పెట్రోల్ ధర: భారత్‌లో తగ్గుతుంటే, ఫ్రాన్స్‌లో ఎందుకు పెరుగుతోంది?

  • 3 డిసెంబర్ 2018
పెట్రోలు పంపు Image copyright Getty Images

ఫ్రాన్స్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం ఇక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 120 ఉంది. దాంతో కొన్ని రోజులుగా పారిస్‌లో లక్షల మంది రోడ్ల మీదికొచ్చి ఆందోళనలు చేస్తున్నారు.

తాజా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శనివారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 23 మంది పోలీసులతో పాటు 100 మందికి పైగా గాయపడ్డారు. 400 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆందోళనలకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించారు. స్టన్ గ్రెనేడ్లు, వాటర్ కెనాన్లు వినియోగించారు.

రెండు వారాలుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ముగ్గురు నిరసనకారులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

శనివారం ఒక్కరోజే 190 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని, ఆరు భవనాలకు నిప్పు పెట్టారని ఫ్రాన్స్ హోంమంత్రి తెలిపారు.

ఈ ఘటనల నేపథ్యంలో దుకాణాలను, మెట్రో స్టేషన్లను మూసివేశారు.

"యెల్లో వెస్ట్ ప్రొటెస్ట్" పేరుతో జరుగుతున్న ఈ నిరసనలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 1,36,000 మంది ఆందోళనల్లో పాల్గొన్నారని ఫ్రాన్స్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

Image copyright AFP / GETTY IMAGES

భారత్‌లో తగ్గుతోంది, ఫ్రాన్స్‌లో పెరుగుతోంది

అంతర్జాతీయంగా కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన ఇంధన ధరలు కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అందుకే, భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్నాయి.

గడచిన ఆరు వారాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.9.6, డీజిల్ ధర రూ.7.56 తగ్గిందని భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురువారం తెలిపింది.

అయితే, ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం ధరలు తగ్గించడం లేదు. పైగా, ఎకో ఫ్రెండ్లీ కార్లు, గ్రీన్ ఫ్యూయల్ వాడకం పెంచాలంటూ అధ్యక్షుడు మేక్రాన్ లీటరు డీజిల్‌పై 7.6 సెంట్లు, లీటరు పెట్రోలుపై 3.9 సెంట్ల హైడ్రోకార్బన్ పన్ను విధించారు.

భూతాపాన్ని తగ్గించేందుకే ఈ పన్నులు విధించామని మేక్రాన్ చెబుతున్నారు.

ఫ్రాన్సులో ఎక్కువగా డీజిల్ ఉపయోగిస్తారు. ఇవి గత 12 నెలల్లో దాదాపు 23 శాతం పెరిగాయి. దేశంలో లీటరు డీజిల్ ధర సగటున 120 రూపాయలు (1.51 యూరోలు) ఉంది. 2000 సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం.

అంతేకాదు, 2019 జనవరి 1 నుంచి ఆ పన్ను మరింత పెంచాలని ఆయన నిర్ణయించారు. డీజిల్‌ మీద 6.5 సెంట్లు, పెట్రోలు మీద 2.9 సెంట్లు పెంచాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రజల్లో మరింత ఆగ్రహం పెంచింది.

Image copyright EPA
చిత్రం శీర్షిక హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను అధ్యక్షుడు మేక్రాన్ పరిశీలించారు.

ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లనే

పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలనుకునే ముందు ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను మెరుగుపరచపోవడం వల్లనే ప్రజలంతా తిరగబడటానికి కారణమని విశాఖపట్నంకు చెందిన విశ్రాంత భారత ప్రభుత్వ ఇంథన శాఖ కార్యదర్శి, విశ్లేషకులు ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.

భారత ప్రభుత్వం సరైన ప్రణాళికతో ముందుకెళ్లకుంటే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

"ప్రపంచంలో చమురు నిక్షేపాలు తక్కువ పరిమితిలో ఒపెక్(ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్) వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతున్నాయి. అటువంటి చమురు పదార్థాల మీద ఫ్రాన్స్‌, ఇతర యూరోపియన్ దేశాలు పెద్దఎత్తున ఆధారపడుతున్నాయి.’’

‘‘గత ఐదారు ఏళ్లుగా చమురు ధరలు తగ్గడం వలన ఫ్రాన్సులో రవాణా సౌకర్యాలకు కావలసిన ఇంధనం ధర కూడా తక్కువగానే ఉంది. అందుకు ప్రజలు అలవాటుపడ్డారు. కానీ, ఇరాక్‌లో చమురు ఉత్పత్తి తగ్గడం వలన, అమెరికా ఇరాన్ మీద నిబంధనలను పెట్టడం వలన, చమురు ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని చమురు దిగుమతుల మీద ఆధారపడుతున్న దేశాలు, ఆ దిగుమతులను తగ్గించే ఉద్దేశంతో ఇలాంటి సుంకాలు పెంచుతున్నాయి. అయితే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు ఈ పన్నుల భారాన్ని సహించలేకపోతున్నారు. ఫ్రాన్స్‌లో అటువంటి తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల సంఖ్య అధికంగా ఉండడంవలన, అక్కడి ప్రజలు, ముఖ్యంగా యువత ఉద్యమ బాట పట్టారు.’’

‘‘ప్రభుత్వాలు చమురు ధరలను పెంచడానికి ముందు ప్రత్యామ్నాయ ప్రణాళికను, అంటే పర్యావరణహిత వాహనాల ఉత్పత్తి పెంచడం, బ్యాటరీ వాహనాలను ప్రవేశపెట్టడం వంటివి చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమాలు చేపట్టేవారు కాదు. ఇప్పుడైనా ఫ్రాన్సులో ప్రభుత్వం చమురు పదార్థాలమీద సుంకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించడం మంచిది.’’

‘‘భారత్‌లో కూడా కొంతవరకు ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగినప్పుడు ప్రజలలో అసంతృప్తి పెరుగుతున్నది.’’

వెంటనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళిక, ప్రజా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, చమురు తక్కువగా ఉపయోగించే వాహనాల ఉత్పత్తి పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముంది" అని ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.

Image copyright AFP / GETTY IMAGES

'యెల్లో వెస్ట్ ప్రొటెస్ట్'

ఫ్రాన్స్‌లో కార్లు ఆగిపోయిన సమయంలో రోడ్డుపై ఉన్న డ్రైవర్లు కచ్చితంగా పసుపు జాకెట్లు ధరించాలనే నియమం ఉంది.

దూరం నుంచి స్పష్టంగా కనిపించే ఈ పసుపు జాకెట్ల వల్ల ప్రమాదాలు తగ్గుతాయి. అందుకే అందరూ వీటిని కార్లలో పెట్టుకుంటారు.

ఇప్పుడు వాటినే నిరనసకారులు తమ ఆందోళనల్లో ధరిస్తున్నారు. దాంతో వీటిని 'యెల్లో వెస్ట్ ర్యాలీలు' అని పిలుస్తున్నారు.

ఈ ఉద్యమానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారో తెలియదు. కానీ, సోషల్ మీడియా ద్వారా అనేక మంది ఒక్కచోటకి వస్తున్నారు. నవంబర్ 17న తొలిసారిగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో దాదాపు 3,00,000 మంది పాల్గొన్నారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు

హింసను ఉపేక్షించేది లేదు: మేక్రాన్

హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు మేక్రాన్ హెచ్చరించారు.

పారిస్‌లో ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మంత్రులతో పాటు, భద్రతా విభాగాల ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే, దాని గురించి భద్రతా సమావేశంలో చర్చించలేదని మంత్రులు తెలిపారు.

ఈ సమావేశానికి ముందు పారిస్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను మేక్రాన్ పరిశీలించారు.

ఆ ఘటనలకు కారణమైన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని న్యాయశాఖ మంత్రి నికోల్ బెలౌబెట్ హెచ్చరించారు.

ప్యారిస్‌లో శనివారం జరిగిన ఆందోళనలు జీ 20 సదస్సు వరకూ వెళ్లాయి.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్యారిస్‌లో ఆందోళనలను జీ 20 వేదికపై నుంచే ఖండించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం సరికాదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)