో కలిసి తినటం, వారితో కలిసి వారి గుడిసెలలో నిద్రపోవటం, వారి ఆనందాలలో వారితో కలిసి ఉల్లాసంగా పాల్గొనటం, వారి బాధలు బరువులను పంచుకోవటం ఉత్తమ మార్గం'' అని అంటారాయన.

''అప్పుడే మన కొత్త కుటుంబాన్ని మనం తెలుసుకోవటం మొదలవుతుంది. అప్పుడే వారి కళ్లతో వారి సంస్కృతిని చూడటం మొదలవుతుంది'' అని చెప్తారు.

మరోవైపు.. స్కాట్, జెన్నిఫర్ ఎస్పోసిటోలు నికరాగువాలో పేరు లేని మిషనరీలను నడుపుతున్నారు. వారు తమ విశ్వాసాన్ని వ్యాప్తి చేయటానికి ఒక పొలం, ఒక క్రీడా కార్యక్రమం, బైబిల్ అధ్యయన బృందాలను నిర్వహిస్తున్నారు.

''మేం నిరంతరం కేవలం సువార్తను పంచుతున్నాం'' అని స్కాట్ ఫోన్‌లో బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు. ఈ జంట తాము ఎంత మందిని మతం మార్చామనే దానిని ఉద్దేశపూర్వకంగానే లెక్కించరు. అయితే.. గత ఆరేళ్లలో సుమారు 800 నుంచి 1,200 మందిని తమ విశ్వాసంలోకి మార్చినట్లు అంచనా వేస్తున్నారు.

''ప్రతి ఆత్మా ముఖ్యమే. లెక్క పెట్టటం, లక్ష్యాలు నిర్దేశించుకోవటం మొదలుపెడితే.. ఉదాహరణకు ఒక 500 మందిని మార్చాలి అనుకుంటే.. మనం లక్ష్యం ప్రధానంగా, లెక్క ప్రధానంగా నడుచుకోవటం మొదలవుతుంది. ఆ క్రమంలో చాలా ముఖ్యమైన ఒక వ్యక్తిని.. చాలా సమయం పట్టగలిగే వ్యక్తిని వదిలివేస్తాం'' అని ఆయన చెప్తారు.

జాన్ చౌ గురించి వీరు ఏమనుకుంటున్నారు?

''జాన్ చౌ కథనం ఇక్కడ తెలిసినప్పుడు.. 'ఆహా... ఆ పని చేయాలని మేం ఆలోచించాం' అని మాకు అనిపించింది'' అని మిషనరీ జాన్ అలెన్ బీబీసీకి ఈమెయిల్‌లో తెలిపారు.

ఆ దీవులకు వెళ్లాలని ఆయన స్వయంగా అనుకోలేదు కానీ.. ఈ సెంటినలీస్ ప్రజల వద్దకు వెళ్లటం గురించి మాట్లాడిన తన సహచరుల గురించి ఆయన చెప్పారు.

''వాళ్లు దీనిని సీరియస్‌గా పట్టించుకోలేదు కానీ.. ఈ ప్రజలను సురక్షితంగా కలవటం ఎలా, స్నేహపూర్వక సంబంధాల ప్రారంభించటం ఎలా.. వారి భాషా సంస్కృతులను నేర్చుకోవటానికి వారి దగ్గరకు వెళుతూనే.. తమ 'ఫుట్‌ప్రింట్' (ప్రభావాన్ని) కనీస స్థాయికి పరిమితం చేయటం ఎలా' అనే అంశాల మీద ఆలోచనలు చేశారు'' అని వివరించారు.

జాన్ చౌ ఉదంతం విషాదకరమని ఎస్పోసిటో దంపతులు భావిస్తున్నారు. అతడి చర్యలు అవివేకమైనవని కొందరు భావిస్తారని.. తమను సమర్థించే వాళ్లూ కొందరు ఉంటారని వారికి తెలుసు.

''అతడి మీద ఏదో ఒక అభిప్రాయం చెప్పటానికి నేను సంకోచిస్తాను. నేను చదివిన దాని ప్రకారం.. అతడు దేవుడిని ప్రేమించాడు. అతడి త్యాగం భవిష్యత్తులో చాలా మందిని క్రీస్తు వద్దకు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా'' అని జెన్నిఫర్ ఎస్పోసిటో పేర్కొన్నారు.

''ఏ మొలకలు నాటారో.. ఏ దృగ్విషయాలు జరగబోతున్నాయో ఎవరికి తెలుసు'' అని వ్యాఖ్యానించారు.

ఒకవేళ.. ఆ తెగ వారిని ఏదైనా వ్యాధి నుంచి రక్షించటానికి ఒక డాక్టర్ల బృందం ఆ చట్టాలు, సంప్రదాయాలను అతిక్రమించి ఉన్నట్లయితే.. దానిపై ప్రతిస్పందన వేరేలా ఉండి ఉండేదని ఎస్పాసిటో అంటారు.

Image copyright CHRISTIAN CARON

''ఒకవేళ డాక్టర్లు వెళ్లి.. ఆ ప్రక్రియలో హత్యకు గురై ఉన్నట్లయితే.. వాళ్లు ధీశాలురని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అని ఉండేవారని నేను అనుకుంటున్నా. (జాన్ చౌ) వారి శాశ్వత జీవితాలను రక్షించటానికి వెళ్లాడు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

అదే సమయంలో.. జాన్ చౌ చేసినట్లుగా చట్టాలను అతిక్రమించటాన్ని ఎస్పోసిటో సమర్థించటం లేదు. స్థానిక చట్టాలు, సంప్రదాయాలను తాము ''చాలా గౌరవిస్తా''మని చెప్పారు.

''మనమంతా.. మరణానికి సిద్ధమైన అతడి హృదయాన్ని అనుకరించాలి. కానీ ప్రతి ఒక్కరూ ప్రమాదకర తెగలను వెదుక్కుంటూ వెళ్లాలని నేను అనుకోవటం లేదు'' అని పేర్కొన్నారు.

మిషనరీ పని ఒక సామ్రాజ్యవాద రూపమా?

జాన్ చౌ మరణం తర్వాత మాజీ మిషనరీ కైట్లిన్ లోరీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ రాశారు.

''నేను మిషనరీగా పనిచేసేటపుడు.. దేవుడి పని చేస్తున్నానని అనుకునేదానిని. కానీ నిజాయితీగా చెప్తే.. నాకు సంతృప్తినిచ్చిన పనిని నేను చేసేదానిని'' అని అందులో పేర్కొన్నారు.

''ఇది శ్వేత ఆధిపత్యం. ఇది వలసరాజ్య స్థాపన'' అని వ్యాఖ్యానించారు.

మార్క్ ప్లోట్కిన్ ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు. అమెజాన్ కన్సర్వేషన్ టీమ్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు. నాగరిక ప్రపంచానికి దూరంగా ఉన్న ప్రజలను రక్షించటానికి కొలంబియా ప్రభుత్వంతో కలిసి ఈ సంస్థ పని చేస్తోంది.

''అమెజాన్‌లో నేను 30 ఏళ్లుగా పనిచేస్తున్నా. అక్కడ రెండు రకాల మిషనరీలు ఉన్నాయని నేను గమనించా. ఈ తెగల వారిని బయటి ప్రపంచం కోసం సంసిద్ధం చేయాలని కోరుకునే వారు ఒక రకమైతే.. జీసస్ కోసం కొన్ని ఆత్మలను రక్షించాలని కోరుకునే వారు రెండో రకం'' అని ఆయన అంటారు.

''మిషనరీలు.. తాము ప్రపంచాన్ని మెరుగుపరుస్తున్నామని నిజంగా నమ్ముతారు.. కానీ వారు చేసే పని చాలా హానికరం కావచ్చు'' అని ఆయన పేర్కొన్నారు.

''నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న జనాన్ని వారి మంచి కోసమంటూ అడవుల నుంచి బయటకు లాగటం.. కొన్నిసార్లు వారికి మంచిది కాదు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

1969లో సురినామ్‌లో మిషనరీలు కలిసిన అకురియో ప్రజల గురించి ఆయన చెప్పారు. ''అలా కలిసిన రెండేళ్లలో 40 నుంచి 50 శాతం వరకూ అకురియో ప్రజలు శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల చనిపోయారు'' అని తెలిపారు. వారి మరణాలకు ''సాంస్కృతిక దిగ్భ్రాంతి'' కూడా కారణం కావచ్చునన్నది తన అనుమానమని ప్లోట్కిన్ పేర్కొన్నారు.

''వారు దుస్తులు ధరించిన మనుషులను మొట్టమొదటిసారి చూశారు. ఆ మనుషులు వారికి ఇంజెక్షన్లు ఇవ్వటమూ మొదటిసారే. ఎవరూ దేవుడిలా వ్యవహరించకూడదు'' అని ఆయన అంటారు.

Image copyright AMAZON CONSERVATION TEAM
చిత్రం శీర్షిక నాగరిక ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించే ఆదివాసీ ప్రజలను రక్షించటానికి మార్క్ ప్లోట్కిన్ పని చేస్తున్నారు

మిషనరీ పని గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చిన్న చూపు ఉంది.

మతమార్పిడికి ప్రయత్నం చేయటం నేపాల్‌లో నేరం. ఈ నేర నిరూపణ అయిన విదేశీయులను ఐదేళ్ల గరిష్ట జైలుశిక్ష అనంతరం వారి దేశాలకు పంపించి వేసేలా గత ఆగస్టులో అక్కడ చట్టాన్ని మార్చినట్లు చెప్తున్నారు.

చారిత్రకంగా చూస్తే.. అన్నీ కాకపోయినా కొన్ని అమెరికా ప్రొటెస్టెంట్ మిషనరీల్లో 'సామ్రాజ్యవాదం పట్ల ద్వైదీభావం' పెరిగిందని ప్రొఫెసర్ ప్రెస్టన్ చెప్తారు.

''అమెరికా కఠిన అధికారంలో తాము ఒక భాగమని.. దాని నుంచి బయటపడజాలమని వారు గుర్తించారు. ఆ సంబంధం కారణంగా.. అమెరికా లక్ష్యాలకు విరుద్ధమైనవే అయినా కూడా.. స్థానిక అస్తిత్వాలను, జాతీయతా అంశాలను ప్రోత్సహించటానికి కొన్ని మిషనరీలు వచ్చాయి'' అని వివరించారు.

''అమెరికా విశిష్టతావాదులు ఇంకా చాలా మంది ఉన్నారు. అన్ని జాతుల్లోకెల్లా అమెరికా విశిష్టమైనదని వారు విశ్వసిస్తారు. కానీ వారిలో చాలా మంది.. అమెరికాకు అనుగుణంగా కాకుండా.. క్రైస్తవ మతానికి అనుగుణంగా ప్రపంచాన్ని మెరుగు పరచాలని కోరుకుంటారు'' అని ప్రొఫెసర్ ప్రెస్టన్ వ్యాఖ్యానించారు.

ఈ సంబంధం కష్టం కావచ్చునని అలెన్ అంగీకరిస్తారు. అయితే.. మిషనరీల్లో కానీ, చివరికి వ్యాపారాల్లో కానీ ఏ తరహా వలసవాద చర్య కనిపించినా తనకు అసహ్యం కలుగుతుందని చెప్తారు.

''కొన్నిసార్లు.. మేం ఎంతగా ప్రయత్నించినా కూడా.. మాకు అనవసరంగా లొంగుతున్నట్లు కనిపిస్తుంది. మేం పరస్పర నమ్మకం, గౌరవం ప్రాతిపదికన నిజమైన సంబంధాలను నిర్మించుకోవటానికి కృషి చేస్తాం'' అని వివరించారు.

''నేను ఎప్పుడైనా కామియా అవుతానని అనుకునేంత అమాయకుడిని కాదు. కానీ.. క్షేత్రస్థాయిలోని మా బృందం వలసవాద పోకడలు ఏమున్నా వాటిని ధ్వంసం చేసి.. స్నేహ, సహకారాలతో భర్తీ చేయటానికి కష్టపడుతుంది'' అని చెప్పారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు