ఎల్టీటీఈ ప్రభాకరన్: బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్‌ గాంధీని మానవబాంబుతో హత్య చేశారు

  • 29 నవంబర్ 2018
ప్రభాకరన్ Image copyright AFP/GETTY IMAGES

వేలుపిళ్లై ప్రభాకరన్ కొంతమందికి స్వాతంత్య్ర సమర యోధుడైతే, మరి కొందరికి మాత్రం ఒక క్రూరమైన తీవ్రవాది.

ఒక దేశాధ్యక్షుడు, ఒక మాజీ ప్రధానమంత్రి హత్య, మరో అధ్యక్షుడిపై హత్యాయత్నంతోపాటు ఎన్నో రాజకీయ హత్యలు, ఆత్మాహుతి దాడులు, వందలాది ప్రజలు, సైనికుల మరణానికి ప్రభాకరన్ బాధ్యుడని చెప్పవచ్చు. ఇవన్నీ ఆయన ఒక ప్రమాదకరమైన వ్యక్తి అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి.

ఒసామా బిన్ లాదెన్ ఆదేశాలతో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేయడానికి ముందు ప్రభాకరన్ అనుచరులు కొలంబోలోని జనావాసాల్లో అలాంటి ఎన్నో భవనాలను భూస్థాపితం చేశారు.

కానీ ఒసామా లాదెన్‌లా ప్రభాకరన్ ఒక సంపన్న కుటుంబానికి చెందినవాడు కాదు. ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడానికి ఆయన వేరే దేశంలోకి వెళ్లి దాక్కోలేదు. ఏ మతం నుంచీ ప్రేరణ కూడా పొందలేదు. ప్రభాకరన్‌కు ఉన్న ఒకే ఒక్క మతం తమిళ జాతీయవాదం.

మామూలు ఆయుధాలు, 50 కంటే తక్కువ మంది అనుచరులున్న స్థాయి నుంచి కేవలం దశాబ్దంలోనే ఎల్టీటీఈని పది వేల మంది సైన్యం ఉన్న ఒక సంస్థగా మార్చారు ప్రభాకరన్. అంటే దానిని ఒక దేశ సైన్యానికే సవాలు విసరగలిగే స్థాయికి తీసుకొచ్చారు.

ఇద్దరు భారతీయుల నుంచే తను స్ఫూర్తి పొందానని ప్రభాకరన్ చెప్పేవారు. వారిలో ఒకరు భగత్ సింగ్ అయితే, ఇంకొకరు సుభాష్ చంద్రబోస్.

Image copyright ROBERT NICKELSBERG/GETTY IMAGES

నల్ల కాలు ఉన్న వ్యక్తి

1972లో ఆయన ఒక చెట్టు కింద కొంతమంది బాంబులు తయారు చేస్తుంటే చూస్తున్నారు. అప్పుడే ఒక బాంబు పేలింది. ఆ పేలుడు నుంచి ప్రభాకరన్ తృటిలో తప్పించుకున్నారు.

బాంబు పేలుడులో ఆయన కుడి కాలు కాలి నల్లగా కమిలిపోయింది. అప్పటి నుంచి ప్రభాకరన్‌కు 'కరికాలన్' అనే పేరొచ్చింది. అంటే 'నల్ల కాలు ఉన్న వ్యక్తి' అని అర్థం.

చాక్లెట్, పీతలు అంటే ఇష్టపడే ప్రభాకరన్ ఎల్టీటీఈలో సిగరెట్, మద్యం, లైంగిక సంబంధాలు లాంటివి నిషేధించారు. వాటిని ఎవరు ఉల్లంఘించినా అన్నిటికీ ఒకే ఒక శిక్ష విధించేవారు... మరణ శిక్ష.

లైంగిక సంబంధాలు పెట్టుకున్నందుకు ఆయన తనకు అంగరక్షకులుగా ఉన్న ఇద్దరు పురుషులు, ఒక మహిళను చంపించారు. కానీ తన విషయంలో మాత్రం ప్రభాకరన్ ఆ నియమాలను ఉల్లంఘించారు. మదివదని ఇరంబును పెళ్లాడారు.

Image copyright SENA VIDANAGAMA/AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక బాలసింగమ్‌తో ప్రభాకరన్

ప్రభాకరన్ మీడియా సమావేశం

2002 ఏప్రిల్‌లో ఆయన 12 ఏళ్ల తర్వాత ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి హాజరైనవారిలో ప్రభాకరన్ జీవితకథ 'ఇన్‌సైడ్ యాన్ ఎల్యూజివ్ మైండ్-ప్రభాకరన్' రచయిత ఎంఆర్ నారాయణ స్వామి కూడా ఉన్నారు.

దాని గురించి చెప్పిన నారాయణ స్వామి "మేం లిట్టె క్యాంపులో రాత్రంతా గడిపాం. ఉదయం బావి దగ్గర నీళ్లు తోడుకుని స్నానాలు చేశాం. నా 32 ఏళ్ల జర్నలిజం జీవితంలో అంత సెక్యూరిటీ ఎప్పుడూ చూళ్లేదు. ఆయన విలేఖరులందరినీ ఒక్కొక్కరుగా గదిలోకి పిలిపించారు. మా పెన్, పేపర్లు, పెన్సిళ్లు, నోట్‌ బుక్ అన్నీ జాగ్రత్తగా చూశారు. కొన్ని ఆయన దగ్గరే ఉంచేసుకున్నారు" అని చెప్పారు.

"మా అందరినీ విడివిడిగా ఫొటోలు తీశారు. మా దగ్గర కెమెరాలన్నీ అక్కడ ఉంచిన త్రాసులో పెట్టమన్నారు. వాటి బరువు చూశారు. ఆయనకు ప్రతి కెమెరా ఒరిజినల్ బరువు ఎంతో తెలుసని మాకు తర్వాత తెలిసింది. కెమెరాలో ఏవైనా పెట్టారేమో అని ఆయన సందేహించారు. విలేఖరుల రూపంలో సైనిక శిక్షణ పొందిన వారు వచ్చారేమో, బలంగా కండలు తిరిగి ఉన్నామేమో తెలుసుకోడానికి మా చేతులను కూడా పట్టి పట్టి చూశారు".

Image copyright Getty Images

మెడలో సైనేడ్ క్యాప్సూల్

ప్రభాకరన్ ఉపయోగించిన మొదటి ఆయుధం ఉండేలు. దానితో ఆయన పిట్టలు, తొండలు, ఉడతలను కొట్టేవారు. ఆ తర్వాత ఆయన ఒక ఎయిర్ గన్ తెప్పించుకున్నారు. దానితో బాగా ప్రాక్టీస్ చేసి గురి తప్పకుండా పేల్చడం నేర్చుకున్నారు.

"అప్పుడప్పుడు ప్రభాకరన్ తన చొక్కాలో రివాల్వర్ పెట్టుకుని మెల్లగా నడిచేవారు. హఠాత్తుగా పక్కకు తిరిగి ఒక ఊహాత్మక శత్రువును గురిచూసి కాల్చేవారు. తర్వాత తమ సైనికులు అందరూ చర్మంతో చేసిన హోల్‌స్టర్ ధరించాలని ఎల్టీటీఈ ఆదేశాలు జారీ చేసింది. హాలీవుడ్ సినిమాలను చూసి ప్రభాకరన్‌కు ఆ ఐడియా వచ్చింది" అని నారాయణస్వామి చెప్పారు.

"ఎల్టీటీఈలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ మెడలో సైనేడ్ క్యాప్సూల్ వేసుకుని ఉండాలని ప్రభాకరన్ ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే దాన్ని మింగి ప్రాణత్యాగం చేయాలి. ఆయన మెడలో కూడా నల్ల దారానికి సైనేడ్ క్యాప్సూల్ వేలాడుతుండేది. దానిని ఆయన ఎప్పుడూ తన చొక్కా జేబులో ఐడెంటిటీ కార్డులా పెట్టుకునేవారు" అని ఆయన చెప్పారు.

Image copyright AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక నార్వే విదేశాంగ మంత్రితో ప్రభాకరన్, బాలసింగమ్ (2004, నవంబర్ 11న )

నమ్మకానికి పరీక్షలు

ప్రభాకరన్‌కు వంట చేయడం అంటే ఇష్టం. తను చెన్నైకి వలస వెళ్లినపుడు ఆయన అందరితో కలిసి కూరగాయలు కట్ చేసేవారు. చికెన్ కర్రీ అంటే ప్రభాకరన్‌కు ఇష్టం. కానీ కష్టకాలంలో బ్రెడ్, జామ్‌తోనే కడుపు నింపుకున్నారు. ప్రభాకరన్ ఎప్పుడూ తాగే నీళ్లు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడేవారు. మరిగించకుండా వాటిని తాగేవారు కాదు.

సమావేశాలు జరిగేటప్పుడు ప్రభాకరన్ సోడా తాగుతూ ఉండేవారు. 1987లో ప్రభాకరన్ జాఫ్నాలో ఇరోస్ కార్యాలయానికి వెళ్లినప్పుడు, ఆయన చీఫ్ బాలాకుమార్ ఆయనకు తాగడానికి కోక్ ఆఫర్ చేశారు. ఒక ట్రేలో మూడు కోక్ బాటిల్స్‌తో ఓపెనర్ తెప్పించారు.

కానీ, ప్రభాకరన్ ఒక బాటిల్ తెరిచి బాలాకుమార్‌కు అందించారు. బాలాకుమార్ దానిని కొంచెం తాగేవరకూ ఆయన తన బాటిల్ మూత కూడా తీయలేదు. "టీ అయినా నేను, లేదా నా భార్య పెట్టినప్పుడే తాగుతాను" అని ప్రభాకరన్ ఒకసారి తనకు చెప్పినట్టు నారాయణస్వామి తెలిపారు.

Image copyright ROBERT NICKELSBERG/GETTY IMAGES

పరిశుభ్రత అంటే ఇష్టం

ప్రభాకరన్ ప్రతిరోజూ గడ్డం గీసుకునేవారు. ఎల్టీటీఈ బలం పెరిగేకొద్దీ ఆయన శుభ్రత కూడా పెరుగుతూ వచ్చింది. సోఫాలో కూచునే ముందు దానిపై దుమ్ము తుడిచాకే కూచునేవారు. ప్రభాకరన్‌కు సాలెగూళ్లు కనిపిస్తే అసహ్యం. ఎక్కడైనా బూజు కనిపిస్తే వెంటనే అక్కడ శుభ్రం చేయాలని ఆదేశించేవారు.

ప్రభాకరన్ ఒకసారి చెన్నైలోని తమిళ నేత నెడుమారన్ ఇంట్లో ఉన్నారు. ఒకరోజు ఆయన బట్టలు ఉతకడం నెడుమారన్ చూశారు. కానీ అవి ఆయనవి కావు. దాంతో నెడుమారన్ ఆయన్ను, 'ఏం చేస్తున్నారు' అని అడిగారు. దానికి ప్రభాకరన్ "ఈరోజు ఖాళీగా ఉన్నాను. అందుకే మా వాళ్ల బట్టలు ఉతుకుదామనిపించింది" అన్నారట.

Image copyright PRAKASH SINGH/AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక ప్రభాకరన్‌ను భారత్ తీసుకురావడానికి 1986లో జాఫ్నా వెళ్లిన హర్దీప్ సింగ్ పురి

ఫొటోగ్రఫిక్ మెమరీ

ప్రభాకరన్ ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చినా, తన ముందు ఒక రిస్ట్ వాచ్ పెట్టుకునేవారు. తను ఇచ్చిన సమయం అయిపోగానే మాట్లాడడం ఆపేయాలని సైగ చేసేవారు. ఆయనకు ఫొటోగ్రఫిక్ మెమరీ ఉండేది. ఎవరినైనా ఆయన్ను ఒక్కసారి కలిస్తే, తర్వాత వారిని ప్రభాకరన్ ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు.

1986లో భారత్-శ్రీలంక ఒప్పందంపై చర్చలు నడుస్తున్నప్పుడు ప్రభాకరన్‌ను దిల్లీ తీసుకురావడానికి శ్రీలంక అనుమతితో భారత్ ఎయిర్ ఫోర్స్ రెండు హెలికాప్టర్లను జాఫ్నా పంపింది. వాటిలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి హర్దీప్ సింగ్ పురి కూడా అక్కడకు వెళ్లారు. ఆయన ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ఉన్నారు.

అప్పుడు ఒక ఎల్టీటీఈ సభ్యుడు హర్దీప్ సింగ్ పురి చెవిలో గుసగుసగా "మీరు మా జాతీయ ఖజానాను మీతో తీసుకెళ్తున్నారు" అని అన్నాడు. దానికి ఆయన వెంటనే "చర్చల ఫలితం ఎలా ఉన్నా, మేం ప్రభాకరన్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నామో, ఆయన్ను తిరిగి అక్కడే వదిలి వెళ్తాం" అని చెప్పారు.

ట్రిగ్గర్ లాగే వేలికోసం జాగ్రత్తలు

చెన్నై విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌కు వచ్చాక ప్రభాకరన్‌కు ఇష్టమని హర్దీప్ పురి చికెన్ కర్రీ, అన్నం తెప్పించారు. కానీ ప్రభాకరన్ ఆయనతో "నేను చపాతీ మాత్రమే తింటాను, అన్నం తింటే ట్రిగ్గర్ నొక్కే వేలిపై ప్రభావం పడుతుంది" అని అన్నారు.

దిల్లీ చేరిన తర్వాత ప్రభాకరన్‌ను అశోకా హోటల్‌లో ఉంచారు. జులై 25న హర్దీప్ పురి ఆయనకు ఒప్పందం షరతులు చదివి వినిపించారు. వాటిని ప్రభాకరన్ సహచరుడు బాలసింగమ్ తమిళంలో తర్జుమా చేసి చెప్పారు. వాటివి వినగానే ఆ షరతులకు ఒప్పుకునేది లేదన్న ప్రభాకరన్, తమిళ ఈలమ్ డిమాండ్ వదిలేది లేదని గట్టిగా చెప్పారు.

ఈ చర్చల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కూడా ఉండాలని ప్రభాకరన్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ఆయన డిమాండు ఒప్పుకోవడంతో ఎంజీఆర్ వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. ఒప్పందంపై ఎలాగైనా సంతకం చేసేలా ప్రభాకరన్‌ను ఒప్పించాలని రాజీవ్ గాంధీ తన అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు.

"ఆయన కచ్చితంగా మొండివాడే. కానీ ఈ ఒప్పదంలో తన పాత్ర చాలా కీలకం అని వారితో రాజీవ్ గాంధీ అన్నారు. ప్రభాకరన్, ఆయన ప్రతినిధులెవరినీ విలేఖరులతో కలవనీయలేదు. దాంతో ఒప్పందంపై తనతో బలవంతంగా సంతకం పెట్టించాలని అనుకుంటున్నట్టు ప్రభాకరన్‌కు తెలిసిపోయింది. రాజీవ్ గాంధీని కలిసేందుకు ఆయన్ను చాలా కష్టపడి ఒప్పించారు" అని నారాయణస్వామి తెలిపారు.

ఒక తమిళనాడు మంత్రి, బాలసింగమ్‌తో కలిసి ప్రభాకరన్‌ రాజీవ్ దగ్గరకు వెళ్లారు. "శ్రీలంక ప్రభుత్వాన్ని నమ్మలేము" అని ఆయనతో అన్నారు. రాజీవ్ గాంధీ మాత్రం ప్రభాకరన్‌తో "నేను తమిళుల ప్రయోజనాల కోసమే ఈ పనిచేస్తున్నా" అని చెప్పారు. ప్రభాకరన్ చివరికి భారత్, శ్రీలంక ఒప్పందానికి ఒక అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

Image copyright PETER TURNLEY/CORBIS/VCG VIA GETTY IMAGES

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్

దాంతో రాజీవ్ గాంధీ చాలా సంతోషించారు. వెంటనే ప్రభాకరన్‌ కోసం భోజనం తెప్పించారు. ఆయన ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు, రాహుల్ గాంధీని పిలిచిన రాజీవ్ తన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసుకురమ్మని చెప్పారు. దాన్ని ప్రభాకరన్‌కు ఇస్తూ "మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి" అని చిరునవ్వుతో చెప్పారు.

రాజీవ్ గాంధీ మంత్రివర్గంలోని ఒక సభ్యుడు మాత్రం "ఎల్టీటీఈ ఆయుధాలు వదిలే వరకూ ప్రభాకరన్‌ను భారత్‌లోనే ఉంచేద్దాం" అని ఆయనతో అన్నారు. కానీ రాజీవ్ దానికి ఒప్పుకోలేదు. "ప్రభాకరన్ నాకు మాట ఇచ్చారు. నేను ఆయన్ను నమ్ముతున్నాను" అన్నారు.

కానీ, ప్రభాకరన్ ఆ మాట ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. చివరికి రాజీవ్ గాంధీ హత్యకే ఆదేశించారు. జాఫ్నా తిరిగి వెళ్లడానికి ముందు, ప్రభాకరన్ మద్రాసులో లెఫ్టినెంట్ జనరల్ దీపేందర్ సింగ్‌ను కలిశారు.

ఆరోజు జరిగింది దీపేందర్ సింగ్ చెప్పారు. "ప్రభాకరన్ నాకు గౌరవం ఇస్తూ, తన రబ్బర్ చెప్పులు గది బయటే వదిలి వచ్చారు. ఆయన కాస్త కంగారుగా ఉన్నట్టు కనిపించారు. భారత విదేశాంగ శాఖ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌ను ఇక ఎప్పటికీ నమ్మలేనని నాతో అన్నారు. నేను ఆయనతో మీరు మాకెప్పుడు ఆయుధాలు అందిస్తారు అని అడిగాను. దానికి ప్రభాకరన్ మా భారీ మెషిన్ గన్ మీ ముందు పెడతాం అన్నారు. ప్రభాకరన్ ఆ మాట ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఎల్టీటీఈ గెరిల్లాలు భారత సైన్యం ముందు లొంగిపోయినప్పుడు వారిలో ప్రభాకరన్ కనిపించలేదు."

Image copyright AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక ప్రభాకరన్ మృతదేహం

విషాదాంతం

ప్రభాకరన్ చేసిన చివరి యుద్ధంలో శ్రీలంక సైన్యం ఆయన్ను అన్ని వైపుల నుంచీ చుట్టుముట్టింది. ఒక బుల్లెట్ ఆయన మెదడును చీల్చుకుంటూ వెళ్లింది. దాంతో ఆయన పుర్రె చెదిరిపోయింది. అది తప్ప ఆయన శరీరంపై చిన్న గాయం అయిన గుర్తు కూడా లేదు.

మృతదేహం ఉన్న ప్రాంతమంతా మురికిగా ఉన్నా ప్రభాకరన్ యూనిఫాం శుభ్రంగా, ఎలాంటి మరకలూ లేకుండా కనిపించింది. ఆయన నడుముకు ఉన్న హోల్‌స్టర్‌లో ఒక పిస్టల్ వేలాడుతోంది. దానితోపాటు ఉపయోగించని ఆరు బుల్లెట్లున్నాయి. ప్రభాకరన్ దగ్గర ఒక మెటల్ కార్డ్ కనిపించింది. దానిపై 001 అనే నంబర్ రాసుంది.

ఆయన దగ్గర దొరికిన చిన్న బ్యాగ్‌లో సింగపూర్‌లో కొన్న ఒక హ్యాండ్ లోషన్, కొన్ని డయాబెటిస్ మాత్రలు కూడా కనిపించాయి.

ప్రభాకరన్‌పై మరో పుస్తకం రాసిన మేజర్ జనరల్ రాజ్ మెహతా "చివరి యుద్ధంలో ప్రభాకరన్ ఉన్న ముల్లైతీవు ప్రాంతాన్ని సైన్యం మూడు వైపుల నుంచీ చుట్టుముట్టింది. నాలుగో వైపు సముద్రం ఉంది. అక్కడి నుంచి శ్రీలంక ఆర్మీ తన ప్లాన్ అమలు చేసింది. అంటే అక్కడ ఆయన తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. శ్రీలంక సైన్యం రేడియోలో ప్రభాకరన్ మాటలు వింటూనే ఉంది. ఆయన లొకేషన్ గురించి వారికి కచ్చితంగా తెలుసు. సైన్యం ఆయన్ను 'బ్యాక్ టు ద వాల్' చేసింది.

ప్రభాకరన్ చనిపోయాక శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ఆ దేశ పార్లమెంటులో "ఇక నుంచి శ్రీలంకలో మైనారిటీలు ఎవరూ ఉండరు. ఇక నుంచి ఇక్కడ రెండు రకాల ప్రజలే ఉంటారు. ఒకరు తమ దేశాన్ని ప్రేమించేవారు, ఇంకొకరు తాము ప్రేమించని దేశంలో జన్మించిన వారు" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు LIVE: జగన్ సునామీ... 152 స్థానాల్లో ఆధిక్యం... 23 స్థానాల్లోనే టీడీపీ ప్రభావం.. మనుగడ కోసం జనసేన పోరాటం

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 300 స్థానాల్లో బీజేపీ.. 49 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

LIVE: నిజామాబాద్‌లో కవిత వెనుకంజ, మాల్కాజిగిరిలో రేవంత్ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

అమేఠీలో రాహుల్ గాంధీ వెనుకంజ.. ఆధిక్యంలో స్మృతీ ఇరానీ

‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా

‘జగన్‌కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్‌కు మాత్రమే ఉండేది’

నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు