గూఢచారితో పారిపోయి పట్టుబడిన దుబాయ్ యువరాణి కథ

దుబాయ్ యువరాణి

ఫొటో సోర్స్, UNITED ARAB EMIRATES FOREIGN MINISTRY

దుబాయ్‌లో అదృశ్యం అయిందని భావిస్తున్న యువరాణి ఫొటోలు విడుదల చేశారు. దుబాయ్ పాలకుని కుమార్తె షేక్ లతీఫా ఈ ఏడాది మార్చిలో దేశం వదలిపారిపోవాలని ప్రయత్నించారని వార్తలొచ్చాయి.

అప్పట్లో ఈమెను భారత్ సమీపంలో తెర చాప పడవలో గుర్తించి వెనక్కి తీసుకెళ్లారని కొందరు చెప్పారు.

అయితే, దీన్ని దుబాయ్ ప్రభుత్వం ఖండించింది. ఆమె ఇంట్లో కుటుంబంతో కలిసి ఉందని పేర్కొంది.

ఈ ఘటనపై చాలా మంది మానవహక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె భద్రంగా ఉంటే ఆ విషయాన్ని నిరూపించాలని కోరారు.

ఈ నేపథ్యంలో దుబాయ్ విదేశాంగ శాఖ స్పందించింది.

షేక్ లతీఫా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల శాఖ మాజీ హై కమిషనర్, ఐర్లాండ్ మాజీ అధ్యక్షులు మేరీ రాబిన్సన్‌తో ఉన్న చిత్రాలను విడుదల చేసింది.

ఈ చిత్రాలను ఈనెల 15న దుబాయ్‌లో తీసినట్లు తెలుస్తోంది.

ఈ ఫొటోలను వారిద్దరి సమ్మతితోనే విడుదల చేశామని దుబాయ్ వివరించింది. అయితే దీనిపై ఐక్యరాజ్య సమితి ఇంకా స్పందించలేదు.

ఫొటో క్యాప్షన్,

దుబాయ్ పాలకుని కుమార్తె షేక్ లతీఫా

పారిపోయే ప్రయత్నం..

షేక్ లతీఫా ఇంతకు ముందు విదేశాలకు పారిపోవాలని ప్రయత్నించినట్లు సమాచారం.

ఈ యువ రాణి వయసు 33 ఏళ్లు. ఈమె ఫ్రాన్స్‌కు చెందిన మాజీ గూఢచారి హెర్వ్ జాబర్ట్ సాయంతో తెరచాప పడవలో పారిపోవాలని ప్రయత్నించగా అది విఫలమైంది.

ఈమెను భారత తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో గుర్తించి వెనక్కి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, జాబర్ట్

ఫొటో క్యాప్షన్,

జాబర్ట్

ఆమెను బలవంతంగా హెలికాప్టర్లో తీసుకెళ్లారని ఆమెకు సాయం చేసినట్లు చెబుతున్న జాబర్ట్ వెల్లడించారు.

ఆమె గతంలో అదృశ్యమైనప్పుడు ఆమె పారిపోయేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చూపే వీడియో ఒకటి విడుదలైంది. తనకు, తన కుటుంబానికీ తగినంత స్వేచ్ఛలేదని అందుకే పారిపోవాలనుకుంటున్నామని ఆ వీడియోలో పేర్కొన్నారు.

16 ఏళ్ల వయసులోనూ తాను దేశం వదిలిపారిపోయేందుకు ప్రయత్నించానని అందులో తెలిపారు. అప్పట్లో తనకు మూడేళ్లు జైలు శిక్ష విధించి హింసించారని వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)