జర్మనీ: ఏంగెలా మెర్కెల్ సన్నిహితురాలు ఎనాగ్రెట్ క్రంప్‌కు అధికార సీడీయూ పగ్గాలు

  • 9 డిసెంబర్ 2018
ఎనాగ్రెట్ క్రంప్ Image copyright Reuters
చిత్రం శీర్షిక ఏంగెలా మెర్కెల్‌కు నచ్చిన ఆమె వారసురాలిగా క్రంప్ కరెన్‌బావర్‌ను భావిస్తున్నారు

జర్మనీలో అధికారంలో ఉన్న క్రిస్టియన్ డెమోక్రట్ యూనియన్ పార్టీ ఎనాగ్రెట్ క్రంప్ కరెన్‌బావర్‌ను తమ కొత్త నేతగా ఎన్నుకుంది.

క్రంప్, 18 ఏళ్లుగా పార్టీ చీఫ్, జర్మనీకి ప్రస్తుతం చాన్సలర్‌గా ఉన్న ఏంగెలా మెర్కెల్ స్థానం స్వీకరిస్తారు.

హామ్‌బర్గ్‌లో జరిగిన ఓటింగ్‌లో సీడీయూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎనాగ్రెట్ క్రంప్, కోటీశ్వరుడైన లాయర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌పై స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు.

ఏకేకే పేరుతో పాపులర్ అయిన ఎనాగ్రెట్‌కు మొత్తం 999లో 517 ఓట్లు దక్కాయి.

శుక్రవారం జరిగిన పార్టీ ప్రత్యేక సమావేశంలో 2021 వరకూ జర్మనీ చాన్సలర్‌గా ఉండబోయే ఏంగెలా మెర్కెల్ భావోద్వేగంతో ప్రసంగించారు.

ఎనాగ్రెట్ క్రంప్ కరెన్‌బావర్ ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పార్టీ చీఫ్ అయ్యారు. ఆమె జర్మనీకి తర్వాత చాన్సలర్ కూడా అయ్యే అవకాశం ఉంది.

సార్లాండ్ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధానమంత్రి ఎనాగ్రెట్ క్రంప్ "నేతృత్వం వహించడం అంటే ఏంటో నేను నేర్చుకున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా బయటి నుంచి చాలా బలంగా కనిపించడం కంటే లోపలి నుంచి ఎక్కువ బలంగా ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాను" అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక క్రంప్‌ చేతిలో ఓడిన ఫ్రెడ్రిక్ మెర్జ్(కుడివైపు)

ఏకేకే చేతిలో ఓడిన నేత ఎవరు?

క్రంప్ తన మొదటి ప్రసంగంలో ప్రత్యర్థి ఫ్రెడ్రిక్ మెర్జ్‌ను వేదికపైకి పిలిచి, ఆయన తనకు సహకరిస్తే చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు.

56 ఏళ్ల ఎనాగ్రెట్‌ను జర్మనీ చాన్సలర్ మెర్కెల్‌ ఎంపిక చేశారు. ఆమె తన వీడ్కోలు ప్రసంగంలో ఏకేకేపై ప్రశంసలు కురిపించారు.

క్రంప్ చేతిలో ఓడిపోయిన మెర్జ్ ఆమెకు అండగా ఉంటానని పార్టీ నేతలకు మాట ఇచ్చారు. "నేను గెలవాలనుకున్నాను, కానీ ఓడిపోవడం కూడా బాగుంది" అన్నారు.

482 ఓట్లు వచ్చిన లాయర్ మెర్జ్ 2000ల దశకం వరకూ పార్టీలోని బలమైన నేతల్లో ఒకరుగా ఉన్నారు. కానీ చాన్సలర్‌తో అభిప్రాయ భేదాలు వచ్చాక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

Image copyright Getty Images

ఏకేకే ఎవరు?

క్రంప్ సార్లాండ్‌లో ఏకేకే పేరుతో చాలా పాపులర్ అయ్యారు. తన రాజకీయ సామర్థ్యం, విశ్లేషణతో ఆమె ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎనాగ్రెట్ క్రంప్ కరెన్‌బావర్ 1991లో ఒక విద్యార్థి నేతగా సీడీయూ పార్టీలోకి వచ్చారు. మెల్లమెల్లగా మెర్కెల్ శిష్యురాలుగా, వారసురాలుగా ఎదిగారు. ఇప్పుడు ఆమె తరఫు అభ్యర్థిగా ఓటింగ్‌లో విజయం సాధించారు.

2000లో క్రంప్ దేశంలో మొట్ట మొదటి మహిళా అంతర్గత సురక్షా మంత్రి అయ్యారు. ఆమె సార్లండ్ తొలి మహిళా ప్రధానమంత్రి కూడా. ఆమె 2011 నుంచి 2018 వరకూ ఈ ప్రాంతానికి ప్రధానిగా ఉన్నారు.

మెర్కెల్‌కు క్రంప్ నమ్మకస్తురాలుగా భావిస్తున్నారు. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, ఏంగెలా విధానాలను ముందుకు తీసుకెళ్తారని చెబుతున్నారు.

అయితే క్రంప్ చాలాసార్లు మెర్కెల్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆమె రష్యా పట్ల కఠిన వైఖరితో ఉంటారు. కంపెనీల కార్పొరేట్ బోర్డులో మహిళలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

స్వలింగ సంపర్కుల వివాహాలు లాంటి సామాజిక అంశాలపై ఆమె సంప్రదాయవాదిగా ఉన్నారు. భద్రత, ప్రవాస అంశాల్లో దేశ విధానాలను సమీక్షిస్తున్నారు.

జనం ఏమంటున్నారు

ఏకేకేను మినీ మెర్కెల్ లేదా మెర్కెల్ 2.0 అని కూడా అంటున్నారు. ఆ రెండు ప్రశంసలు తనకు ఇష్టం అని క్రంప్ అంటున్నారు.

క్రంప్ విజయంపై జర్మనీలోని మిగతా రాజకీయ పార్టీలన్నీ ఆమెకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)