నీటి లోపల చూడగలరు, చలికి వణకరు, ఎత్తులంటే ఏమాత్రం భయపడరు... ఎవరు వాళ్లు? ఎక్కడుంటారు?

  • 18 డిసెంబర్ 2018
డైవర్ Image copyright iStock

అతీంద్రియ శక్తులున్న వాళ్లను సినిమాల్లో చూస్తుంటాం. కానీ, నిజ జీవితంలో కూడా కొందరిని చూస్తే, ఎవరికీ లేని శక్తులు వాళ్లకు మాత్రమే ఉన్నాయేమో అనిపిస్తుంది.

చలికి అందరూ వణుకుతుంటే కొందరు మాత్రం పల్చటి టీషర్టు వేసుకొని కూడా హాయిగా తిరిగేస్తారు. 12 గంటలు నిద్రపోయాక కూడా కొందరు బద్ధకంగా ముందుకు కదిలితే, ఇంకొందరు మాత్రం ఓ ఐదు గంటల నిద్రతో సరిపెట్టుకొని ఉత్సాహంగా పనిచేస్తుంటారు.

ఇలాంటి లక్షణాలను అందరూ కోరుకున్నా, చాలా కొద్దిమందికి మాత్రమే ఈ ప్రత్యేకతలుంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కొందరికే ఆ లక్షణాలు సంక్రమిస్తే, ఇంకొందరు తమ పరిసరాలకు అలవాటు పడటం ద్వారా ఆ సామర్థ్యాన్ని సాధించుకుంటారు.

అలా ప్రపంచంలో అతి కొద్దిమందికి మాత్రమే సాధ్యమైన ఐదు ప్రత్యేకతలివి.

Image copyright Alamy
చిత్రం శీర్షిక మాకెన్ జాతి పిల్లాడు

1. నీళ్లలోనూ చూస్తారు

చాలామంది నీళ్లలోకి ప్రవేశించగానే కళ్లు సరిగ్గా కనిపించవు. అన్నీ మసగ్గానే కనిపిస్తుంటాయి. కానీ, మాకెన్ జాతి పిల్లలకు మాత్రం ఆ సమస్య లేదు. వాళ్లు నీటి లోపల కూడా నేల మీద చూసినట్లే స్పష్టంగా చూడగలరు.

మయన్మార్, థాయిలాండ్‌లోని అండమాన్ తీర ప్రాంతంలో నివసించే మూడు తెగల కలయికతో ఏర్పడిన సమూహమే ఈ మాకెన్ జాతి.

వాళ్లను నీటి మనుషులుగానే పిలుస్తారు. వాళ్లు తమ జీవితంలో ఎక్కువ భాగం సముద్రం ఒడ్డున గుడిసెల్లో, సముద్రంపైన పడవల్లో గడిపేస్తారు.

అందుకే వాళ్ల కళ్లు కూడా నీటి లోపల చాలా స్పష్టంగా చూడటానికి అలవాటు పడిపోయాయి. శాస్త్రీయంగా కూడా ఈ విషయాన్ని నిరూపించారు. 2003లో కరెంట్ బయాలజీ మేగజీన్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం తిమింగలాల మాదిరిగా మాకెన్ తెగ పిల్లలకు కూడా నీటి లోపల స్పష్టంగా చూడగలిగే శక్తి ఉంది.

ఆ అధ్యయనం ప్రకారం ఒడ్డున ఉంటూ చేపలు పట్టే మాకెన్ తెగ వాళ్లలో ఈ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుందని, నిత్యం పడవలపై ప్రయాణించే వాళ్లలోనే ఈ లక్షణం ఎక్కువగా ఉంటుందని తేలింది.

Image copyright Getty Images

2. గడ్డకట్టే చలినీ తట్టుకుంటారు

మనిషి శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 36.5 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీ మధ్య ఉంటుంది. అందుకే మనుషులు చలి కంటే వెచ్చటి వాతావరణానికే సులువుగా అలవాటు పడతారు. కానీ, సాధారణ మనుషులకు భిన్నంగా ఆర్కిటిక్ పరిధిలో నివసించే ‘ఇన్యూట్స్’, ఉత్తర రష్యాలో ఉండే నెనెట్స్ మాత్రం గడ్డకట్టే చలిలో జీవించడానికే అలవాటు పడిపోయారు.

వాళ్ల శరీర నిర్మాణం ఇతరులకంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే చలికి వాళ్ల శరీరం స్పందించే తీరు కూడా భిన్నంగా ఉంటుంది.

వాళ్ల చర్మం ఇతరులకంటే వేడిగా ఉంటుంది. వారి జీవక్రియల వేగం కూడా ఎక్కువ. వారి శరీరంలో స్వేద గ్రంథులు తక్కువగా ఉంటాయి. చలికి వాళ్లు వణకరు. ఇవి ఇన్యుట్స్, నేనట్ ప్రజలకు పూర్తిగా జన్యుపరంగా సంక్రమించిన లక్షణాలు. బయటివాళ్లు అక్కడికి వెళ్లి ఎన్నేళ్లు జీవించినా, ఆ సామర్థ్యం వారికి రాదు.

Image copyright iStock

3. నిద్ర తక్కువైనా ఫర్వాలేదు

చాలామంది ఓ గంట నిద్ర తక్కువైనా రోజంతా కునుకుపాట్లు పడుతుంటారు. కానీ, కొందరు ఐదారు గంటలు నిద్రపోయినా చాలు, రోజంతా ఉత్సాహంగా గడిపేస్తారు. జన్యువుల్లో మార్పు కారణంగా ఆ లక్షణం సంభవించే అవకాశం ఉందని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసెన్ గుర్తించింది.

డీఈసీ2 అనే పరివర్తన చెందిన జన్యువు ఉన్న వాళ్లకు నిద్ర తక్కువైనా దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అదే సాధారణంగా నిద్ర తక్కువైతే అనేక రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది.

అయితే, ఈ జన్యువు అందరిలోనూ కనిపించదు. తాము 6 గంటల కంటే తక్కువ సేపే నిద్రపోతామని చెప్పేవాళ్లలో కేవలం 1 శాతం మందిలో మాత్రమే ఈ జన్యువు కనిపించే అవకాశాలున్నాయి. మిగతావారిలో అప్పటికప్పుడు ఎలాంటి సమస్యలు కనిపించకపోయినా, దీర్ఘకాలంలో అది అనారోగ్యానికి దారితీయొచ్చు.

Image copyright iStock

4. బలమైన ఎముకలు

వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంధ్రత తగ్గిపోతుంటుంది. కొందరిలో ఇది మరింత వేగంగా తగ్గుతుంది. దానివల్ల ఆస్టియోపోరోసిస్‌తో పాటు ఫ్రాక్చర్ల బారినపడే ప్రమాదమూ ఉంటుంది.

కానీ, కొందరిలో దీనికి పూర్తి వ్యతిరేక పరిస్థితి కనిపిస్తుంది. దాని పేరు స్క్లెరాస్టియాసిస్. ఈ సమస్య ఉన్నవాళ్లలో జీవితాంతం ఎముకల సాంద్రత పెరుగుతూనే ఉంటుంది.

ఎస్‌ఓఎస్‌టీ జన్యువు కారణంగా స్క్లెరాస్టిన్‌ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది ఎక్కువగా ఉత్పత్తి అయితే స్క్లెరాస్టియాసిస్‌కు దారితీస్తుంది. ఆ సమస్య ఉన్నవారిని అధ్యయనం చేయడం ద్వారా ఆస్టియోపోరోసిస్‌కు పరిష్కారం కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.

ఎముకల సాంద్రత అలా పెరుగుతూనే ఉంటే అది భారీకాయానికి, చెముడుకు, వికృత రూపానికి దారితీయొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎముకలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా గట్టిపడతాయి. ఆఫ్రికేనర్ జాతి ప్రజల్లో ఈ లక్షణం కనిపిస్తుంది.

Image copyright Getty Images

5. ఎత్తుల్లో జీవించే శక్తి

బాగా ఎత్తయిన ప్రదేశాల్లో ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో కాసేపు గడపడమే కష్టం. అలాంటిది ఆండియన్ జాతి ప్రజలు సముద్ర మట్టానికి 5వేల అడుగుల ఎత్తులో హాయిగా జీవించగలరు.

సముద్ర మట్టం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంటుంది. దానివల్ల తలనొప్పి, రక్త పోటు పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సమస్యలు కనిపిస్తుంటాయి. కానీ ఆండియన్ జాతి ప్రజలకు ఈ ఇబ్బందులు ఉండవు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే కొన్ని తెగల ప్రజలు సహజంగానే ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయారు.

ఇతరులకంటే వారి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వాళ్లు శ్వాస తీసుకున్న ప్రతిసారీ ఎక్కువ ఆక్సిజన్ శరీరానికి అందుతుంది. ఆక్సిజన్ తక్కువగా అందితే, సాధారణ వ్యక్తుల్లో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. కానీ ఈ ఆండియన్ ప్రజల్లో మాత్రం వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది.

వేల ఏళ్లుగా వాళ్లలో పెరుగుతూ వచ్చిన లక్షణాలివి. అందుకే, వాళ్లు పర్వతాల నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నా కూడా వాళ్లలో ఆ సామర్థ్యం తగ్గలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు