బాయ్ ఫ్రెండ్ కోసం భార్య గొంతునులిమి చంపిన భర్త

  • 7 డిసెంబర్ 2018
జెస్సికా Image copyright FAMILY PHOTO

బాయ్ ఫ్రెండ్‌తో కొత్త జీవితం గడపడానికి భార్యను గొంతునులిమి చంపిన భర్తకు ఇంగ్లండ్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

37 ఏళ్ల మితేష్ పటేష్ ఈ ఏడాది మే 14న ప్లాస్టిక్ బ్యాగుతో భార్య జెస్సికా ముఖంపై అదిమిపట్టి, ఊపిరాడకుండాచేసి చంపాడు. హత్య చేశాక, ఇంట్లో దోపిడీ జరిగినట్లు, దోపిడీ దొంగలే తన భార్యను చంపినట్లు కథ అల్లాడు.

భార్య మరణించాకవచ్చే 2 మిలియన్ పౌండ్ల జీవిత బీమా సొమ్ముతో ప్రియుడు డా.అమిత్ పటేల్‌తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిపోవాలని భావించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో కోర్టు.. మితేష్ పటేల్‌కు కనీసం 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

రోమన్ రోడ్‌లో మితేష్ పటేల్ తన భార్య జెస్సికాతో కలిసి, ఒక ఫార్మసీ షాపును నిర్వహిస్తున్నాడు.

తీర్పు వెల్లడిస్తున్న సమయంలో జడ్జి గ్రాస్ మాట్లాడుతూ.. 'నీ గురించి నీవు బాధపడటంతప్ప, నీవు చేసిన పని పట్ల నీకు పశ్చాత్తాపం లేదు' అన్నారు.

''9 ఏళ్ల వైవాహిక జీవితంలో నీ భార్య నిన్ను ప్రేమించింది. ఆమె నిబద్ధత కలిగిన ఇల్లాలు. పిల్లాపాపలతో ఆనందంగా జీవించాలని తప్ప, ఆమె ఇంకేమీ ఆశించలేదు. కానీ ఆమె పట్ల నీకు ఎలాంటి ఆకర్షణా లేదు. నువ్వు మగాళ్ల పట్ల ఆకర్షితుడివయ్యావు'' అని జడ్జి అన్నారు.

జెస్సికాకు కూడా తన భర్త గురించి కొంత తెలుసని, అందుకే ఆమె కొన్నిసార్లు ఒంటరిగా, నిరాశగా ఉండేదని అన్నారు.

Image copyright CLEVELAND POLICE

టెస్సెడ్ క్రౌన్ కోర్టులో రెండు వారాల పాటు ఈ కేసుపై విచారణ జరిగింది. మితేష్ పటేల్.. గ్రిండర్ డేటింగ్ యాప్ ద్వారా చాలా మంది పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడని తేలింది.

'ది అవెన్యూ'లోని తమ నివాసంలో భార్య జెస్సికాకు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి, ప్లాస్టిక్ బ్యాగుతో ఆమెకు ఊపిరాడకుండా ముఖంపై అదిమిపట్టి చంపానని పటేల్ అంగీకరించాడు.

తర్వాత ఆమె మృతదేహాన్ని డక్ట్ టేపుతో కట్టేసిన పటేల్, దోపిడి దొంగలు వచ్చి ఆమెను చంపినట్లు ఇల్లంతా చిందరవందర చేశాడు.

మృతురాలి బంధువులు కోర్టు తీర్పును స్వాగతించారు.

‘‘అతడికి జెస్సికా అంటే ఇష్టం లేనప్పుడు, ఆమెకు విడాకులు ఇచ్చుండొచ్చు లేదా, తనకు కావల్సినవన్నీ తీసుకుని వెళ్లుండొచ్చు. ఆమె ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు'' అని జెస్సికా సోదరి దివ్య కోర్టులో అన్నారు.

Image copyright CLEVELAND POLICE

జెస్సికా తనను ప్రేమించింది కాబట్టే ఆమెను పెళ్లి చేసుకున్నానని, ఆమె భార్యగా ఉంటే తన శృంగార ఆసక్తులను కప్పిపుచ్చుకోవచ్చని భావించినట్లు తన ప్రియుడు అమిత్ పటేల్‌తో చెప్పాడు.

డాక్టర్ పటేల్‌తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిపోవాలని మితేష్ భావించాడు. ఐవీఎఫ్ ద్వారా జెస్సికా గర్భం ధరించి, తాను ప్రసవించిన తర్వాత వీరిద్దరూ ఆ బిడ్డను పెంచుకోవాలనుకున్నారు.

జెస్సికా మూడుసార్లు ఐవీఎఫ్ కోర్స్ తీసుకుంది. చివరి సారి మూడు పిండాలను సృష్టించగలిగారు. కానీ వాటిని ఆమె గర్భంలోకి ప్రవేశ పెట్టేలోపు, తన భర్తే తనను చంపేశాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు