నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష : పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడిని వెంటాడుతున్న అవినీతి కేసులు

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మళ్లీ జైలుకెళ్లారు. ప్రకటించిన ఆస్తులను మించి పెట్టుబడులు ఉండడంతో ఇస్లామాబాద్‌లోని అవినీతి నిరోధక న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.

వివిధ అవినీతి కేసుల్లో ఆయనకు జులైలోనే శిక్షపడింది. ఆయన జైలులో ఉన్నప్పుడే ఆయన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది.

అనంతరం ఆయన బెయిలుపై బయటకొచ్చారు. ఆ తరువాత ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు విధించిన శిక్షను రద్దు చేసింది.

తాజాగా మరో కేసులో కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష వేయడంతో అప్పీల్‌కు వెళ్లనున్నట్లు షరీఫ్ తెలిపారు. తనపై మోపిన అభియోగాలన్నీ అవాస్తవాలంటూ ఖండించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

కోర్టు వద్ద గుమిగూడిన నవాజ్ షరీఫ్ మద్దతుదారులు

పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి షరీఫ్‌కు వ్యతిరేకంగా మూడు కేసులు నమోదయ్యాయి. అందులో.. సౌదీ అరేబియాలోని అల్‌-అజీజియా స్టీల్‌ మిల్స్‌ ఏర్పాటు కేసు ఒకటి. ఈ కేసులోనే ఇప్పుడు షరీఫ్‌కు ఏడేళ్ల శిక్ష పడింది.

ఈ మిల్లుల ఏర్పాటుకు సమకూర్చిన పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో షరీఫ్ చెప్పలేకపోయారంటూ న్యాయస్థానం శిక్ష విధించింది.

బ్రిటన్‌లోని ఫ్లాగ్‌షిప్‌ పెట్టుబడుల కేసులో మాత్రం ఆధారాలు లేవంటూ షరీఫ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

షరీఫ్ ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్‌లు పరారీలో ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది.

కాగా సోమవారం ఈ తీర్పు సందర్భంగా వేలాది మంది షరీఫ్ మద్దతుదారులు కోర్టు వద్దకు చేరుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పోలీసులను మోహరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)