‘‘కొన్ని నెలలు కోమాలో ఉన్నా.. రెండు సార్లు ఉరివేసుకున్నా’’

  • 6 డిసెంబర్ 2018
స్వెటా

చిన్నప్పుడే ఒళ్లంతా కాలిపోయింది. తండ్రి చనిపోయాడు. తల్లి వద్దనుకుంది. అనాథాశ్రమంలో రెండు సార్లు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయినా బతికింది. ఇప్పుడు ఆమె జీవితం, ఇతరులకు స్ఫూర్తి పాఠం.

ఆమె పేరు స్వెటా. స్వదేశం రష్యా. ఒకప్పుడు చావు అంచుల దాకా వెళ్లిన ఆమె, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా మారింది. ఆమె కథ, ఆమె మాటల్లోనే...

ఫ్రెడ్డీ క్రుగెర్ (కాలిన గాయాలున్న వ్యక్తి), ఫ్రాంకెన్‌స్టీన్ (ఓ వింత పాత్ర), ఫ్లాట్ - చెస్టెడ్... చాలామంది నన్ను అలానే పిలుస్తారు.

నా పేరు స్వెటా. స్వెటా 'చార్‌కోల్'(బొగ్గు). నాకు నాలుగేళ్లున్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి శరీరం కాలిపోయింది అందుకే నన్ను 'చార్‌కోల్' అంటారు.

హెచ్చరిక: ఈ కింది వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఆమె కాలిన గాయాలు... ఇతరులకు బతుకు పాఠాలు

నా బట్టలకు మంట అంటుకుంది. చాలా నెలల పాటు కోమాలో ఉన్నా. కోలుకున్నాక నడవడం, మాట్లాడటం మళ్లీ నేర్చుకున్నా. స్కూల్‌కి వెళ్లలేకపోయా. అక్కడ అందరూ వెక్కిరించేవాళ్లు.

ఇంట్లో మా అమ్మ కూడా నన్ను సరిగ్గా చూసేది కాదు. మా నాన్న చనిపోయాక అమ్మ మద్యానికి బానిసైంది. చివరికి ఉన్న డబ్బంతా ఖర్చవ్వడంతో అమ్మ తప్పనిసరై మద్యం మానేసింది.

నన్ను అనాథాశ్రమానికి తీసుకెళ్లారు. నాకు ఈ ప్రపంచంలో చోటు లేదనిపించింది. అందుకే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించా. ఆర్నెల్ల తరువాత మళ్లీ చనిపోవడానికి ప్రయత్నించా. కానీ, రెండుసార్లూ ప్రాణాలతో బయటపడ్డా. దాంతో ఆ ప్రయత్నాలు ఆపి సానుకూల దృక్పథంతో బతకాలనుకున్నా.

ఆ ఏడాది అనాథాశ్రమం నుంచి మాస్కోకు పారిపోయా. అదో భిన్నమైన ప్రపంచం. అక్కడ అన్నీ కొత్తగా కనిపించాయి. ఇప్పటికీ జనాలు నన్ను కన్నార్పకుండా చూస్తుంటారు. రెండోసారి చావు నుంచి బయటపడ్డాక నాకో ఆలోచన కలిగింది.

కొంతమంది చాలా అనూహ్యంగా చనిపోతుంటారు. అలాంటిది నేను ఎలా ప్రాణాలతో బయటపడ్డానా అనిపించింది. అంటే... ఈ ప్రపంచానికి నేను కావాలేమో అనిపించింది.

ఆర్నెల్ల క్రితం నేనో ఇన్‌స్టాగ్రామ్ పేజీ మొదలుపెట్టా. ప్రస్తుతం 22వేల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. నా గాయాల ఫొటోలు పోస్ట్ చేస్తూ జీవితం గురించి రాస్తుంటా. నేను వాళ్లతో నేరుగా మాట్లాడక పోయినా, ఇది తమపై సానుకూల ప్రభావం చూపుతోందని చాలామంది అంటున్నారు. వాళ్లు నా ఫొటోలకు చాలా స్పందిస్తున్నారు.

చిత్రం శీర్షిక స్వెటా ఇన్‌స్టాగ్రామ్ పేజీ

రష్యాలో ప్రజలు ఇప్పుడిప్పుడే 'బాడీ పాజిటివిటీ' గురించి మాట్లాడుతున్నారు. నేను మరింత మందికి చేరువవ్వాలని, సోషల్ మీడియాలో ఇలాగే ముందుకెళ్లాలని అనుకుంటున్నా.

నేను ఎంత ఎక్కువమందికి తెలిస్తే, అంత ఎక్కువ ఆశ, ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పంచగలను. అసాధ్యురాలు, మంచి మనసున్న మనిషి, ఉద్యమకారిణి... అన్నీ కలిపితే నేను.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

#100Women: మహిళలు చదువుకుంటే ప్రపంచానికే మేలు - అరణ్య జోహర్

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలి.. వికలాంగ ఉద్యమకారులకు విమానాశ్రయంలో అవమానం

కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?

హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు

ఆస్ట్రేలియాలోని వార్తాపత్రికలు మొదటి పేజీలను పూర్తిగా నలుపు రంగుతో నింపేశాయెందుకు?