జీసస్ గురించి ఖురాన్ ఏం చెబుతోంది?

  • ఎమ్రే అజీజ్‌లేర్లీ
  • బీబీసీ వరల్డ్ సర్వీస్
A Muslim points out where Jesus is mentioned in the Koran

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఖురాన్‌లో ఏసు ప్రస్తావనను చూపిస్తున్న ఒక ముస్లిం

"మీరు టర్కీలో క్రిస్మస్ వేడుకలు ఎలా చేసుకుంటారు"?

"నేను 21 ఏళ్ల క్రితం క్రిస్మస్ సీజన్లో బ్రిటన్ వచ్చినప్పటి నుంచి, నన్ను ప్రతిసారీ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు".

"నేనొకటే చెబుతా, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశం టర్కీ. అందుకే డిసెంబర్ 25ను అక్కడ అందరూ క్యాలెండర్లోని మిగతా రోజుల్లాగే చూస్తారు".

ఏంటీ, క్రిస్మస్ చేసుకోరా?

టర్కీలో మాత్రమే కాదు, ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ప్రజలు క్రిస్మస్ సంబరాలు చేసుకోరు.

ప్రపంచమంతా క్రిస్మస్ రోజున సెలవు ఉంటుందని, ఆ రోజున సంబరాలు చేసుకుంటారని పాశ్చాత్య దేశాల్లో కొందరు ఊహిస్తారనేది తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కానీ క్రిస్మస్ అంటే క్రైస్తవ మత బోధకుడు ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా చేసుకునే వేడుకలు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

క్రిస్మస్ వేడుకల ధగధగలు

యూదులు, హిందూ, ముస్లిం క్యాలెండర్లో క్రిస్మస్ రోజు సెలవు ఉండదు.

మరో మాటలో చెప్పాలంటే, ఇస్లాం ప్రపంచంలో ఉన్న చాలా కుటుంబాలు తమ మధ్య వివాదాలు దూరం చేసుకోడానికి పండుగల్లో కలుసుకుంటారు.

కానీ అది క్రిస్మస్ రోజు కాదు, ఈద్ సందర్భంగా. తమ మధ్య వివాదాలు పరిష్కరించుకోవడమే వారికి ప్రధానం.

కానీ మనల్ని కలిపే కొన్ని బంధాల గురించి కూడా మనం తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తల్లి మేరీతో బాల ఏసు

ఏసు అంటే ఇసానేనా?

అసలు మనకు ఆశ్చర్యంగా అనిపించేది ఇదే.

ఇస్లాంలో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు జరగవు. కానీ అది ఏసును స్తుతిస్తుంది.

తమ విశ్వాసాలలో ఒక భాగంగా ముస్లింలు క్రైస్తవ మతబోధకుడైన ఏసుక్రీస్తుకు చాలా గౌరవం ఇస్తారు.

మహమ్మద్ ప్రవక్త కంటే ముందున్న ప్రముఖుల్లో ఏసుక్రీస్తు కూడా ఒకరని ఖురాన్ చెబుతుంది.

నిజానికి జీసస్ లేదా అరబిక్‌లో ఇసాను ఈ గ్రంథంలో మహమ్మద్ ప్రవక్త కంటే ఎక్కువగా ఎన్నోసార్లు ప్రస్తావించారు.

ఆయన పేరుతోపాటు ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌లో ఒకే ఒక మహిళను ఆమె పేరుతో ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Unknown

ఫొటో క్యాప్షన్,

ఖురాన్‌లో వర్ణించిన మరియం కథ

మేరీ, అంటే మరియమా?

ఆ మహిళ మేరీ లేదా అరబిక్‌లో మరియమ్. ఆమె పేరున పూర్తిగా ఒక అధ్యాయమే ఉంది. కన్య అయిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన కథను చెబుతుంది.

కానీ ఖురాన్‌లో జోసెఫ్ గానీ, జ్ఞానులుగానీ, పశువులు గడ్డి తిన్న తొట్టె ప్రస్తావనగానీ లేదు.

ఒంటరిగా ఉన్న మరియం ఒక ఎడారిలో బిడ్డకు జన్మనిస్తుంది. ఆమెకు అప్పుడు ఒక ఎండిపోయిన ఖర్జూరం చెట్టు నీడను ఇస్తుంది.

ఆశ్చర్యంగా, ఆ చెట్టు నుంచి పడిన ఖర్జూరాలు ఆమె ఆకలిని తీరుస్తాయి, ఆమె పాదాల దగ్గర ఒక కాలువ కనిపించి దాహం తీరుస్తుంది.

ఒక పెళ్లికాని యువతి దగ్గర అప్పుడే పుట్టిన శిశువు ఉండడం వల్ల ఆమె పవిత్రతపైనే ప్రశ్నలు తలెత్తుతాయి.

కానీ నవజాత శిశువు ఏసుక్రీస్తు దేవుని ప్రవక్తగా మాట్లాడ్డం ప్రారంభిస్తారు. ఆ అద్భుతం అతడి తల్లిని పునీతం చేస్తుంది.

దురభిప్రాయంపై విజయమే ఈ కథ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇటలీలోని శాన్ పెట్రోనియో బసిలికా చర్చిపై దాడికి కుట్ర చేశారనే అనుమానంతో ఐదుగురిని అరెస్ట్ చేశారు

ఆత్మ ప్రవక్త

ముస్లింలు ఏసు గురించి ప్రస్తావించినపుడు మహమ్మద్ ప్రవక్త లాగే "ఆయనకు కూడా శాంతి కలుగుగాక" అంటారని భావిస్తారు.

ముస్లిం విశ్వాసాల ప్రకారం తుది తీర్పు రోజుకు ముందు న్యాయాన్ని పునరుద్ధరించడానికి భూమికి ఎవరు తిరిగి వస్తారని చెప్పారో ఊహించగలరా.

అది ఏసుక్రీస్తే. అదే 'రెండవ రాకడ', దాని గురించి ముస్లిం సాహిత్యంలో ఖురాన్‌ కంటే ఎక్కువ చెప్పారు.

సూఫీ తత్వవేత్త అల్-ఘజలీ ఏసును 'ఆత్మ ప్రవక్త'గా వర్ణించారు.

ఇబిన్ అరబి ఆయన గురించి సీల్ ఆఫ్ సెయింట్స్ అని రాశారు.

ఫొటో సోర్స్, Getty Images

మధ్యప్రాచ్యంలో క్రైస్తవం

ఇప్పుడు ఇస్లాం ప్రపంచం అంతటా 'ఇసా'(ఏసుక్రీస్తు) అనే పేరున్న అబ్బాయిలు, మేరీలాగే 'మరియమ్' అనే పేరున్న అమ్మాయిలు ఎంతోమంది కనిపిస్తారు.

క్రైస్తవ నేపథ్యం ఉన్న ఒక కుటుంబం తమ కొడుకును మహమ్మద్ అనే పేరుతో పిలుచుకుంటుందని మీరు ఊహించగలరా?

ఇస్లాం మతంలో ఏసు సుపరిచితుడే. ఎందుకంటే అది ఒక మతంగా ఆవిర్భవించే సమయానికి అంటే 7వ శతాబ్దం ప్రారంభంలో అప్పటికే క్రైస్తవమతం మధ్యప్రాచ్యం అంతటా వ్యాపించి ఉంది.

బైబిల్లో మహమ్మద్ ప్రస్తావన లేకపోవడానికి కూడా స్పష్టమైన కారణం ఇదే.

తర్వాత శతాబ్దాలలో ఇస్లాం మతం ఏసును స్తుతిస్తుంటే, బదులుగా చర్చిలు మాత్రం ఆ మతంపై ఎప్పుడూ ఎమాత్రం కరుణ చూపించలేదనే చెప్పచ్చు.

ఇటలీలోని బొలోగ్నా నగరంలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన శాన్ పెట్రోనియో చర్చిలో మహమ్మద్ ప్రవక్త నరకంలో ఉన్నట్టు, సైతానులు ఆయన్ను వేధిస్తున్నట్టు చూపించారు.

ఐరోపా అంతటా వేసిన ఎన్నో వర్ణచిత్రాలు, కళాకృతులు ఆ అవమానకరమైన కథనాలకు శాసనాలుగా నిలిచిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

జీహాదీల దాడిని ఖండిస్తూ చర్చిలో జరిగిన సమావేశంలో ముస్లిం పెద్దలు

నరకంలో తొమ్మిదో సర్కిల్

డాంటే అనే కవి తన డివైన్ కామెడీ అనే పుస్తకంలో మహమ్మద్ ప్రవక్తను నరకంలోని తొమ్మిదో సర్కిల్‌కు పంపించినట్టు వర్ణించారు. దాని ప్రేరణతో ఇటాలియన్ చిత్రకారుడు గియోవని డ-మోడెనా ఆ చిత్రం వేశారు.

1800ల్లో మహమ్మద్ ప్రవక్తకు నరకంలో శిక్ష వేస్తున్నట్టు చిత్రాలు వేసేలా ఈ పుస్తకం ఎంతోమంది యూరోపియన్ చిత్రకారులను ప్రేరేపించింది.

ఈ చిత్రాల్లో ఇంగ్లిష్ కవి, చిత్రకారుడు విలియం బ్లేక్ వాటర్ కలర్స్‌తో వేసిన ఒక చిత్రం కూడా ఉంది.

ఇక బెల్జియం చర్చిలో 17వ సెంచరీలో చెక్కిన ఒక విగ్రహంలో దేవతలు తమ పాదాలతో మహమ్మద్ ప్రవక్తను తొక్కుతున్నట్టు ఉంది..

అయినా ఇది ఇప్పుడు ఆ చర్చిలో లేదు.

కాలం మారినా మన యుగంలో కూడా ఉద్రిక్తతలు, అసూయ, అతివాద హింస లాంటివి ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

మతాల మధ్య చర్చలు

2002లో ఇస్లామిక్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న కొందరు బొలోగ్న చర్చిలోని వీటిని పేల్చేయడానికి ప్రయత్నించారు.

ఇస్లాం పేరుతో యూరప్‌లోని ఎన్నో ముస్లిం దేశాల్లో జరిగిన దాడులు ఎంతోమంది మరణానికి కారణం అయ్యాయి. రెండు సమాజాల మధ్య చీలికను తీసుకొచ్చాయి

ఇస్లాంలో ఏసుక్రీస్తును గుర్తించడం, ఆయన ప్రాధాన్యం తెలుసుకోవడం అనేది బహుశా ఇప్పుడు క్రైస్తవులు, అలాగే ముస్లింలకు చాలా ముఖ్యం.

ఇది ప్రపంచంలోని రెండు ప్రధాన మతాల్లో ఉన్న ఒకే విషయం గురించి అందరికీ తెలిస్తే, అది ఆ గాయాలు మానేందుకు సాయం కావచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)