ఇస్లామిక్ స్టేట్ కనుమరుగైపోయిందా?... సిరియా యుద్ధంలో ఐఎస్ ఓడిపోయిందన్న డోనల్డ్ ట్రంప్ మాట నిజమేనా?

  • 20 డిసెంబర్ 2018
అమెరికా బలగాలు Image copyright AFP
చిత్రం శీర్షిక దాదాపు 2,000 మంది అమెరికా సైనికులు సిరియాలో పోరాడారు

సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ సంస్థ ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు. కొన్నేళ్లుగా ఐఎస్‌ను అణచివేసేందుకు సిరియాలో మోహరించిన తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. మరి, నిజంగానే ఐఎస్ ఓడిపోయిందా?

ఐఎస్‌పై చరిత్రాత్మక విజయం సాధించామని, తమ బలగాలను వెనక్కి రప్పిస్తున్నామని ట్రంప్ ప్రకటించడంపై మిత్రదేశాలతో పాటు, తన సొంత పార్టీకి చెందిన సీనియర్ సెనేటర్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ మద్దతుదారుల్లో ఒకరైన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమే ఆయన ప్రకటనతో ఏకీభవించడంలేదు. అమెరికా రక్షణ సేవల కమిటీలో సభ్యుడిగా ఉన్న గ్రాహం.. "ఒబామా హయాంలో జరిగిన పెద్ద తప్పిదం లాంటిదే ఇది కూడా" అని వ్యాఖ్యానించారు.

"ఐఎస్ ఇంకా ఓడిపోలేదు. అమెరికా బలగాలను ఇప్పుడు వెనక్కి రప్పిస్తే మన మద్దతుదారులైన కర్దులు ప్రమాదంలో పడతారు" అని ఆయన ట్వీటర్‌లో అన్నారు.

సిరియాతో పాటు, దాని వెలుపల కూడా తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదముందని గ్రాహం ఆందోళన వ్యక్తం చేశారు.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర సిరియాలోని కొబానే పట్టణంలో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు (2014 అక్టోబరు)

ఈశాన్య సిరియాలో ఐఎస్‌‌తో పోరాడేందుకు దాదాపు 2,000 మంది అమెరికా సైనికులు అక్కడికి వెళ్ళారు.

అయితే, ఐఎస్ ఓడిపోయిందని అమెరికా చెబుతున్నా, ఇప్పటికీ కొన్నిచోట్ల ఐఎస్‌ మిలిటెంట్లు ఉన్నారు. ముఖ్యంగా, ఇరాక్ సరిహద్దున ఉన్న ఆగ్నేయ సిరియాలో ఐఎస్‌కు కొంతమేర పట్టుంది.

అది మళ్లీ పుంజుకోకుండా ఉండాలంటే సిరియాలో తమ బలగాలు కొనసాగాల్సిందేనని అమెరికా రక్షణ అధికారులు భావించారు. అమెరికా బలగాలు వెనక్కి వెళ్తే సిరియాపై రష్యా, ఇరాన్ పట్టు బిగించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుందన్న ఆందోళన కూడా ఉంది.

అయితే, "ఈ యుద్ధంలో తదుపరి దశ కోసమే బలగాలను వెనక్కి రప్పిస్తున్నాం" అని అమెరికా రక్షణ విభాగం (పెంటగాన్), ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రకటించాయి. కానీ, ఆ తదుపరి దశ ఏమిటన్నది మాత్రం వెల్లడించలేదు.

మరోవైపు, ఐఎస్‌ అంతమయ్యేదాకా తమ అంతర్జాతీయ ఉమ్మడి పోరు కొనసాగుతుందని బ్రిటన్ ప్రకటించింది. తాజా పరిణామాలతో తమ ఉమ్మడి కార్యాచరణకు ముగింపు పడుతుందని అనుకోవద్దని వ్యాఖ్యానించింది. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని పేర్కొంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐఎస్‌ తీవ్రవాదులు, ఇరాక్ బలగాల మధ్య పోరులో ధ్వంసమైన రఖా నగరం

వేలాది మంది మిలిటెంట్లు ఇంకా ఉన్నారు

ఇప్పటిదాకా, ఉత్తర సిరియాలోని కర్దిష్ ప్రాంతంలో అమెరికా బలగాలు ఎక్కువగా పనిచేశాయి.

ఇక్కడ ఐఎస్‌పై పోరులో 'సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్' పేరున్న సిరియన్ కర్దిష్, అరబ్ ఫైటర్స్‌ గ్రూపులు పోషించిన పాత్ర ఎంతో కీలకం. ఈ గ్రూపులు ఇన్నాళ్లూ అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలకు మద్దతుగా నిలిచాయి. దాంతో, ఉత్తర సిరియాలో చాలావరకు ఐఎస్ అణచివేయగలిదారు.

అయితే, ఈ దేశంలో ఐఎస్ మిలిటెంట్లు బాగా బలహీనపడిన మాట వాస్తవమే. కానీ, పూర్తిగా కనుమరుగు కాలేదు. ఇక్కడ ప్రస్తుతం 14,000 మందికి పైగా ఐఎస్ మిలిటెంట్లు ఉన్నారు. పొరుగు దేశం ఇరాక్‌లో 17,100 మంది ఉన్నట్లు ఇటీవల అమెరికా వెల్లడించిన నివేదికలే చెబుతున్నాయి.

అలాగే, ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం, లిబియాలో 3,000 నుంచి 4,000 మంది, అఫ్ఘానిస్థాన్‌లో సుమారు 4,000 మంది ఐఎస్ మిలిటెంట్లు ఉన్నారు.

వాళ్లు మళ్లీ తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు గెరిల్లా తరహా వ్యూహాలు పన్నే ప్రమాదం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి.

చిత్రం శీర్షిక సిరియాలో ఎవరికి ఎక్కడ పట్టుందో చూపే పటం

అమెరికా మిత్రులు.. టర్కీకి శత్రువులు

ఐఎస్‌పై పోరాటంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలకు అండగా నిలిచిన కర్దిష్ మిలీషియా గ్రూపుపై టర్కీ గుర్రుగా ఉంది. టర్కీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న ఆ కర్దిష్ గ్రూపుపై నిషేధం ఉంది.

ఆ గ్రూపును అణచివేసేందుకు దాడులు ప్రారంభించేందుకు టర్కీ సిద్ధమవుతోంది. త్వరలోనే మిలిటరీ ఆపరేషన్ మొదలు పెట్టనున్నట్లు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సోమవారం ప్రకటించారు.

ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తోనూ ఫోన్‌లో చర్చించానని, అందుకు ఆయన 'సానుకూలంగానే' స్పందించారని కూడా ఎర్డొగాన్ తెలిపారు.

అదే జరిగితే ఉత్తర సిరియాలో మళ్లీ ఆందోళనకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.

మరోవైపు, టర్కీకి 3.5 బిలియన్ డాలర్ల విలువైన క్షిపణులను విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా మంగళవారం ప్రకటించింది. దాంతో టర్కీ రక్షణ సామర్థ్యం మరింత పెరుగుతుందని తెలిపింది.

అలాగే, టర్కీకి రక్షణపరమైన అమ్మకాలు కొనసాగుతాయని రష్యా కూడా బుధవారం ప్రకటించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఎనిమిదేళ్ల సిరియా యుద్ధం... ఎడతెగని విషాదం

లక్షల మంది మృతి

సిరియా నేలపై అంతర్యుద్ధం మొదలై ఏడేళ్లు దాటింది. అప్పటి నుంచి నిత్యం నెత్తురు చిందుతూనే ఉంది. పెద్దయెత్తున విధ్వంసం జరిగింది.

సిరియాలో ఐఎస్‌పై పోరులో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న అధికారిక లెక్కలు లేవు.

కానీ, బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ఓ మానవహక్కుల సంస్థ అంచనా ప్రకారం, 2011 నుంచి 2018 ఫిబ్రవరి చివరి నాటికి సిరియా అంతర్యుద్ధంలో 1,10,687 మంది సామాన్య పౌరులు సహా 3,64,792 మంది ప్రాణాలు కోల్పోయారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఐఎస్‌పై పోరు - సర్వం కోల్పోయిన ఓ సామాన్యుడి గాథ

2014 నుంచి 2018 నవంబర్ వరకు జరిగిన ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనల్లో 30,839 మంది పౌరులు చనిపోయారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇరాక్ చెందిన శాంతి పరిరక్షణ సంస్థ మాత్రం ఆ సంఖ్య 70 వేలకు పైనే ఉంటుందని అంచనా వేసింది.

ఈ అంతర్యుద్ధం కారణంగా సిరియా నుంచి లక్షల మంది ప్రజలు విదేశాలకు శరణార్థులుగా వెళ్లారు. 66 లక్షల మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సిరియాలోనే సొంతూళ్లను వదిలి వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. మరో 56 లక్షల మంది విదేశాలకు పారిపోయారు. అందులో దాదాపు 35 లక్షల మంది టర్కీలో ఆశ్రయం పొందుతున్నారు. మరో 10 లక్షల మంది లెబనాన్‌కు, 7 లక్షల మంది జోర్డాన్‌‌కు వెళ్లారు. ఇరాక్‌కు 2,49,123 మంది, ఈజిప్టుకు 1,30,300 మంది చేరుకున్నారు. యూరప్, ఆఫ్రికా దేశాలకు కూడా వేలాది మంది వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)