సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసు: అమిత్ షా సహా నిందితులంతా నిర్దోషులు ఎలా అయ్యారు

అమిత్ షా

సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 22 మంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది.

సీబీఐ కోర్టు ప్రకారం పోలీసులపై ఆరోపణలు నిరూపితం కాలేదు. వారిపై ఒత్తిడి చేసి సాక్ష్యం ఇప్పించలేమని ప్రత్యేక న్యాయమూర్తి జేఎస్ శర్మ అభిప్రాయపడ్డారు.

‘‘చనిపోయిన ముగ్గురి కుటుంబాల పట్ల నాకు జాలి కలుగుతోంది. కానీ, నేను చేయగలిగింది ఏమీ లేదు. తన ముందుకు తీసుకువచ్చిన ఆధారాలను బట్టే న్యాయస్థానం పనిచేస్తుంది. దురదృష్టవశాత్తూ (ఈ కేసులో) ఆధారాలు లేవు’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

2005లో అహ్మదాబాద్‌లో జరిగిన గుజరాత్, రాజస్థాన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ జరిగింది. 2006లో సోహ్రాబుద్దీన్‌తో ఉంటున్న తులసి ప్రజాపతి కూడా ఎన్‌కౌంటర్‌కు గురైనప్పుడు ఈ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.

ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది, అంతకు ముందు దీనిని గుజరాత్ సీఐడీ, 2010లో సీబీఐ దర్యాప్తు జరిపాయి.

నాటకీయ పరిణామాలు

2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయినప్పుడు ఈ కేసు నాటకీయ మలుపు తీసుకుంది. ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టు ముంబయి సీబీఐ కోర్టును ఆదేశించింది.

విచారణ ప్రారంభం కాకముందే ముంబయి సీబీఐ కోర్టు అమిత్ షాతో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న చాలా మంది సీనియర్ పోలీసు అధికారులు నిర్దోషులని చెప్పింది.

ముంబయి కోర్టులో విచారణకు ముందే వదిలేసిన 16 మంది నిందితులలో రాజకీయ నేతలు, బ్యాంకర్లు, వ్యాపారులు, చాలామంది అధికారులు ఉన్నారు.

ఇప్పుడు కేవలం పోలీస్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ మాత్రమే ఈ కేసును ఎదుర్కుంటున్నారు. సీబీఐ కోర్టు శుక్రవారం (21.12.2018) ఈ కేసులో మిగిలిన నిందితులందరినీ నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images

అమిత్ షా ప్రస్తావన

ఈ కేసులో 2010లో సీబీఐ ప్రవేశించింది. తర్వాత ఈ కేసులో రాష్ట్ర నేతల పేర్లు నిందితులుగా బయటకు వచ్చాయి.

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న గుజరాత్ సీఐడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వీఎల్ సోలంకి సీబీఐకి ఇచ్చిన తన వాంగ్మూలంలో అప్పటి హోంమంత్రి అమిత్ షా పేరు చెప్పారు. ఎన్‌కౌంటర్ దర్యాప్తు ఆపివేయించాలని అమిత్ షా కోరుకున్నారని సోలంకి చెప్పారు.

ఫొటో సోర్స్, BHAREDRESH GUJJAR

ఎన్‌కౌంటర్, హత్యలు ఎలా జరిగాయి?

సోహ్రాబుద్దీన్ షేక్ హత్యకు ముందే ప్లాన్ చేశారు. రాజస్థాన్, గుజరాత్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ పేరుతో ఆ హత్యకు ఒక ముగింపు ఇచ్చారు. దానిని ఎన్‌కౌంటర్ అని చెప్పారు.

ఆ తర్వాత ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న సోహ్రాబుద్దీన్ అనుచరుడు తులసి ప్రజాపతి సీబీఐకి తన వాంగ్మూలం ఇచ్చేవారు. అంతకు ముందే ఆయన్ను కూడా అంబాజీ దగ్గర ఎన్‌కౌంటర్ చేశారు.

ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా సోబ్రాబుద్దీన్ భార్య కౌసర్ బీని కూడా తర్వాత హత్య చేశారు.

ఆమెను గుజరాత్ ఐపీఎస్ అధికారి డీజీ వంజారాకు చెందిన ఇలోల్‌ గ్రామంలో హత్య చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

2014 తర్వాత మారిన చిత్రం

2014లో కేంద్రంలో అధికారం మారింది. ఒకప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి అయ్యారు. తర్వాత చిత్రం మారిపోయింది.

సరైన ఆధారాలు లేవని అమిత్ షా, గులాబ్ చంద్ కటారియా, మార్బల్ కింగ్ విమల్ పట్నీ, అహ్మదాబాద్ జిల్లా బ్యాంక్ చైర్మన్ అజయ్ పటేల్, డైరెక్టర్ యశ్‌పాల్ చుదాసమాలు నిర్దోషులని ముంబయి హైకోర్టు తీర్పు ఇచ్చింది.

తాజాగా ఈ కేసులో మిగిలిన 22 మంది నిందితులు కూడా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం (21.12.2018) తీర్పు ఇచ్చింది.

అయితే ఈ కేసు తమకు ఎన్‌కౌంటర్ జరిగిన ఐదేళ్ల తరువాత అప్పగించారని, అప్పటికే అందులో చాలా లొసుగులున్నాయని సీబీఐ తరఫు న్యాయవాది బీపీ రాజు అన్నారు. ఐదేళ్ల తరువాత సీబీఐ రంగంలోకి దిగితే, 12 ఏళ్ల తరువాత సాక్షుల, సాక్ష్యాల పరిశీలన మొదలైందని, అందుకే విచారణలో కొన్ని 'ఖాళీలు’ కనిపిస్తున్నాయని ఆయన కోర్టుకు చెప్పారు.

కొందరు ముఖ్య సాక్షులు కూడా కేసు విచారణ సమయంలో తమకు వ్యతిరేకంగా మారారని, దాని వల్ల సీబీఐ విచారణలో అవరోధాలు ఏర్పడ్డాయని రాజు అన్నారు. ఆయన మాటలకు న్యాయమూర్తి స్పందిస్తూ, ‘నేను సీబీఐని నిందించను. సీఐడీని నిందించను. ఇక్కడ వాంగ్మూలాలు, సాక్ష్యాలు ఉన్నాయి. సాక్షులు ఇక్కడికి వచ్చి ఏమీ చెప్పకపోతే అది మీ తప్పు కాదు. మీరు మీ పని చేశారు’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)