కొలంబియా గెరిల్లా నేత గ్వాచో మరణం.. శాంతి ఒప్పందంతో ఆగని సాయుధ పోరు

ఫార్క్ సైన్యం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఒక దశలో ఫార్క్ సైన్యం 20,000 ఉండేవారు.

కొలంబియా గెరిల్లా దళ నాయకుడు వాల్టర్ అరిజాలా ప్రభుత్వ బలగాల చేతిలో మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడు ఇవాన్ దూకే శుక్రవారం ధ్రువీకరించారు. వాల్టర్ అరిజాలా.. కొలంబియాలో గ్వాచో అనే పేరుతో ప్రసిద్ధి చెందారు.

ఈక్వడార్ సరిహద్దు సమీపంలో వాల్టర్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఆయన్ను అంతమొందించినట్లు అధ్యక్షుడు ఇవాన్ ప్రకటించారు. కొలంబియా చరిత్రలోనే వాల్టర్ ఓ తీవ్ర నేరస్థుడని ఇవాన్ అన్నారు.

2018 మొదట్లో ఇద్దరు ఈక్వడార్ జర్నలిస్టులను, వారిడ్రైవర్‌‌ను హత్య చేసిన కేసులో గ్వాచో కోసం కొలంబియా బలగాలు గాలించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2016లో ఫార్క్ లెక్కల ప్రకారం వారి సైన్యంలో 15ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు 21మంది ఉన్నారు.

ఎవరీ గ్వాచో?

29ఏళ్ల గ్వాచో.. కొలంబియా తిరుగుబాటు సంస్థ 'ఫార్క్'లో సభ్యుడుగా ఉండేవారు. 2016లో గొరిల్లా సంస్థ కొలంబియా ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. కానీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన వేల మంది తిరుగుబాటుదారుల్లో గ్వాచో ఒకరు.

ఫార్క్ నుంచి బయటకొచ్చిన గ్వాచో, 'ఆలివర్ సినిస్టెర్రా ఫ్రంట్'ను స్థాపించాడు. ఈ సంస్థలో 70-80మంది సైన్యం ఉంటుందని ఓ అంచనా. వీరు కొలంబియా-ఈక్వడార్ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు.

ఇద్దరు ఈక్వడార్ జర్నలిస్టులను అపహరించడంతో ఈ సంస్థ తొలిసారిగా అంతర్జాతీయ దృష్టికి వచ్చింది. వీరి హత్యల తర్వాత, ఈక్వడార్‌కు చెందిన ఒక జంటను కూడా వీరు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

అప్పటినుంచీ రెండు దేశాలూ గ్వాచోను లక్ష్యంగా చేసుకున్నాయి.

గ్వాచోను వీలైతే సజీవంగా పట్టుకోవడానికి, లేదంటే హతమార్చడానికి 3 వేలమంది సాయుధ బలగాలను కొలంబియా రంగంలోకి దింపినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫార్క్ సైన్యంలో చాలామంది నిరుపేద, గ్రామీణ పురుషులు, మహిళలే!

ఫార్క్‌ను స్థాపించింది రైతులే!

‘ఫ్యుయెర్జాస్ అర్మడాస్ రివల్యూషనరీస్ డి కొలంబియా(ది రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) అనే ఈ కొలంబియా సాయుధ తిరుగుబాటు దళాలను సంక్షిప్తంగా ఫార్క్ అంటారు.

ఇది కొలంబియాలోనే అతి పెద్ద తిరుగుబాటు సంస్థ. అర్ధశతాబ్దం పాటు కొలంబియాను తన గెరిల్లా పోరాటాలతో వణికించిన తిరుగుబాటు సంస్థ ఇది. మార్క్సిస్ట్-లెనినిస్ట్ భావజాలంతో 1960లో ఏర్పడిన ఇది 1964 నుంచి సాయుధ పోరాట బాట పట్టింది.

ఈ సంస్థను స్థాపించింది కొందరు సన్నకారు రైతులే. అప్పట్లో కొలంబియాలో నెలకొన్న అసమానతలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో పట్టణాలకు చెందిన వర్గాలు ఉన్నప్పటికీ, గ్రామీణ స్థాయిలో గొరిల్లా సైన్యం భారీగా ఉంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

2008లో వ్యవస్థాపకుడు మాన్యఎల్ మరుల్యాండా (మధ్యలోని వ్యక్తి) అనారోగ్యంతో మరణించారు. చనిపోయేదాకా ఈయనే ఫార్క్ నాయకుడు.

ఫార్క్ సంఖ్య ఎంత?

ఫార్క్‌లో 6వేల నుంచి 7 వేల మంది సైనికులు ఉంటారని, వీరికి అదనంగా 8,500మంది సానుభూతిపరులు ఉండొచ్చన్నది భద్రతాదళాల అంచనా. 2002లో వీరి సంఖ్య 20వేల వరకూ ఉండేదని భద్రతా దళాలు చెబుతున్నాయి.

వీరి కార్యకలాపాలు ఎలా ఉంటాయి?

యుద్ధరంగంలో పోరాడగలిగిన సైనికులు చిన్నచిన్న వర్గాలుగా ఏర్పడతారు. ఈ వర్గాలన్నీ అవసరమైన సమయంలో మహాసైన్యంలా ఏకమయ్యేందుకు సిద్ధంగా ఉంటాయి.

వీరంతా ఓ డజను కంటే తక్కువ సంఖ్యలోని టాప్ కమాండర్ల నేతృత్వంలో పని చేస్తారు. ఈ సంస్థ అధినేత రోడ్రిగో లండనో ఎఛెవెరీ.. అలియాస్ టిమోఛెన్కో.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

మార్కెటాలియా రిపబ్లిక్ తర్వాత, తమ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చాలని ఫార్క్ భావించింది.

వీరు ఆయుధాలు ఎందుకు ట్టారు?

అణచివేత నుంచి ఫార్క్ సంస్థ ఏర్పడింది. అణచివేతకు వ్యతిరేకంగా ఎలాంటి పనినైనా విద్రోహ చర్యగా భావించే కాలంలో ఈ సంస్థ గళమెత్తింది.

కొలంబియా సమాజంలో అసమానతల చరిత్ర ఉంది. అక్కడ.. ఎక్కువ శాతం భూమి కొద్దిమంది ధనిక వర్గాల చేతుల్లో ఉంది.

19వ శతాబ్దం చివర్లో, 20వ శతాబ్దం ఆరంభంలో.. అప్పులు చెల్లించడం కోసం కొలంబియా.. దేశంలోని భూమిని పెద్దమొత్తంలో ప్రైవేటు వ్యక్తులకు విక్రయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయం.. అధిక శాతం భూమి ధనికుల చేతుల్లో ఉండటానికి పాక్షికంగా కారణం అయ్యుండొచ్చు.

ఫార్క్ వ్యవస్థాపకుల్లో కొందరు మొదటగా ఓ వ్యవసాయ సంఘాన్ని ప్రారంభించారు. 1950లోని క్యూబా తిరుగుబాటు స్ఫూర్తితో తమ హక్కుల కోసం, భూమిపై అధికారం కోసం డిమాండ్ చేశారు.

ఈ వ్యవసాయ సంఘం కమ్యూనిస్టు భావజాలంతో తమకు ప్రమాదం పొంచివుందని పెద్దమొత్తంలో భూములున్నవారితోపాటు ప్రభుత్వం కూడా భావించింది. ఈ దళాన్ని విచ్ఛిన్నం చేయడానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఈ దశను 'మార్కెటాలియా రిపబ్లిక్' పేరుతో పిలుస్తారు.

ఈ పరిణామం తర్వాత, తమ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చాలని ఫార్క్ భావించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఫార్క్ ఏర్పాటుకు ముందు కొలంబియాలో పదేళ్లపాటు అంతర్యుద్ధం నడిచింది.

ఫార్క్‌కు ముందు కొలంబియా ప్రశాంతంగానే ఉండేదా?

ఫార్క్ ఏర్పాటుకు ముందు ఒక దశాబ్దకాలంపాటు కొలంబియాలో అంతర్యుద్ధం జరిగింది. ఈ సమయంలో 2లక్షల నుంచి 3లక్షల మంది ప్రజలు మరణించి ఉంటారని అంచనా. ఈ సమయాన్ని 'లా వయోలెన్సియా'గా పిలుస్తారు. అంటే.. హింస అని అర్థం.

ఒక హత్య పదేళ్ల అంతర్యుద్ధానికి కారణమైంది!

లిబరల్ పార్టీకి చెందిన అధ్యక్ష అభ్యర్థి జార్జ్ ఎలీసర్ గైతన్‌ను 1948లో కాల్చి చంపారు. ఈ హత్యతో కొలంబియా రాజధానిలో లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీల మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆనాడు ప్రారంభమైన అల్లర్లు పదేళ్లపాటు కొనసాగాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రపంచంలోనే ఎక్కువ కాలం కొనసాగిన తిరుగుబాటు ఇది.

ఫార్క్‌లో సభ్యులు ఎవరు?

పేద రైతులను, పిల్లలను ఫార్క్ సంస్థ.. బలవంతంతో సభ్యులుగా చేర్చుకుంటోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపించాయి. కానీ వారంతా స్వచ్ఛందంగానే సభ్యులుగా చేరుతున్నట్లు ఫార్క్ చెప్పేది.

2016లో ఫార్క్ లెక్కల ప్రకారం వారి సైన్యంలో 15ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలు 21మంది ఉన్నారు. చాలామంది సైనికులు గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలే. తమ చేతికి తుపాకి ఇస్తామని ఊరిస్తారని ఫార్క్ నుంచి బయటకు వచ్చినవారు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కొకైన్ రవాణా, లేదా ఈ వ్యాపారం చేసేవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.

'ప్రపంచంలోనే ధనిక సంస్థ ఫార్క్'

ప్రపంచంలోని తిరుగుబాటు సంస్థల్లో ఫార్క్ అత్యంత ధనవంతమైన సంస్థ అని విశ్లేషకుల అభిప్రాయం. వీరి అభిప్రాయాన్ని ఫార్క్ కమాండర్లు ఖండిస్తున్నారు.

కొలంబియాలో కొకైన్ డ్రగ్ పెద్దమొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఈ డ్రగ్స్‌ను రవాణా చేయడం ద్వారా, లేదా ఈ డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై పెద్దమొత్తంలో సుంకాలను వసూలు చేయడం ద్వారా డబ్బును సమకూర్చుకుంటున్నారు. మరోవైపున డబ్బుల కోసం కిడ్నాపులు కూడా చేస్తున్నారు.

2016లో శాంతి ఒప్పందం

గత కొన్నేళ్లుగా కొలంబియా భద్రతా దళాల నుంచి ఫార్క్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికా అందిస్తోన్న లక్షల డాలర్ల ఆర్థికసాయంలో అధిక భాగాన్ని, తిరుగుబాటుదార్లను అణిచివేయడానికి కొలంబియా ఖర్చుచేస్తోంది.

గత దశాబ్ద కాలంలో ఫార్క్ వ్యవస్థాపకుడు మాన్యుఎల్ మరుల్యాండాతోపాటు మరికొందరు అగ్రనేతలు మరణించారు. ఫార్క్ సైనికుల సంఖ్య కూడా 20వేల నుంచి 7వేలకు పడిపోయింది.

ఈ పరిస్థితుల్లో.. ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కోసం ఫార్క్ సంస్థనే ముందుకు వచ్చింది. 2016లో ఆయుధ విరమణ ఒప్పందం జరిగింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)