ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్టు‌ వైస్ కెప్టెన్‌ ఈ ఏడేళ్ల కుర్రాడు

ఆర్ఛీ

ఫొటో సోర్స్, TWITTER/CRICKET.COM.AU

భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న మూడో టెస్ట్ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఎంపికైన భారత జట్టు కంటే, ఆస్ట్రేలియా టీంలోకి కొత్తగా వచ్చిన లెగ్ స్పిన్నర్ గురించే చాలామంది మాట్లాడుతున్నారు.

అతను తన మొదటి మ్యాచ్‌లోనే వైస్ కెప్టెన్‌గా జట్టులోకి అడుగుపెడుతున్నాడు. అతని పేరు ఆర్ఛీ. వయసు 7సంవత్సరాలు. ఆర్ఛీని తన 15సభ్యుల జట్టులోకి ఆస్ట్రేలియా తీసుకుంది.

ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడో టెస్టుకు ఆర్ఛీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ శనివారం ప్రకటించాడు. ఆర్ఛీ జన్మదినం సందర్భంగా టిమ్ ఈ ప్రకటన చేశాడు.

ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ధృవీకరించింది.

ఆర్ఛీ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే వార్తను డిసెంబర్ మొదట్లోనే వెలువరించినట్లు క్రికెట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

ఈ సిరీస్‌కు ముందు టెస్ట్ సమయంలో ఆస్ట్రేలియా జట్టుతోపాటు ఆర్ఛీ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు.

తనను జట్టులోకి తీసుకుంటున్న విషయాన్ని మొదటగా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ ఆర్ఛీకి ఫోన్ చేసి చెప్పాడు. ఆ సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

'మేక్ ఎ విష్ ఆస్ట్రేలియా'

ఆర్ఛీ.. తన ఏడేళ్ల వయసులోనే అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మూడు నెలల వయసులోనే ఆర్ఛీకి గుండె జబ్బు ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. మెల్‌బోర్న్‌లో ఆర్ఛీకి 7గంటలపాటు సర్జరీ చేశారు. సర్జరీ జరిగిన 6నెలల తర్వాత, ఆర్ఛీకి గుండె సమస్య మళ్లీ మొదలవ్వడంతో మళ్లీ సర్జరీ చేశారు.

గతేడాది డిసెంబర్లో ఈ సమస్య మూడోసారి పొడచూపింది. దీంతో ఆర్ఛీకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పుడు, తమ కొడుకు సజీవంగా తిరిగొస్తాడని ఆ తల్లిదండ్రులు అనుకోలేదు.

''ఈసారి ఏదైనా జరగొచ్చని డాక్టర్లు చెప్పారు'' అని ఆర్ఛీ తల్లి సారా తెలిపినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది.

''ఆర్ఛీ తన స్కూల్‌ను ఎంతో మిస్ అవుతున్నడు. బ్యాటింగ్ ఆడే అవకాశాన్ని వదులుకుంటే, ఇంకో అవకాశం రాదు. ఒకరోజు నాదగ్గరకు వచ్చి, ఆడుకోవడానికి స్నేహితులు దొరకడం లేదని, వాళ్ల వెంట పరిగెత్తడానికి కూడా తనకు శక్తి లేదని అన్నాడు. తనంతకు తాను ఓ చోట కూర్చుని, పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. వాడిని అలా చూసినపుడు నా గుండె పగిలింది'' అని సారా అన్నారు.

కానీ 2018 క్రిస్మస్.. ఆర్ఛీకి ఆనందాన్ని అందిస్తోంది.

''ఆర్ఛీ, తన తల్లిందండ్రులు గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. ఆర్ఛీ కోరికల గురించి తన తండ్రి అడిగినపుడు, ఆస్ట్రేలియా టీం కెప్టెన్ కావాలనుందని ఆర్ఛీ చెప్పాడు. ఆర్ఛీ మా జట్టుతోపాటు ఉండటం.. మాకెంతో స్ఫూర్తిదాయకం. బాక్సింగ్ డే రోజున జరిగే ఆర్ఛీ మొదటి మ్యాచ్ గురించి మాకెంతో ఆసక్తిగా ఉంది'' అని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)