ఈజిప్ట్ సమాధిలో హిందూ దేవతల విగ్రహాలు దొరికాయా - BBC Fact Check

  • 20 డిసెంబర్ 2018
శిల్పాలు Image copyright Reuters

4,400 సంవత్సరాలుగా ప్రపంచానికి తెలియని ఓ అరుదైన భారీ సమాధిని ఈజిప్టులో పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, అక్కడ హిందూ దేవుళ్లు, దేవతలకు చెందిన విగ్రహాలు బయట పడ్డాయంటూ ఓ ఫొటోను హిందూవాద సోషల్ మీడియా పేజీలు కొన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

ఆ ఫొటోతో పాటు ‘ముస్లిం దేశమైన ఈజిప్టులోని ఓ సమాధిలో హిందూ దేవాలయం బయటపడింది’ అనే సందేశాన్నీ పంచుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ అలాంటి తవ్వకాలు జరిపినా హిందూ దేవతల విగ్రహాలు బయటపడతాయని, ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హిందూమతం విస్తరించి ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని కూడా ఆ పోస్టును పెట్టిన వారు అంటున్నారు.

ఆ ఫొటో చూడ్డానికి నిజంగా తవ్వకాలు జరిపిన ప్రాంతానికి చెందిన దానిలానే ఉంది. అక్కడో మనిషి కూర్చొని ఉన్నాడు. వెనక ఏవో విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి.

Image copyright SOCIAL MEDIA/VIRAL POST
చిత్రం శీర్షిక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ పద్ధతిలో వెతికితే ఆ ఫొటో నిజమైనదే అని అర్థమవుతోంది. కానీ, ఆ ఫొటోలో ప్రస్తావించిన విషయం మాత్రం పూర్తిగా కల్పితం. ఓ నకిలీ వార్తను ప్రచారం చేసేందుకు ఆ ఫొటోతో పాటు విగ్రహాలకు సంబంధించిన సందేశాన్నీ రాస్తున్నారు. ఆ ఫొటోలో చూపించిన ప్రాంతం నిజంగానే ఈజిప్ట్‌లో తవ్వకాలు జరిగిన ప్రాంతానిదేనని మా పరిశోదనలో తేలింది.

కానీ, అక్కడ హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలు బయటపడ్డాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు. క్రీస్తు పూర్వం 2,500-2,350 మధ్య ఈజిప్ట్‌ను పాలించిన ఐదో సామ్రాజ్యానికి చెందిన కళాకృతులు అక్కడ కనిపించాయి.

Image copyright Getty Images

ఆ సమాధి ప్రత్యేకత ఏంటి?

ఈజిప్ట్‌లోని పురాతత్వ శాస్త్రవేత్తలు గత వారం ఓ అరుదైన సమాధిని తమ తవ్వకాల్లో గుర్తించారు. గత 4,400 ఏళ్లలో మనిషి కంటపడని భారీ సమాధి అది.

‘గత దశాబ్దకాలంలో బయటపడ్డ అత్యద్భుత నిర్మాణం అదే’ అని ఈజిప్ట్‌కు చెందిన సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ కార్యదర్శి మొస్తఫా వజీరీ అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆయనే.

Image copyright Reuters
చిత్రం శీర్షిక 4400 ఏళ్లు గడిచినా ఆ సమాధి ఇప్పటికీ చెక్కు చెదరలేదు

కైరోకి దగ్గర్లోని సఖారా పిరమిడ్ల సముదాయంలో ఆ సమాధి బయటపడింది. అందులో రంగురంగుల చిత్ర లిపితో పాటు ఫరావోల విగ్రహాలు కనిపించాయి. (ఫరావోలను సగం మనిషి, సగం దేవుడిగా ఈజిప్ట్ వాసులు నమ్మేవారు. వాళ్లు దేవాలయాలకు పెద్దలుగా (హై ప్రీస్ట్) ఉండేవారు)

Image copyright Reuters

ఆ సమాధి విశేషాలను బీబీసీ, సీఎన్‌ఎన్ లాంటి అన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించాయి. భారత్‌లో నకిలీ వార్త ప్రచారం కోసం ఉపయోగించిన ఫొటోను అనేక మీడియా సంస్థలు ఉపయోగించాయి.

Image copyright Reuters
చిత్రం శీర్షిక సమాధిని ఇన్నేళ్లలో దొంగలు కూడా గుర్తించలేకపోయారు

ఓ పర్వత శ్రేణి అంచులో ఈ సమాధి కనిపించింది. అందుకే ఇది దొంగల కంట పడలేదని భావిస్తున్నారు. సమాధుల్లో ఎక్కువగా పరావోల విగ్రహాలు కనిపించడాన్ని చూస్తే, ఈజిప్ట్‌లో గతంలో వారికి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో తెలుస్తోంది.

గతంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి ఆందోళన జరిగినప్పుడు కూడా కొన్ని నకిలీ ఫొటోలను హిందూ అతివాత పేజీలు ప్రచారం చేశాయి. ఆ ఫొటోకు సంబంధించిన వివరాలను కూడా బీబీసీ ప్రచురించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి