ఇండోనేసియా సునామీ: మళ్లీ రావొచ్చు.. ప్రజలకు ప్రభుత్వ హెచ్చరిక

క్రకటోవా అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Reuters/AntraFoto

సునామీ మళ్లీ రావొచ్చని, కాబట్టి సముద్ర తీరాలకు దూరంగా ఉండాలని అనక్ క్రకటోవా అగ్నిపర్వతం సమీపంలోని కోస్తా ప్రాంతాల ప్రజలను ఇండోనేసియా ప్రభుత్వం హెచ్చరించింది.

సుమత్రా, జావా ద్వీపాల్లోని కోస్తా పట్టణాలను భారీ అలలు శనివారం ముంచెత్తాయి. దీంతో ఇప్పటి వరకు 373 మంది మృతి చెందగా 843 మంది గాయపడ్డారు.

క్రకటోవా అగ్నిపర్వతం బద్దలై లావా వెదజిమ్మిన నేపథ్యంలో.. తదనంతర పరిణామాల్లో భాగంగా దాని కింద, సముద్ర గర్భంలోని భూ ప్రకంపనలు తలెత్తే అవకాశం ఉండొచ్చని, తద్వారా మరోసారి రాకాసి అలలు ఎగసిపడొచ్చని భావిస్తున్నారు.

ఆదివారం కూడా అనక్ క్రకటోవా అగ్నిపర్వత విస్పోటనాలు కొనసాగాయి. భారీగా బూడిద, పొగ వెలువడ్డాయి.

సుమత్రా, జావా ద్వీపాల మధ్య ఉన్న సుందా స్ట్రైట్ వద్ద అగ్ని పర్వత విస్పోటనం ప్రభావాన్ని చూపే వీడియో ఒకటి వెలువడింది. దీన్ని చార్టర్డ్ విమానం నుంచి చిత్రీకరించారు.

ఇండోనేసియా అధ్యక్షుడు జాకో విడొడొ బాధితులకు తన సంతాపాన్ని ప్రకటించారు. ప్రస్తుత సమయంలో ప్రజలంతా ఓపిక పట్టాలని కోరారు.

సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే రహదారులన్నీ ధ్వంసం కావటంతో వీటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. సునామీతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టేందుకు అవసరమైన భారీ యంత్రాలను రవాణా చేస్తున్నారు. ఈ విధ్వంసంలో చిక్కుకున్న వారిని వెదికేందుకు, సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

విరుచుకుపడ్డ అలలు

ఒకదాని తర్వాత ఒకటి రెండు భారీ అలలు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షి ఫొటోగ్రాఫర్ ఓయిస్టన్ లండ్ అండర్సన్ బీబీసీకి చెప్పారు. నార్వేకు చెందిన ఆయన సునామీ సంభవించిన సమయంలో ఇక్కడే ఉన్నారు.

మొదటి అల కంటే రెండోది మరింత బలంగా వచ్చి విధ్వంసం సృష్టించిందని ఆయన వివరించారు. అంతకు మందు భారీ పేలుడు శబ్దం కూడా వినిపించిందని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

"అప్పుడు బీచ్‌లో నేనొక్కడినే ఉన్నా. నా భార్య, నా కొడుకు కొద్ది దూరంలోని హోటల్‌లో ఉన్నారు. ఆ బీచ్ నుంచి అగ్నిపర్వతం దృశ్యాలను కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తున్నాను. అప్పుడే, ఒక్కసారిగా సముద్రం నుంచి అలలు దూసుకొచ్చాయి. అది చూసిన వెంటనే పరుగెత్తాను. హోటల్‌కు వెళ్తే నా భార్య, కొడుకు నిద్రలో ఉన్నారు. వాళ్లను లేపి కిటికీలోంచి చూస్తే భారీ అల దూసుకొస్తున్నట్లు కనిపించింది. అది మా హోటల్‌ను దాటుకుని వెళ్లింది. రోడ్డు మీద ఉన్న కార్లను లాక్కెళ్లిపోయింది. నాతో పాటు హోటల్‌లో ఉన్న ఇతరులతో కలిసి ఎత్తైన అటవీ ప్రాంతానికి పరుగెత్తాము" అని అండర్సన్ బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, SADATSUGU TOMIZAWA/AFP/Getty Images

ఫొటో క్యాప్షన్,

ఇది 2011 మార్చి 11వ తేదీన జపాన్ ఫుకుషిమా సమీపంలోని మినమిసోమా తీరంలో సునామీ అలలు ఎగసిపడుతున్నప్పుడు సదత్సుగు తొమిజావా తీసిన చిత్రం

క్రకటోవా

1883 ఆగస్టులో క్రకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. చరిత్రలో అత్యంత విధ్వంసకర అగ్నిపర్వత పేలుళ్లలో అదొకటి.

ఆ విస్ఫోటనం తర్వాత సంభవించిన భారీ సునామీ వల్ల 30,000 మందికి పైగా చనిపోయారు.

వేడి బూడిద కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

1945లో హిరోషిమాపై అణు బాంబు కంటే 13,000 రెట్ల అధిక శక్తితో ఈ పర్వతం విస్ఫటనం చెందింది

ఆ విస్ఫోటనం శబ్దం కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకూ వినిపించింది.

ఆ అగ్నిపర్వతం ఉన్న దీవి బయటకు కనిపించకుండా కుంగిపోయింది.

1927లో అనక్ అగ్నిపర్వతం వెలుగులోకి వచ్చింది.

''ఆండీ.. త్వరగా రా. నేను ఒంటరిగా ఉన్నాను.. బ్రో, ప్లీజ్...''

ఇంత భారీ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ ఎందుకు లేవు? ప్రస్తుతం ఇండోనేసియాలో చాలామంది వేస్తున్న ప్రశ్న, చర్చించుకుంటున్న అంశం ఇదే. ప్రమాద తీవ్రతను తెలిపే కఠోర నిదర్శనంగా రాక్ బ్యాండ్ రాక్ బ్యాండ్ సెవెంటీన్ ప్రదర్శన సమయంలో ముంచెత్తిన అలల వీడియో నిలిచింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)