అమెరికా, నెదర్లాండ్స్‌లో రాముని కరెన్సీ: ఈ వార్తల్లో నిజమెంత, రాముని కరెన్సీ చరిత్ర ఏమిటి

  • 5 డిసెంబర్ 2018
రామ్ కరెన్సీ నోటు Image copyright https://www.maharishivediccity-iowa.gov

తెలంగాణ, రాజస్థాన్‌ సహా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలన్నిటిలో అనేకరకాల ఫేక్ న్యూస్ వ్యాప్తిలో ఉన్నాయి.

వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు.

అలాంటి ఒక పోస్టులో ‘రామ్ కరెన్సీ’ నోట్లు అమెరికా, నెదర్లాండ్స్‌లో అధికారికంగా చలామణిలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు ఈ నోట్ల బొమ్మలను కూడా పోస్టు చేస్తున్నారు.

Image copyright Twitter/zuvenile4ever

ఆ నోటుపై 18 భాషలలో రాసి ఉందని, దాని ధర యూరో, డాలర్ కన్నా ఎక్కువంటూ కూడా ఆ పోస్టులలో ఉంది.

రాజస్థాన్ పత్రిక, దైనిక్ జాగరణ్ పత్రికలు కూడా ఈ కథనాలను ప్రచురించాయి.

ఆ వార్తలలో అవి, 'ఈ దేశాలలో రాముని నోట్లు చెల్లుబాటు అవుతాయి. 10 యూరోలు ఒక రామ్‌కు సమానం' అని రాశాయి.

బీబీసీ పరిశోధనలో రాముని నోట్లు ఉన్నా.. అవి అమెరికా, నెదర్లాండ్స్‌లో చెల్లుబాటు అవుతాయన్న వార్తలు మాత్రం అసత్యాలని తేలింది.

ఆ రెండు దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎన్నడూ రాముని నోట్లను అధికారిక కరెన్సీగా పరిగణించలేదు.

రాముని కరెన్సీ వాదన

ఇటీవల రామమందిరంపై రాజకీయంగా తిరిగి వివాదం నెలకొన్న నేపథ్యంలో, ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికాలో ఉంటున్న @SpokenTwilight పేరుతో ఉన్న ట్విటర్ యూజర్ ఒకరు.. అమెరికాలోని అనేక నగరాలలో అది చెల్లుబాటు అవుతుందని తన పోస్టులో పేర్కొన్నారు.

ట్విటర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఫిబ్రవరి, 2018లో ఈ అకౌంట్ సృష్టించారు. దాని సృష్టికర్త 'అమెరికన్ హిందూ పునరుజ్జీవం' తన లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

ఏమిటీ 'రామ్ కరెన్సీ'?

మా పరిశోధనలో ఈ నోట్లను 2002లో అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఉన్న 'మహర్షి వేదిక సిటీ'లో ఉన్న 'ద గ్లోబల్ కంట్రీ ఆఫ్ వాల్డ్ పీస్' అన్న సంస్థ ముద్రించింది.

అదే ఏడాది నెదర్లాండ్స్‌లో కూడా ఆ నోట్లను పంచారు.

'ద గ్లోబల్ కంట్రీ ఆఫ్ వాల్డ్ పీస్'‌ను మహర్షి మహేష్ యోగి స్థాపించారు. 2008లో ఆయన మరణించాక, ఆ కరెన్సీ గురించి ఎలాంటి సమాచారమూ లేదు.

ఇప్పటికీ వేదిక్ సిటీలోని ఆకర్షణీయమైన వాటిలో ఈ కరెన్సీ ఒకటని చెప్పుకొంటున్నారు.

ఆ సంస్థ వెబ్ సైట్‌లో ''2002, ఫిబ్రవరి 24 నుంచి వేదిక్ సిటీ రామ్ కరెన్సీని చలామణిలోకి తెచ్చింది. వేదిక్ సిటీ అభివృద్ధి కోసం, స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం సిటీ కౌన్సిల్ రామ్ కరెన్సీని అంగీకరిస్తోంది,'' అని పేర్కొన్నారు.

''ఒక రామ్ కరెన్సీ నోటు విలువ పది అమెరికా డాలర్లకు సమానం. ఈ ధరకు ఎవరైనా ఆ నోట్లను కొనుగోలు చేయొచ్చు. ఒకటి, ఐదు, పది రామ్ నోట్లు అందుబాటులో ఉన్నాయి'' అని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

అంటే, ఆశ్రమంతో సంబంధాలు ఉన్న వ్యక్తుల మద్య మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయి.

యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ పంకజ్ జైన్ మహర్షి వేదిక్ సిటీ.. వైదిక విధానంలో వ్యవసాయం, ఆరోగ్య సేవలు, విద్యను ప్రారంభించిందని ట్వీట్ చేశారు.

Image copyright TWITTER

రామ్ కరెన్సీ బాండ్లు

ఒకానొక సమయంలో మహర్షి మహేశ్ యోగికి 60 లక్షలకు పైగా అనుచరులు ఉండేవారు.

అమెరికాకు చెందిన ప్రముఖ మ్యూజికల్ బ్యాండ్ 'ద బీటిల్స్' బృందం కూడా మహేశ్ యోగి అనుచరులే.

మహేశ్ యోగి ఉన్న సమయంలో రామ్ కరెన్సీ నోట్లను బాండ్ల రూపంలో విక్రయించారు.

ఒక పాత బీబీసీ నివేదిక ప్రకారం, 2003లో నెదర్లాండ్స్‌లోని సుమారు 100 షాపులు, 30 గ్రామాలలో, ఒక నగరంలోని కొన్ని ప్రాంతాలలో రామ్ కరెన్సీ చలామణి అయ్యేది.

అదే సమయంలో డచ్ సెంట్రల్ బ్యాంక్ తాము రామ్ కరెన్సీపై ఒక కన్ను వేసి ఉంచామని పేర్కొంది. మహర్షి మహేశ్ యోగి సంస్థ ఆ కరెన్సీని అంతర్గతంగా మాత్రమే వినియోగించాలని, చట్టాన్ని ఉల్లంఘించే ఎలాంటి కార్యకలాపాలకూ పాల్పడరాదని హెచ్చరించింది.

నెదర్లాండ్స్ ప్రభుత్వ బ్యాంక్ ప్రకారం, 2002లో వేదిక్ సిటీ సుమారు ఒక లక్ష రామ్ కరెన్సీ నోట్లను ముద్రించింది. అయితే ఎన్నడూ కూడా ఆ కరెన్సీ చట్టబద్ధంగా చలామణి అవుతుందని చెప్పలేదు.

ఈ నోట్లు కేవలం ఒక సంస్థ ముద్రించి, దానికొక విలువను ఆపాదించిన కాగితం ముక్కలు. వాటిని కేవలం పనికి లేదా ఉత్పత్తికి మారుగా ఉపయోగించాలి.

Image copyright umedsinh_chavda

ఎందుకు రామ్ కరెన్సీ భారతదేశంలో లేకుండా కేవలం విదేశాలలోనే ఉంది?

తనను తాను గుజరాత్‌కు చెందిన 'సనాతన్ ధర్మ్ ఫౌండేషన్' జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే ఉమేద్ సింగ్ చావ్లా, ట్విటర్‌లో, ''అమెరికా, నెదర్లాండ్స్‌లో ఉపయోగించే ఒక రామ్ కరెన్సీ నోటు విలువ పది యూరోలకు సమానం'' అని పేర్కొన్నారు.

దాంతో పాటు ఆయన ఒక ప్రశ్న కూడా జోడించారు.

ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేసిన ఆయన, 'రామ్ కరెన్సీ విదేశాలలో చెల్లుబాటు అవుతున్నపుడు, మన దేశంలో ఎందుకు చెల్లుబాటు కాదు?' అని ప్రశ్నించారు.

కొన్ని సోషల్ మీడియా పోస్టులలో, ''భారతదేశంలో రామరాజ్యాన్ని తీసుకురావడానికి విశ్వ కరెన్సీ అయిన రామ్‌ను భారతదేశంలో చలామణిలోకి తీసుకురావాలి' అని చెబుతున్నారు.

రామమందిరాన్ని నిర్మించాలంటున్న కొన్ని హిందూ సంస్థలు కూడా 'రామ్ కరెన్సీ'ని తీసుకురావాలని అంటున్నాయి.

Image copyright Facebook

ఈస్టిండియా కంపెనీకి చెందిన 'హిందూ నాణాలు'

సోషల్ మీడియాలో కేవలం 'రామ్ కరెన్సీ' గురించి మాత్రమే చర్చ జరగడం లేదు.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ 19వ శతాబ్దంలో హిందువులను గౌరవిస్తూ హిందూ దేవుళ్లను తమ నాణేలపై ముద్రించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది కూడా వాస్తవం కాదు.

దీనిపై బీబీసీ బ్రిటన్‌లోని యాష్మోలియన్ మ్యూజియంలోని నాణేల స్పెషలిస్ట్ శైలేంద్ర భండారెతో మాట్లాడింది.

''ఈ నాణేలను ఆధునిక సాంకతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేశారు. ఇలాంటి నాణేలను కొన్ని మతపరమైన ఆచారాలలో ఉపయోగిస్తారు. ఫకీర్లు, సాధువుల వద్ద ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ధనవంతులు కావాలనుకునేవాళ్లు, పిల్లలు లేని వాళ్లు తమ వద్ద ఇలాంటి నాణేలు పెట్టుకోవాలని సూచిస్తారు.అంతే కానీ వాటికి ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేదు'' అని భండారె అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)