నరేంద్ర మోదీతో కేసీఆర్ భేటీ బ్రీఫింగ్ కోసమేనా? - చంద్రబాబు నాయుడు

కేసీఆర్, మోదీ

ఫొటో సోర్స్, I and PR, Govt of Telangana

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భేటీ అయ్యారు.

తెలంగాణ రాష్ట్రానికి రెండో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతో భేటీ అయిన కేసీఆర్ ఆ తర్వాత ఢిల్లీ వచ్చారు.

దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు లేని కూటమి (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారు.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు.

ఫొటో సోర్స్, I and PR, Govt of Telangana

ఫొటో సోర్స్, I and PR, Govt of Telangana

వీటిపైనే చర్చ - సీఎంఓ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవ సారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తొలిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లారని వివరించింది.

సెక్రటేరియేట్ నిర్మాణానికి బైసన్ పోలో గ్రౌండ్‌ను బదిలీ చేయటం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, కొత్త జిల్లాల్లో 21 జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు, హైదరాబాద్‌కు ఐఐఎస్ఈఆర్ మంజూరు, ఆదిలాబాద్‌లో ఎన్‌హెచ్ఏఐతో సంయుక్తంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ, జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక జోన్‌కు నిధుల మంజూరు, వరంగల్‌లో రూ.వెయ్యి కోట్లతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు అభివృద్ధి మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయని సీఎంఓ వివరించింది.

మోదీని కలిసిన తర్వాత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.

ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook

చెప్పడం వేరే, చేసే పని వేరే - చంద్రబాబు

మోదీతో కేసీఆర్ సమావేశం కావటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

అమరావతిలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ చేస్తున్న పర్యటనల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ''యాక్షన్సే మాట్లాడుతున్నాయి కదా. ఇతని (కేసీఆర్) చర్యలు, బీజేపీ చర్యలు.. రెండూ కలసి మాట్లాడుతున్నాయి కదా. అందుకే కదా ఎవరికీ నమ్మకం లేకుండా పోతోంది'' అని చంద్రబాబు స్పందించారు.

''నిన్నటి వరకూ అందరి వద్దా తిరిగి, మళ్లాపోయి పీఎంను కలిస్తే ఏంటి? ఇప్పుడు (మాట్లాడేది) రాష్ట్ర సమస్యలా? లేక వాళ్ల బ్రీఫింగా? వాళ్లే వీటన్నింటిపైనా స్పందించాలి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పడం వేరే, చేసే పని వేరే'' అని చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్ వెళ్లి కేసీఆర్‌ను కలుస్తా - అఖిలేష్ యాదవ్

దేశంలో ఏదో ఒక రూపంలో అన్ని రాజకీయ పార్టీలూ ఒకే వేదికపైకి రావాలని, ఈ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.

కేసీఆర్‌తో తాను మాట్లాడానని, డిసెంబర్ 25 లేదా 26 తేదీల్లో దిల్లీలో తాము కలవాలనుకున్నామని, కానీ కలవలేకపోతున్నామని, కాబట్టి కేసీఆర్‌ను కలిసేందుకు తాను మళ్లీ సమయం కోరతానని అఖిలేష్ చెప్పారు. కేసీఆర్‌ను కలిసేందుకు తాను స్వయంగా హైదరాబాద్ వెళతానని, ఇందుకోసం జనవరి 6వ తేదీ తర్వాత సమయం కోరతానని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)