ఇండోనేసియాలో సునామీ : 429కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇంకా 150 మంది ఆచూకీ గల్లంతు

  • 25 డిసెంబర్ 2018
సునామీ తాకిడి నుంచి గాయాలతో బయటపడిన మహిళ Image copyright Getty Images
చిత్రం శీర్షిక సునామీ తాకిడి నుంచి గాయాలతో బయటపడిన మహిళ

ఇండోనేసియాలో సునామీ విధ్వంసంలో మరణించినవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సండా స్ట్రెయిట్ ప్రాంతాన్ని సునామీ ముంచెత్తడంతో ఇప్పటివరకు 429 మంది మృతి చెందారని, మరో 843 మంది గాయపడ్డారని, ఇంకా 150 మంది జాడ తెలియలేదని అధికారులు వెల్లడించారు.

మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయని బీబీసీ ఇండోనేసియా ప్రతినిధి రెబెక్కా తెలిపారు.

సునామీ ముంచెత్తడంతో వందలాది భవనాలు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

క్రకటోవా అగ్నిపర్వతం పేలుడు సంభవించిన తర్వాత సముద్ర గర్భంలో కొండ చరియలు విరిగిపడి అలజడి చోటుచేసుకోవడమే ఈ సునామీకి కారణమై ఉంటుందని అధికారులు బీబీసీకి చెప్పారు.

Image copyright Getty Images

మరో సునామీ వచ్చే ప్రమాదం ఉండడంతో ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ప్రముఖ పర్యాటక జిల్లా అయిన పాండెగ్లాంగ్‌లో వంద మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు చెప్పారు.

సెరాంగ్, దక్షిణ లాంపంగ్, టంగ్గమస్, సుమత్రా జిల్లాల్లో కూడా చాలామంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

Image copyright OYSTEIN LUND ANDERSEN
చిత్రం శీర్షిక అగ్నిపర్వతం పేలిన తర్వాత కొద్దిసేపటికే సునామీ సంభవించిందని అధికారులు చెబుతున్నారు. (శనివారం సాయంత్రం తీసిన చిత్రం)

పౌర్ణమికి సునామీకి సంబంధం ఉందా?

పౌర్ణమివేళ సూర్యుడు, భూమి మధ్య గురుత్వాకర్షణ విషయంలో కాస్త సంఘర్షణ జరుగుతుందని.. ఈ ప్రభావం భూమి.. సముద్రపు అలలపై ఉంటుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు.

పౌర్ణమి రోజు కావడం కూడా సముద్రంలో అలలు మరింత ఎగిసిపడేలా చేసి ఉంటుందని ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ కూడా తెలిపింది.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ సునామీ సంభవించింది.

సునామీ గురించి ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలూ జారీ చేయలేదని, సునామీ వచ్చే అవకాశం ఉందన్న విషయం ప్రజలకు తెలియదని బీబీసీ ప్రతినిధి రెబెక్కా తెలిపారు.

జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న సండా స్ట్రెయిట్ ప్రాంతం జావా సముద్రం, హిందూ మహాసముద్రాలను కలుపుతుంది.

Image copyright BNPB
చిత్రం శీర్షిక సునామీ అలలకు రోడ్ల మీద ఉన్న కార్లు కొట్టుకుపోయాయి.
Image copyright EPA

కూలిన భవనాల శిథిలాల్లో ఎవరైనా చిక్కుకున్నారేమో వెతుకుతున్నామని రెడ్ క్రాస్ట్ సంస్థ తెలిపింది.

సునామీ తర్వాత వీధులు జలమయమైనట్లుగా ఉన్న ఓ వీడియోను ఇండోనేసియా విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Image copyright AFP/GETTY IMAGES
చిత్రం శీర్షిక అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.

విరుచుకుపడ్డ అలలు

ఒకదాని తర్వాత ఒకటి రెండు భారీ అలలు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షి ఫొటోగ్రాఫర్ ఓయిస్టన్ లండ్ అండర్సన్ బీబీసీకి చెప్పారు. నార్వేకు చెందిన ఆయన సునామీ సంభవించిన సమయంలో ఇక్కడే ఉన్నారు.

మొదటి అల కంటే రెండోది మరింత బలంగా వచ్చి విధ్వంసం సృష్టించిందని ఆయన వివరించారు. అంతకు మందు భారీ పేలుడు శబ్దం కూడా వినిపించిందని తెలిపారు.

"అప్పుడు బీచ్‌లో నేనొక్కడినే ఉన్నా. నా భార్య, నా కొడుకు కొద్ది దూరంలోని హోటల్‌లో ఉన్నారు. ఆ బీచ్ నుంచి అగ్నిపర్వతం దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నాను. అప్పుడే, ఒక్కసారిగా సముద్రం నుంచి అలలు దూసుకొచ్చాయి. అది చూసిన వెంటనే పరుగెత్తాను. హోటల్‌కు వెళ్తే నా భార్య, కొడుకు నిద్రలో ఉన్నారు. వాళ్లను లేపి కిటికీలోంచి చూస్తే భారీ అల దూసుకొస్తున్నట్లు కనిపించింది. అది మా హోటల్‌ను దాటుకుని వెళ్లింది. రోడ్డు మీద ఉన్న కార్లను లాక్కెళ్లిపోయింది. నాతో పాటు హోటల్‌లో ఉన్న ఇతరులతో కలిసి ఎత్తైన అటవీ ప్రాంతానికి పరుగెత్తాము" అని అండర్సన్ బీబీసీకి వివరించారు.

Image copyright OYSTEIN LUND ANDERSEN
చిత్రం శీర్షిక సునామీ తర్వాత వీధుల్లోకి వచ్చిన నీరు
Image copyright Getty Images

భారీ విలయాన్ని మరవకముందే

ఈ ఏడాది సెప్టెంబర్‌ ఆఖరులో ఇండోనేసియాలోని పాలు నగరంపై భారీ సునామీ విరుచుకుపడడంతో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి.

2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ సునామీ వల్ల ఇండోనేసియా సహా 14 దేశాల్లో 2,28,000 మంది చనిపోయారు.

Image copyright OYSTEIN LUND ANDERSEN
చిత్రం శీర్షిక నిప్పులు కక్కుతున్న అనక్ క్రకటోవా అగ్నిపర్వతం (శనివారం తీసిన చిత్రం)

ఇండోనేసియాలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల పేలుళ్లు సంభవిస్తుంటాయి.

అనక్ క్రకటోవా (క్రకటోవాకు పిల్ల) అనే అగ్నిపర్వతం శుక్రవారం 2 నిమిషాల 12 సెకన్ల పాటు విస్ఫోటనం చెందింది. దాంతో పర్వతాల మీద దాదాపు 400 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగిసిపడిందని అధికారులు వెల్లడించారు.

ఈ అగ్నిపర్వతం నుంచి 2 కిలోమీర్ల పరిధిలోకి ఎవరూ వెళ్లకూడదన్న ఆంక్షలు ఉన్నాయి.

Image copyright GALLO IMAGES/ORBITAL HORIZON/COPERN
చిత్రం శీర్షిక అనక్ క్రకటోవా అగ్నిపర్వతం (ఆగస్టులో ఉపగ్రహం తీసిన చిత్రం)

క్రకటోవా

1883 ఆగస్టులో క్రకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. చరిత్రలో అత్యంత విధ్వంసకర అగ్నిపర్వత పేలుళ్లలో అదొకటి.

  • ఆ విస్ఫోటనం తర్వాత సంభవించిన భారీ సునామీ వల్ల 30,000 మందికి పైగా చనిపోయారు
  • వేడి బూడిద కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు
  • 1945లో హిరోషిమాపై అణు బాంబు కంటే 13,000 రెట్ల అధిక శక్తితో ఈ పర్వతం విస్ఫటనం చెందింది
  • ఆ విస్ఫోటనం శబ్దం కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది.
  • ఆ అగ్నిపర్వతం ఉన్న దీవి బయటకు కనిపించకుండా కుంగిపోయింది.

1927లో అనక్ అగ్నిపర్వతం వెలుగులోకి వచ్చింది.

Image copyright EPA
Image copyright EPA
Image copyright AFP
చిత్రం శీర్షిక గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
Image copyright AFP/Getty Images
చిత్రం శీర్షిక మృతదేహాలు
Image copyright EPA
చిత్రం శీర్షిక అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి.
Image copyright EPA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)