ప్రపంచ ఎయిడ్స్ దినం: ముద్దులు, కౌగిలింతలు, తల్లిపాల ద్వారా హెచ్ఐవీ సోకుతుందా?

  • 1 డిసెంబర్ 2018
తల్లిపాలు తాగుతున్న శిశువు Image copyright iStock
చిత్రం శీర్షిక వైరస్ 'సప్రెస్డ్' దశలో ఉన్న తల్లులు దాన్ని వ్యాపింపజేయకుండా కూడా పిల్లలకు జన్మనివ్వొచ్చు

హెచ్‌ఐవీ ఇప్పటికీ చాలా దేశాలను వణికిస్తోంది. ఇప్పటిదాకా 3.5కోట్ల మందికి పైగా ప్రాణాలను ఎయిడ్స్ వ్యాధి బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కేవలం గత ఏడాదిలోనే దాదాపు పది లక్షల మంది హెచ్‌‌ఐవీ సంబంధిత వ్యాధుల కారణంగా చనిపోయారు.

ప్రస్తుతం సుమారు 3.7కోట్ల మంది హెచ్‌ఐవీతో జీవిస్తున్నారు. అందులో 70శాతం ఆఫ్రికాలోనే ఉన్నారు. వారిలో 18లక్షల మందికి 2017లోనే హెచ్‌ఐవీ సోకింది.

కేవలం హెచ్‌ఐవీ సోకిన వారిలోనే ఎయిడ్స్ ఉందని గుర్తించడానికి సాధ్యపడుతుంది. ఆ వైరస్ లేకపోతే, ఎయిడ్స్‌ను గుర్తించడానికి వీలుకాదు.

1980ల్లో ఎయిడ్స్ వ్యాధి ప్రబలినప్పటి నుంచీ దాని చుట్టూ ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు చుట్టుకున్నాయి. ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి.

డిసెంబర్ 1, ప్రపంచ ఎయిడ్స్ దినంనాడు ఆ సందేహాలను తొలగించే కథనం ఇది.

అపోహ: హెచ్ఐవీ సోకిన వారితో కలిసుంటే మనకు కూడా హెచ్ఐవీ వస్తుంది

కేవలం ఈ అపోహ కారణంగానే చాలా ఏళ్లపాటు హెచ్ఐవీ బాధితులపై వివక్ష చూపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, 2016లో యూకేలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 20 శాతం మంది ప్రజలు లాలాజలం ద్వారా లేదా ఒకరినొకరు తాకడం ద్వారా హెచ్‌ఐవీ సోకుతుందని నమ్ముతున్నట్లు తేలింది.

కానీ, తాకడం వల్లో, కన్నీళ్లు, చెమట, లాలాజలం, మూత్రం ద్వారానో హెచ్‌ఐవీ సోకదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక లాలాజలం ద్వారా హెచ్ఐవీ సోకదు

హెచ్ఐవీ ఇలా సోకదు

ఒకే గాలిని పీల్చడం ద్వారా...

కౌగిలింతులు, ముద్దులు, షేక్‌హ్యాండ్‌ల ద్వారా

ఒకే కంచంలో తినడం ద్వారా,

ఒకే షవర్ కింద స్నానం చేయడం ద్వారా

వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం ద్వారా

జిమ్‌లో ఒకే పరికరాలు వాడడం ద్వారా,

టాయిలెట్ సీటు, డోర్ హ్యాండిళ్లను ముట్టుకోవడం ద్వారా

ఈ పైన చెప్పిన ఏ పనులు చేసినా హెచ్‌ఐవీ సోకదు.

హెచ్‌ఐవీ శరీర ద్రవాల ద్వారా అంటే రక్తం, వీర్యం, యోని ద్రవాలు, తల్లిపాల ద్వారా వ్యాపిస్తుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కండోమ్స్ ద్వారా హెచ్ఐవీ, ఇతర సుఖ వ్యాధులను నివారించొచ్చు

అపోహ: సంప్రదాయ వైద్యం ద్వారా హెచ్‌ఐవీని తగ్గించొచ్చు

అస్సలు సాధ్యం కాదు. అది ఒట్టి అపోహ మాత్రమే. సంప్రదాయ వైద్యం ద్వారానో, శృంగారం చేసిన వెంటనే స్నానం చేయడం లేదా కన్యతో శృంగారం చేయడం వల్ల హెచ్ఐవీ తగ్గడం అంటూ ఉండదు.

భారత్‌, థాయిలాండ్, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ‘కన్యతో శృంగారంలో పాల్గొనడం’ ద్వారా హెచ్ఐవీ నిర్మూలన జరుగుతుందని నమ్ముతారు. కానీ, అది చాలా ప్రమాదకరం.

ఈ అపోహ వల్ల చిన్న పిల్లలు కూడా అత్యాచారానికి గురయ్యారు. వాళ్లు కూడా హెచ్‌ఐవీ ప్రమాదం బారిన పడ్డారు.

ప్రార్థనల ద్వారా మనసు కుదుటపడుతుందేమో కానీ, వైరస్ పైన శాస్త్రీయంగా ఎలాంటి ప్రభావమూ ఉండదు.

Image copyright Getty Images

అపోహ: దోమల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది

హెచ్‌ఐవీ రక్తం ద్వారా వ్యాపించినప్పటికీ దోమల ద్వారా లేదా రక్తాన్ని పీల్చే పురుగుల ద్వారా అది సంక్రమించదు. దానికి రెండు కారణాలు...

1. దోమలు కుట్టినప్పుడు అవి రక్తాన్ని పీలుస్తాయి తప్ప విడుదల చేయవు

2. హెచ్‌ఐవీ వరస్ కొద్ది సేపు మాత్రమే వాటి లోపల జీవించగలుగుతుంది.

అందుకే దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివశిస్తున్నప్పటికీ దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

Image copyright Getty Images

అపోహ: ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ రాదు

ఇతర రకాల శృంగారంతో పోలిస్తే ఓరల్ సెక్స్ ద్వారా రిస్క్ తక్కువే. 10వేల కేసుల్లో నాలుగు కేసుల్లో మాత్రమే హెచ్ఐవీ సోకే అవకాశం ఉంది.

కానీ, ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ సోకే ప్రమాదమైతే ఉంది. అందుకే వైద్యులు అన్ని రకాల శృంగారానికి కండోమ్స్ ఉపయోగించమని సిఫారసు చేస్తారు.

అపోహ కండోమ్స్ ధరిస్తే హెచ్ఐవీ రాదు

శృంగారం సమయంలో కండోమ్స్ విఫలమైతే, అంటే చిరిగిపోవడం, జారిపోవడం, లీక్ అవ్వడం లాంటివి జరిగితే హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉంది. అందుకే కండోమ్స్ ధరిస్తే సరిపోదు. హెచ్ఐవీ పరీక్షలు చేయించుకొని పాజిటివ్ అని తేలితే వెంటనే చికిత్స మొదలుపెట్టాలి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం హెచ్ఐవీ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి తమకు హెచ్ఐవీ సోకినట్లు తెలీదు. దాంతో ఇతరులకు కూడా అది వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువ.

Image copyright Getty Images

అపోహ: లక్షణాలు కనిపించకపోతే హెచ్ఐవీ లేనట్లే

ఎలాంటి హెచ్ఐవీ లక్షణాలు బయటపడకుండానే ఓ మనిషి 10-15ఏళ్లు జీవించే అవకాశం ఉంది. జ్వరం, తలనొప్పి, గొంతులో పుళ్లు లాంటి లక్షణాలు వైరస్ సోకిన తొలి వారంలో కనిపించొచ్చు.

ఇన్ఫెక్షన్ రోగ నిరోధక శక్తిని తగ్గించేకొద్దీ ఇతర లక్షణాలు బయటపడతాయి.

సరైన చికిత్స లేకపోతే అది టీబీ, క్రిప్టోకాకల్ మెనింజైటిస్, కేన్సర్లకు కూడా దారితీయొచ్చు.

Image copyright Getty Images

అపోహ: హెచ్ఐవీ ఉన్నవాళ్లు చిన్న వయసులోనే చనిపోతారు

తమకు హెచ్ఐవీ ఉన్న విషయం తెలుసుకొని, సరైన చికిత్స తీసుకుంటున్నవాళ్లు ఆరోగ్యకరంగా ఎక్కువ కాలంపాటు జీవిస్తున్నారు.

హెచ్ఐవీ సోకిన 47శాతం మంది రక్తంలో ఆ వైరస్ చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని, రక్త పరీక్షల్లో కూడా అది బయటపడదని ‘యూఎన్ఎయిడ్స్’ చెబుతోంది

అలా వైరస్ ‘సప్రెస్డ్’ దశలో ఉన్నవాళ్లు శృంగారం చేసినప్పటికీ ఇతరులకు దాన్ని వ్యాపింపజేయలేరు.

ఒకవేళ వాళ్లు చికిత్సను మానేస్తే మళ్లీ హెచ్ఐవీ స్థాయులు పెరిగే అవకాశం ఉంది.

2010లో కేవలం 80లక్షల మందే హెచ్ఐవీకి చికిత్స చేయించుకునేవారు. కానీ, 2017లో ఆ సంఖ్య 2.17 కోట్లకు చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అపోహ: హెచ్ఐవీ ఉన్న తల్లుల ద్వారా తప్పనిసరిగా వైరస్ పిల్లలకు సోకుతుంది

ప్రతిసారీ వైరస్ తల్లుల నుంచి పిల్లలకు సోకాలని లేదు. వైరస్ ‘సప్రెస్డ్’ దశలో ఉన్న తల్లులు దాన్ని వ్యాపింపజేయకుండా కూడా పిల్లలకు జన్మనివ్వొచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

మహిళలపై అత్యాచారాలకు రవాణా సౌకర్యాలు కొరత కూడా ఒక కారణమా?

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ