అమెరికా షట్‌డౌన్: క్రిస్మస్ దాకా ఇదే పరిస్థితి.. ట్రంప్ గోడ దిగడంలేదు ఎందుకు?

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రెండురోజులుగా పాక్షికంగా స్తంభించింది. క్రిస్మస్ దాకా పరిస్థితి అలాగే కొనసాగేలా అనిపిస్తోంది.

శుక్రవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపాల్సిన సెనేట్ మంగళవారానికి వాయిదా పడింది.

మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం కోసం 5 బిలియన్ డాలర్ల నిధులు కేటాయించాలన్న ట్రంప్ డిమాండ్‌ను డెమోక్రటిక్ పార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి షట్ డౌన్ ప్రారంభమైంది.

డోనల్డ్ ట్రంప్ క్రిస్మస్‌ను ఫ్లోరిడాలో జరుపుకోవాల్సి ఉండగా, తాజా పరిస్థితుల వల్ల దాన్ని రద్దు చేసుకుని వాషింగ్టన్‌లోనే ఉంటున్నారు.

సరిహద్దు గోడ ప్రతిపాదనను విరమించుకోవాలని డెమోక్రాట్లు సూచించారు.

"ట్రంప్... ప్రభుత్వం నడపాలనుకుంటే ముందు గోడ నిర్మించాలన్న ఆలోచనను మీరు వదిలిపెట్టాల్సిందే. లేకుంటే, ఏడాది గడిచినా ఈ బడ్జెట్‌ను సెనేట్‌ ఆమోదించదు" అని సెనేట్‌లో డెమోక్రటిక్ నేత చంక్ షుమర్ స్పష్టం చేశారు. వృథా ఖర్చులు పెడతామంటే తాము ఊరుకునేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్ మాత్రం గోడ నిర్మించేంత వరకు సరిహద్దు వద్ద అక్రమ కార్యకలాపాలను అడ్డుకోలేమని అన్నారు.

దాంతో హోంల్యాండ్ సెక్యూరిటీ, రవాణా, న్యాయ, వ్యవసాయంతో పాటు తొమ్మిది శాఖల్లో కార్యకలాపాలు స్తంభించాయి. దాంతో, వేలాది మంది ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది.

ఇలా అమెరికా ప్రభుత్వం స్తంభించడం ఈ ఏడాదిలోనే ఇది మూడోసారి.

ఈ ప్రతిష్టంభనపై చర్చలు నడుస్తున్నాయని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తెలిపారు. సరిహద్దు గోడ నిర్మించాలన్న విషయం గురించి డెమోక్రాట్లతో చర్చిస్తున్నామని ట్రంప్ శనివారం తెలిపారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి

అసలేం జరిగింది?

మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దులో గోడ నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల సమయంలో డోనల్డ్ ట్రంప్‌ ప్రకటించారు.

గోడ నిర్మాణం కోసం 5.7 బిలియన్‌ డాలర్ల కేటాయింపుతో రూపొందించిన ద్రవ్య వినిమయ బిల్లును ప్రతినిధుల సభ గురువారం ఆమోదించింది. అంది సెనేట్‌లో తిరస్కరణకు గురైంది.

ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 100 స్థానాలుండే సెనేట్‌లో 60 ఓట్లు రావాలి. డెమోక్రాట్ల మద్దతు లేకుండా అన్ని ఓట్లు వచ్చే అవకాశం లేదు.

వివిధ స్వల్పకాలిక ఖర్చుల కోసం వీలు కల్పించే ఈ బిల్లు ఇది. దానికి ఆమోదం లభించకపోవడంతో ప్రభుత్వం పాక్షికంగా (25 శాతం) మూతపడింది.

ఫొటో సోర్స్, Getty Images

ఏడాదిలో మూడుసార్లు

ఇలాగే బడ్జెట్‌కు ఆమోదం లభించనందున ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనూ అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి.

అప్పుడు 'స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ' మూసివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. నిధుల వ్యయానికి ప్రభుత్వానికి అవకాశం లేకుండా పోవడంతో ప్రభుత్వం ఉద్యోగులను సెలవులో ఉండాలని ఆదేశించింది. పలు జాతీయ స్మారక కట్టడాలు, భవనాలు మూతపడ్డాయి.

అంతకుముందు ఒబామా హయాంలోనూ 2013 అక్టోబరులో అమెరికాలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించడం అంటే?

తాజా ప్రతిష్టంభన ప్రభావం 25 శాతం ప్రభుత్వ విభాగాలు మూతపడతాయి. 3,80,000 మంది ఉద్యోగులు సెలవు లేదా జీతం లేని సెలవుపై వెళ్లాల్సి ఉంటుంది. అత్యవసర సేవల విభాగాల్లో మరో 4,20,000 మంది జీతాలు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.

మిగిలిన 75 శాతం విభాగాలకు 2019 సెప్టెంబరు 30 వరకూ అవసరమైన నిధుల వినియోగానికి ఇప్పటికే ఆమెదం లభించి ఉన్నందున ఆయా విభాగాల్లో పాలనకు ఎలాంటి ఆటంకం ఉండదు.

  • జీతాల చెల్లింపులో ఆలస్యం అయినా కస్టమ్స్, సరిహద్దు వద్ద సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది.
  • దేశంలోని జాతీయ పార్కుల్లో పనిచేసే ఉద్యోగుల్లో 80 శాతం మంది సెలవుల్లో ఉంటారు. దాంతో పార్కులు మూతపడే అవకాశం ఉంటుంది. లేదంటే కొద్దిమంది సిబ్బంది పనిచేస్తారు.
  • భవనాల శాఖలో 90 శాతం మంది ఉద్యోగులు వేతనం లేని సెలవు మీద ఉంటారు
  • అంతర్గత రెవెన్యూ సర్వీసులు(ఐఆర్‌ఎస్) విభాగంలో పనిచేసే ఉద్యోగులు కూడా వేతనం లేని సెలువు మీద ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)