బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా? రోజూ తినే ఆహారంలో అదే ముఖ్యమైనదా?

  • జెస్సికా బ్రౌన్
  • బీబీసీ ప్రతినిధి
బ్రేక్‌ఫాస్ట్

ఫొటో సోర్స్, iStock

ఆరోగ్యంగా, శారీరకంగా దృఢంగా ఉండే వాళ్లెవరూ బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఉండరని వింటూ వచ్చాం. దీని అర్థం బ్రేక్‌ఫాస్ట్‌ మనల్ని ఆరోగ్యంగా, సన్నగా చేస్తుందా? లేదా దాని వెనకాల మరేదైనా కారణముందా?

పిల్లలు బ్రేక్‌ఫాస్ట్‌ చేయడానికి తల్లిదండ్రులు ఎక్కువగా ఉపయోగించే అస్త్రం - అది రోజులో చాలా ముఖ్యమైన ఆహారం అని. మనలో చాలా మంది దానిని నమ్ముతూ పెరిగాం.

బ్రేక్‌ఫాస్ట్‌ ఎందుకు ముఖ్యమైనది అనడానికి క్లూ దాని పేరులోనే ఉంది. మనం రాత్రంతా ఖాళీ కడుపుతో ఉండి, ఉదయపు అల్పాహారంతో దానికి బ్రేక్ వేస్తాం.

''మన శరీరం ఎదుగుదలకు, రిపేర్లకు రాత్రిళ్లు చాలా శక్తి ఖర్చయిపోతుంది. ఒక సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ శక్తిని తిరిగి పుంజుకుంటాం'' అని డైటీషియన్ సారా ఎల్డర్ తెలిపారు.

అయితే మనం తీసుకునే ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌కు ఏ స్థానం ఇవ్వాలన్న దానిపై చాలా వివాదమే ఉంది.

బ్రేక్‌ఫాస్ట్‌ ముఖ్య ఆహారమన్న వాదన వెనుక ఆహార పరిశ్రమ ఉందేమోనన్న అనుమానాల నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ప్రమాదకరమన్న అనేక వాదనలు ఉన్నాయి.

ఇంతకూ బ్రేక్‌ఫాస్ట్‌ అత్యంత ముఖ్యమైనదన్న వాదన వెనుక వాస్తవం ఎంత? అది నిజమేనా లేక ఆహార సంస్థల మార్కెటింగ్ వ్యూహమా?

ఫొటో సోర్స్, Getty Images

బ్రేక్‌ఫాస్ట్‌-స్థూలకాయం

బ్రేక్‌ఫాస్ట్‌ గురించి జరిగే చాలా పరిశోధనల్లో స్థూలకాయం ఒక ముఖ్యాంశంగా ఉంటోంది. ఆ రెండింటికీ మధ్య ఉన్న సంబంధం గురించి సైంటిస్టులు భిన్నమైన సిద్ధాంతాలు చెబుతారు.

అమెరికాలో ఏడేళ్లపాటు 50 వేల మందిపై నిర్వహించిన ఒక పరిశోధనలో, వారి ఆహారంలో బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువ పరిమాణంగా ఉన్నవారిని పరిశీలించారు. ఈ పరిశోధనలో మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం ఎక్కువ(పరిమాణం)గా చేసే వారికన్నా బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్న వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) తక్కువగా ఉంటుందని వెల్లడైంది.

బ్రేక్‌ఫాస్ట్‌ ఆకలి తీరిన తృప్తిని ఇస్తుందని, బ్రేక్‌ఫాస్ట్‌లోని ఆహార పదార్థాలలో పీచుపదార్థాలు, న్యూట్రియెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆహార నాణ్యత పెరుగుతుందని పరిశోధకులు వాదించారు. అంతే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల తదనంతరం చేసే భోజనంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, దీని వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

బ్రేక్‌ఫాస్ట్ చేయనివారికి స్థూలకాయం వచ్చే అవకాశం ఉందా?

దీన్ని కనుగొనేందుకు పరిశోధకులు 52 మంది స్థూలకాయ మహిళలపై 12 వారాల పాటు వెయిట్ లాస్ ప్రయోగం నిర్వహించారు. వారందరికీ రోజులో ఒకే మోతాదులో కెలోరీలు కలిగిన ఆహారాన్ని ఇచ్చారు. అయితే వారిలో సగం మంది బ్రేక్‌ఫాస్ట్ చేయగా, మిగతా సగం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు.

అయితే కేవలం బ్రేక్‌ఫాస్ట్‌ వల్లే వాళ్లు బరువు కోల్పోలేదని తేలింది. వాళ్ల రొటీన్‌ మారడం వల్ల బరువు కోల్పోయారు.

బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన బృందంలో - తాము గతంలో బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారమని చెప్పిన మహిళలు, మానేసాక 8.9 కిలోలు తగ్గామని చెప్పగా, అదే బ్రేక్‌ఫాస్ట్ చేయని బృందం 6.2 కిలోలు మాత్రం తగ్గారు.

అదే సమయంలో బ్రేక్‌ఫాస్ట్ చేయని బృందంలో - బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ప్రారంభించినపుడు 7.7 కిలోలు కోల్పోయామని, బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం కొనసాగించినపుడు 6 కిలోలు తగ్గామని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

బరువు తగ్గడానికి బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే కారణం కానపుడు, మరి స్థూలకాయానికి, బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడానికి మధ్య సంబంధం ఏమిటి?

బ్రేక్‌ఫాస్ట్‌ చేయని వాళ్లకు పోషకాహారం, ఆరోగ్యం గురించి సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమై ఉండవచ్చని యూనివర్సిటీ ఆఫ్ అబెర్డీన్ లో ప్రొఫెసర్ అలెగ్జాండ్రా జాన్‌స్టోన్ తెలిపారు.

''సాధారణంగా బ్రేక్‌ఫాస్ట్ చేసేవాళ్లు పొగ తాగకపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండడం కారణం కావచ్చు'' అంటారు ఆమె.

ఫొటో సోర్స్, Getty Images

విందా? ఉపవాసమా?

తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకుంటున్న వారు రాత్రంతా ఏమీ తినకుండా ఉండడమే కాకుండా, దానిని మరుసటి రోజు పగటి పూట కూడా కొనసాగించడమనే అలవాటు పెరుగుతోంది.

2018లో నిర్వహించిన ఒక పరిశోధనలో, మధ్యమధ్యన ఉపవాసం ఉండడం వల్ల రక్తంలోని షుగర్ లెవల్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ నియంత్రణలో ఉంటాయని, రక్తపోటు తగ్గుతుందని గుర్తించారు.

బర్మింగ్‌హామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామా ప్రొఫెసర్ కర్ట్‌నీ పీటర్సన్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో.. ప్రి-డయాబెటీస్‌తో ఉన్న ఎనిమిది మంది పురుషులను ఎంపిక చేసుకుని, రెండు షెడ్యూళ్లలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకోమని సూచించారు.

ఒక షెడ్యూల్‌లో అన్ని కెలోరీలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీసుకుంటే, రెండో షెడ్యూల్‌లో అదే పరిమాణంలోని కెలోరీలను 12 గంటల కాలవ్యవధిలో తీసుకోమన్నారు.

ఈ ప్రయోగంలో 9.00-15.00 బృందం ఆరోగ్యం, రక్తపోటును తగ్గించే మందులు తీసుకుంటున్న వారి ఆరోగ్యంతో సమానంగా ఉన్నట్లు తేలింది.

ఇక యూనివర్సిటీ ఆఫ్ సర్రే , యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్ పరిశోధకులు మనం ఏ సమయంలో తింటామనేది మన శరీర బరువుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, వెయిట్ లాస్‌లో ఎక్కువ లాభం ఉంటుందని తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆరోగ్యకరమైన ఆహారం

బ్రేక్‌ఫాస్ట్ కేవలం బరువు మీదే కాదు, ఇంకా ఇతర వాటిపై కూడా ప్రభావం చూపుతోంది. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం 27 శాతం పెరుగుతుంది. పురుషులలో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 21 శాతం, మహిళలలో 20 శాతం ఎక్కువ అవుతోంది.

దీనికి ప్రధాన కారణం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉండే పోషకాహార విలువలే. బ్రేక్‌ఫాస్ట్‌లోని తృణధాన్యాలలో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. బ్రిటన్‌లో 1,600 మంది యువతీయువకులపై నిర్వహించిన ఒక పరిశోధనలో, క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారిలో పీచుపదార్థం, మైక్రోన్యూట్రియెంట్స్ గ్రహిణశక్తి ఎక్కువగా ఉందని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

బ్రేక్‌ఫాస్ట్ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందని.. ఏకాగ్రత, భాషా నైపుణ్యాలను పెంచుతుందని.. బ్రేక్‌ఫాస్ట్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని వెల్లడైంది.

అయితే బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ఏం తింటున్నామనేది కూడా ముఖ్యమే. హై ప్రొటీన్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఇంకా ఆహారం కావాలనే కోరిక తగ్గుతుంది.

అయితే బ్రిటన్, అమెరికాలలో నిర్వహించిన ఒక పరిశోధనలో పెద్దలు తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లోని తృణధాన్యాలలో ఫ్రీ షుగర్ మనం రోజుకు తీసుకోవాల్సిన దానికన్నా, ముప్పాతిక భాగం ఎక్కువగా ఉంటుందని తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

శరీరం చెప్పేది వినండి

చివరగా మనం ఖచ్చితంగా ఏం తినాలి, ఎప్పుడు తినాలనేదానిపై ఒక నిర్ణయానికి రాలేకున్నా, మనం శరీరం చెప్పేది వింటూ మనకు ఆకలైనప్పుడల్లా తింటూ ఉండాలి.

''నిద్ర లేవగానే ఆకలి అనిపించే వాళ్లు బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా అవసరం'' అని జాన్‌స్టోన్ తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ రోజును ఒక్కో రకంగా ప్రారంభిస్తారు. అందువల్ల వాళ్ల మధ్య తేడాలను, మరీ ప్రత్యేకించి గ్లూకోజ్ పని చేసే తీరును నిశితంగా పరిశీలించాలి.

చివరిగా ఏదో ఒక్క పూట ఆహారంపై దృష్టి పెట్టడం కాకుండా, మనం రోజంతా ఏం తింటున్నామో గమనించాలి.

''సమతుల బ్రేక్‌ఫాస్ట్ నిజంగా మంచిది. కానీ బ్లడ్ షుగర్‌ను తగిన స్థాయిలో ఉంచడానికి రోజంతా క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవడం ఇంకా ముఖ్యం. దీని వల్ల బరువును, ఆకలిని నియంత్రించుకోగలుగుతాం'' అని ఎల్డర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)