చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం

అగ్నిపర్వతం డిజైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

536వ సంవత్సరంలో దట్టమైన మేఘాలు, సూర్యుడి వెలుగును 18నెలలపాటు అడ్డుకున్నాయి

‘ఈ కాలం అస్సలు బాలేదు. సునామీలు వస్తున్నాయి. భూతాపం పెరిగిపోతోంది’ అని బాధపడుతున్నారా? అయితే, మీరు క్రీస్తు శకం 536 గురించి తెలుసుకుంటే, ఆ ఏడాదిలో పుట్టనందుకు చాలా సంతోషిస్తారేమో.

చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదేనని చరిత్రకారులు చెబుతున్నారు.

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జీవించడానికి ఏమాత్రం అనువుగా లేని ఏడాది క్రీ.శ.536 అని హార్వర్డ్ యూనివర్సిటీ చరిత్రకారుడు మైఖేల్ మెక్.కార్మిక్ అంటున్నారు.

ఆ ఏడాది యూరప్, మధ్య ప్రాచ్యంతో పాటు ఆసియాలోని కొన్ని ప్రాంతాలను భయంకరమైన పొగమంచు కమ్మేసింది. అప్పుడు వ్యాపించిన పొగమంచు రాత్రి పగలు అన్న తేడా లేకుండా 18 నెలలపాటు ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసింది.

ఆ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు 1.5 - 2.5 డిగ్రీలకు పడిపోయాయి. గత 2300 సంవత్సరాల్లో అత్యంత శీతల దశాబ్దం అదే. ఆ ఏడాది చైనా వ్యాప్తంగా మంచు కురవడంతో పంటలు పాడైపోయి, ప్రజలు కరవుతో అలమటించారు.

క్రీ.శ. 536-539 మధ్య ఆహార లభ్యత విపరీతంగా క్షీణించింది.

541లో ఈజిప్ట్‌లోని రోమన్ పోర్టులో ప్రాణాంతక ప్లేగు వ్యాధి ప్రబలింది. దాన్ని ప్లేగ్ ఆఫ్ జస్టీనియన్ అని పిలిచారు. ఆ ప్లేగు కారణంగా దాదాపు సగం రోమన్ జనాభా ప్రాణాలు కోల్పోవడంతో పాటు తూర్పు రోమన్ సామ్రాజ్యం పతనమైంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2010లో ఐస్లాండ్‌లో బద్ధలైన ఓ అగ్నిపర్వతం కారణంగా కొన్ని కిలోమీటర్లమేర గాల్లోకి దట్టమైన పొగలు వ్యాపించాయి. యూరప్ వ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి.

ఇంతకీ విధ్వంసకర ఘటనలకు కారణమేంటి?

చీకటి యుగంగా పిలిచే ఆరో శతాబ్దంలో 536వ సంవత్సరాన్ని చీకటి ఘడియగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. కానీ, ఆ ఏడాది ప్రపంచాన్ని కమ్మేసిన మాయా మేఘాల గుట్టు ఇప్పటిదాకా వీడలేదు.

కానీ, ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఆ మాయా మేఘాల వెనకున్న కారణాలను కనుగొన్నట్టు చెబుతున్నారు. స్విజర్లాండ్‌లో ఓ మంచు ముద్దపై అతి సూక్ష్మంగా పరిశోధనలు జరిపాక తాము ఓ అంచనాకు వచ్చినట్టు చెప్పారు.

536వ సంవత్సరం నాటి ఓ మంచు ముద్దలో రెండు అతి సూక్ష్మ వాల్కనిక్ గాజు ముక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాన్ని బట్టి ఐస్లాండ్‌ లేదా ఉత్తర అమెరికాలో బద్ధలైన ఓ భారీ అగ్నిపర్వతం కారణంగా ఉత్తర ధృవం మొత్తం బూడిదతో నిండిన మేఘాలు ఆవరించాయన్న అంచనాకు వచ్చారు.

బలమైన గాలులు ఆ మేఘాల్ని యూరప్, ఆసియా ప్రాంతాలకు తరలించాయని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని చెబుతున్నారు.

540, 547వ సంవత్సరంలో కూడా అలాంటి భారీ అగ్నిపర్వతాలు బద్ధలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గడ్డకట్టుకుపోయిన మంచు ద్వారా భూమిపైన జీవానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు

ఎలా తేరుకుంది?

వరస అగ్నిపర్వత పేలుళ్లూ, ఆపైన విజృభించిన ప్లేగు వ్యాధి కారణంగా యూరప్ ఆర్థికంగా చిన్నాభిన్నమైంది. 640వ సంవత్సరం వరకు ఆ దశ కొనసాగింది.

640నాటి మంచు పెళ్లలపై జరిపిన పరిశోధనలు, ఆ కాలంలో పరిస్థితి మెరుగైందని తేల్చాయి. 500 సంవత్సరం నాటికి తగ్గిన వెండి మైనింగ్, 660 నాటికి మళ్లీ పెరిగిందని దాన్ని బట్టి చూస్తే అప్పటికి పరిస్థితి మెరుగైందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

660వ సంవత్సరంలోనే మరోసారి భారీ స్థాయిలో వెండి ఉత్పత్తి మొదలై, మధ్యయుగపు ఆర్థిక వ్యవస్థలో అది కీలకంగా మారింది.

వరసగా సంభవించిన ప్రకృతి విపత్తులు, ఐసులో గడ్డకట్టుకుపోయిన కాలుష్యాన్ని పరిశీలిస్తే రోమన్ సామ్రాజ్య పతనానికి దారి తీసిన వరస పరిణామాలేంటో అర్థమవుతాయని ఓక్లహామా యూనివర్సీటికి చెందిన చరిత్రకారుడు కైల్ హార్పర్ అన్నారు.

నాటి ఐసు రూపంలో ఎంతో సమాచారం గడ్డకట్టి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే పశ్చిమ నాగరికతలో ఓ చీకటి పర్వానికి దారితీసిన పరిణామాలపైన స్పష్టత వస్తుందని వాళ్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)