"కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉంటే, పిల్లల పెంపకంపై ప్రకటనలు చూపిస్తారా?" ఫేస్‌బుక్, ట్విటర్లను నిలదీసిన ఓ అమెరికా మహిళ

  • 16 డిసెంబర్ 2018
Facebook Image copyright Facebook

కడుపులోనే బిడ్డను పోగొట్టుకున్న తల్లికి పిల్లల పెంపకానికి సంబంధించిన వ్యాపార ప్రకటనలు చూపిస్తే ఎలా అనిపిస్తుంది? ''నేను గర్భవతినని లోగడ గుర్తించగలిగిన మీరు, తర్వాత కడుపులోనే నా బిడ్డ చనిపోయిందనే విషయాన్ని కూడా గ్రహించి ఉండాల్సింది'' అని ఫేస్‌బుక్, ఇతర టెక్ కంపెనీలను ఉద్దేశించి అమెరికా మహిళ ఒకరు అంటున్నారు. వ్యాపార ప్రకటనలకు వినియోగదారులను ఎంచుకొనే విధానాన్ని సమీక్షించుకోవాలని ఆమె కోరుతున్నారు.

వాషింగ్టన్ డీసీకి చెందిన జిలియన్ బ్రాకెల్ అనే ఈ మహిళ ఈ అంశంపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఎక్స్‌పీరియన్ సంస్థలకు లేఖ రాశారు.

వ్యాపార ప్రకటనల విషయంలో బ్రాకెల్‌కు ఎదురైన బాధాకర పరిస్థితే తమకూ ఎదురైందని ఇంటర్నెట్‌లో పలువురు యూజర్లు వాపోతున్నారు.

బ్రాకెల్ లేఖపై ఫేస్‌బుక్, ట్విటర్ స్పందించాయి. ఈ విషయంలో తాము ఇంకా మెరుగుపడాల్సి ఉందని అంగీకరించాయి.

Image copyright Getty Images

నా గుండె పగిలింది... ఇది మీరు గమనించలేదా?

తన బిడ్డ కడుపులోనే చనిపోయిందంటూ బ్రాకెల్ గత నెల్లో ట్విటర్‌కు మెసేజ్ పంపారు.

తన బిడ్డ మరణం నేపథ్యంలో ఆన్‌లైన్‌లో తన స్పందనను, తన తీరును గ్రహించి ఉండాల్సిందని ఆమె వ్యాఖ్యానించారు. కానీ, ఈ కంపెనీలు తాను తల్లిని కాబోతుండటానికి సంబంధించి గతంలో పెట్టిన పోస్టులు, ఇతరత్రా కార్యకలాపాలపైనే దృష్టి పెట్టాయని చెప్పారు.

''సోషల్ మీడియాను నేను చాలా తరచుగా వాడతాను. అలాంటి నేను వరుసగా మూడు రోజులు మౌనంగా ఉండటాన్ని మీరు గమనించలేదా? 'గుండె పగిలింది', 'సమస్య', 'మృతశిశువు' లాంటి ముఖ్యమైన మాటలు, వాటి కింద నా స్నేహితులు పెట్టిన 200 కన్నీటి ఎమోటికాన్లు మీకు కనిపించలేదా? నేను గర్భవతిని అయిన విషయాన్ని ట్రాక్ చేయగలిగిన మీరు, తర్వాత జరిగిన ఈ పరిణామాలను ట్రాక్ చేయలేకపోయారా'' అని ఆమె ప్రశ్నించారు.

గర్భం, పిల్లల పెంపకానికి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనపడకుండా చేసేందుకు తాను ప్రయత్నిస్తే, టెక్ కంపెనీలు దానిని తప్పుగా అర్థం చేసుకున్నాయని బ్రాకెల్ విచారం వ్యక్తంచేశారు.

''ప్రకటనను కనిపించకుండా చేసే సందర్భంలో, 'నేను ఈ ప్రకటనను చూడదలచ్చుకోలేదు' అని చెబితే, దానికి కారణం అడిగారు. 'ఇది నాకు సంబంధించినది కాదు' అని నేను సమాధానమిచ్చా. మనసుకు ఎంతో కష్టంగా అనిపించే సమాధానం ఇది. అయినా ఇచ్చాను. అప్పుడు మీ ఆల్గారిథం ఎలా అర్థం చేసుకుందో తెలుసా? నేను బిడ్డకు జన్మనిచ్చానని, అంతా బాగుందని అనుకుని, పాలిచ్చే తల్లులు వాడాల్సిన బ్రాల ప్రకటనలను నాకు ఇబ్బడిముబ్బడిగా చూపించింది. శిశువును నిద్ర పుచ్చడానికి అక్కరకొచ్చే చిట్కాలు చెప్పింది. పిల్లలను తీసుకెళ్లడానికి అవసరమయ్యే స్ట్రాలర్లు కూడా చూపించింది'' అని బ్రాకెల్ టెక్‌ సంస్థలకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తంచేశారు.

క్షమాపణ చెప్పిన ఫేస్‌బుక్

బ్రాకెల్ ఆవేదనపై ఫేస్‌బుక్ వ్యాపార ప్రకటనల విభాగ అధిపతి రాబ్ గోల్డ్‌మన్ స్పందిస్తూ- ఆమెకు క్షమాపణలు చెప్పారు.

తమకు బాధ కలిగించే అంశాలకు సంబంధించిన ప్రకటనలు తమ దృష్టికి రాకుండా అడ్డుకొనేందుకు యూజర్లకు వీలు కల్పించే వెసులుబాటు ఫేస్‌బుక్‌లో ఉందని, ఈ అంశాల జాబితాలో పేరెంటింగ్ కూడా ఉందని ఆయన వివరించారు.

ఈ విధానాన్ని తాము ఇంకా మెరుగుపరచాల్సి ఉందని, దీనిపై పని చేస్తున్నామని ఆయన చెప్పారు.

చిత్రం శీర్షిక ఫేస్‌బుక్‌లో తాము చూడొద్దనుకున్న ప్రకటనలను యూజర్లు అడ్డుకొనేందుకు ఉద్దేశించిన 'హైడ్ యాడ్ టాపిక్స్' సెటింగ్ పనితీరుపై బ్రాకెల్ ఆక్షేపణ వ్యక్తంచేశారు

అలా చేస్తే దత్తత ప్రకటనలు వచ్చాయి

స్పందించినందుకు గోల్డ్‌మన్‌కు బ్రాకెల్ కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో, ఆయన చెప్పిన పరిష్కారం సరైనది కాదన్నారు.

ఫేస్‌బుక్‌లో తాము చూడొద్దనుకున్న ప్రకటనలను యూజర్లు అడ్డుకొనేందుకు ఉద్దేశించిన 'హైడ్ యాడ్ టాపిక్స్' సెటింగ్ పనితీరును బ్రాకెల్ ఆక్షేపించారు.

గోల్డ్‌మన్ సూచన ప్రకారం కూడా చేశానని, అప్పుడు దత్తతకు సంబంధించిన ప్రకటనలు తనకు కనిపించాయని, కడుపులో బిడ్డ చనిపోవడంపై తానెంతో బాధలో ఉన్నప్పుడు అలాంటి ప్రకటనలు చూపించడం సముచితం కాదని ఆమె చెప్పారు.

ఫేస్‌బుక్‌లో ఇష్టంలేని ప్రకటనలను అడ్డుకొనే సెటింగ్ అన్నిసార్లూ కోరుకొన్న విధంగా పనిచేయడం లేదని ఇతర యూజర్లు కూడా తెలిపారు.

పిల్లలు, కుటుంబానికి సంబంధించిన ప్రకటనలు తనకు చూపించవద్దని చెప్పినా, పిల్లలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రకటనలు తనకు వస్తున్నాయంటూ గత నెల్లో ఓ బ్రిటన్ మహిళ ఫేస్‌బుక్‌కు బహిరంగ లేఖ రాశారు. ''నేనో బిడ్డను కోల్పోయాను. మీ ప్రకటనలు ఆ విషయాన్ని నాకు పదే పదే గుర్తుచేస్తున్నాయి'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఒక బగ్ వల్ల ఈ సమస్య ఏర్పడిందని, ఇప్పుడది పరిష్కారమైందని ఫేస్‌బుక్ బీబీసీతో చెప్పింది.

Image copyright Reuters

ట్విటర్ స్పందిస్తూ- బ్రాకెల్ లాంటి వారి బాధ ఇతరులు ఊహించలేనంతగా ఉంటుందని పేర్కొంది. అడ్వర్టైజింగ్ విధానాన్ని మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)