నేటి నుంచి జీ-20 సదస్సు.. దీనికి ఉన్న ప్రాధాన్యం ఏంటి?

  • 30 నవంబర్ 2018
2017లో జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన మౌరిషియో మ్యాక్రి Image copyright G20 Handout
చిత్రం శీర్షిక 2017లో జీ20 అధ్యక్ష పదవిని చేపట్టిన మౌరిషియో మ్యాక్రి

జీ20 సదస్సులో.. సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి రావడంకంటే, వాటిమధ్య అభిప్రాయభేదాలే ఎక్కువ ఉంటాయన్నది ఓ థియరీ!

ఐక్యరాజ్య సమితిలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైన జీ 7 లేదా రష్యాతో కలిపి జీ 8 కూటమి ఉంది.

19 సభ్య దేశాలు, యురోపియన్ యూనియన్‌లు సభ్యులుగా ఉన్న జీ20 మాత్రం పైన పేర్కొన్న రెండింటికంటే భిన్నమైంది.

ఎందుకంటే.. జీ 20 ప్రపంచ ఆర్థికరంగంలో 85%, పెట్టుబడుల్లో 80%, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు ప్రాతినిధ్యం వహిస్తోంది.

ఈ కూటమి తొలి సమావేశం 2008లో వాషింగ్టన్‌లో జరిగిన తర్వాత, అంతర్జాతీయ ఆర్థిక విధానాలను చర్చించే వేదికగా జీ20 మారింది.

2018 నవంబర్ 30న అర్జెంటీనాలోని ‘బ్యూనస్ ఎయిర్స్’లో జీ20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్థికరంగానికి పొంచివున్న ప్రమాదాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

అజెండాను ప్రభావితం చేసే పరిణామాలు..

ఈ సదస్సులో ముఖ్యంగా వాణిజ్య యుద్ధానికి కాలు దువ్వుతున్న అమెరికా, చైనాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాన్ని 10-25 శాతానికి పెంచాలని యోచిస్తున్నట్లు ఇప్పటికే డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఆర్థిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు.. జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బాధ్యత వహించాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. కానీ, ఈ అంశాలేవీ జీ20 సదస్సుకు తలనొప్పులు కావని, ‘ప్రజాకర్షక జాతీయవాదం’ అన్నది ఒక్కటే ప్రస్తుతం జీ20 ముందున్న అసలైన సవాలు అని గ్లోబల్ గవర్నెన్స్ డైరెక్టర్ స్టీవార్ట్ ఎం.పాట్రిక్ అభిప్రాయపడ్డారు.

Image copyright AFP

సంక్షోభాన్ని అధిగమించిన దశ

2007-08లో తలెత్తిన ఆర్థిక సంక్షోభ సమయంలో స్పందించిన తీరు జీ20 సాధించిన ఘనవిజయం.

అంతర్జాతీయ వృద్ధిని బలపరచాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు మొదటిసారిగా ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి.

ఫలితంగా సభ్యదేశాలు.. ఆర్థికరంగానికి ఉత్తేజమిచ్చే విధానాలను అవలంబించాయి. కానీ ఈ విధానాలు, అంతర్జాతీయ ఆర్థికరంగ పనితీరులో సమూల మార్పులు తీసుకురావడంలో విఫలమయ్యాయి. దీంతో మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

Image copyright G20 Handout

ఒడిదొడుకులు

''ప్రపంచ ఆర్థికరంగం ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ద్వైపాక్షిక పన్నుల విధానం వల్ల, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు మందగించాయి. మరోవైపు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు.. పెట్టుబడులు తరలిపోవడం, ఆయా దేశాల ద్రవ్యరేటు బలహీనపడటం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి'' అని గతవారం విడుదలైన 'ఎకనమిక్ ఔట్‌లుక్' పత్రికలో 'ఆర్గనైజేషన్ ఫర్ ది ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్' పేర్కొంది.

'ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్' (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం అంతర్జాతీయ వృద్ధిరేటు ఈ సంవత్సరం 3.9% వరకూ పెరిగి, రానున్న సంవత్సరాల్లో బలహీనపడవచ్చు. ఇది అభివృద్ధి చెందుతున్న, చెందిన ఆర్థిక వ్యవస్థల్లో ఒకేరకంగా ఉండదు అని ఐఎంఎఫ్ పేర్కొంది.

అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధిలో భారత్, చైనా దేశాలు ముందంజలో ఉండగా, లాటిన్ అమెరికాలో వృద్ధి నెమ్మదించింది. ఇక పెరిగిన చమురు ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

ఆర్థిక ఉద్దీపనలు, నిరుద్యోగం తగ్గుదల అంశాలు అమెరికా ఆర్థికరంగం బలహీనపడకుండా కాపాడాయి.

Image copyright EPA

ఎదురుదెబ్బ

సంక్షోభం అనంతరం సభ్యదేశాలు అవలంబించిన ఆర్థిక విధానాలు ఆర్థికరంగం కుదేలైన పదేళ్ల తర్వాత కూడా ప్రపంచానికి సానుకూల ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

డోనల్డ్ ట్రంప్, బ్రెగ్జిట్, బ్రెజిల్ ప్రభుత్వ మితవాద ధోరణులను, యూరోపియన్ జాతీయవాద విధానాలను ఓటుహక్కును కోల్పోయిన సభ్యులు బలపరిచారు.

జీ20 విజయాలన్నీ గతానికే పరిమితమని, ఈ సమావేశాలు మాటలకు పరిమితమయ్యాయి కానీ ఆచరణలో ఏదీ జరగడంలేదన్న ఆరోపణలు కూడా జీ20పై ఉన్నాయి.

జీ20 ప్రాముఖ్యాన్ని కాపాడేందుకు సమావేశాలకు హాజరయ్యే నేతలంతా.. దేశాల మధ్య మరింత సహకారం ఉండాలని చర్చించబోతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు