సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?

  • జఫర్ సయ్యద్
  • బీబీసీ ప్రతినిధి
చాయ్ కథ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1876లో యూరప్‌లో తేనీరు తాగుతున్న ఒక చిత్రం

బలంగా పొడవుగా ఉండే రాబర్ట్ ఫర్ట్యూన్ ఒక కూలీ ముందు తల వంచారు. ఒక కత్తిని చేతిలోకి తీసుకున్న ఆ కూలీ ఫర్ట్యూన్ తల ముందు భాగాన్ని గొరగడం మొదలుపెట్టాడు.

ఆ కత్తి మొద్దుగా అయ్యుంటుంది, లేదంటే ఆ కూలీ మొరటువాడైనా అయ్యుండాలి. ఎందుకంటే, ఫర్ట్యూన్‌కు తల గొరుగుతున్నట్టు లేదు, తలపై గాట్లు పెడుతున్నట్టు ఉంది.

దాంతో ఆయన కన్నీళ్లు చెంపల నుంచి కిందికి జారుతున్నాయి.

ఈ ఘటన 1848 డిసెంబర్లో చైనాలోని షాంఘై నగరానికి సమీపంలో జరిగింది. ఫర్ట్యూన్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక గూఢచారి.

ఆయన చైనా మారుమూల ప్రాంతాలకు వెళ్లి అక్కడ పండించే తేయాకును దొంగిలించి, దానిని భారతదేశం తీసుకెళ్లాలని అక్కడికి వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తేయాకు కోసం గూఢచారిగా చైనా వెళ్లిన రాబర్ట్ ఫర్ట్యూన్

వేషం మార్చిన గూఢచారి

కానీ ఆ పని చేయడానికి ఆయన మొదట తన వేషం మార్చాల్సి వచ్చింది.

చైనీయుడిలా వేషం మారుస్తున్న ఫర్ట్యూన్ చైనా సంప్రదాయం ప్రకారం తల ముందు భాగంలో ఉన్న వెంట్రుకలు తీయించుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఆయన వెంట్రుకలకు ఒక జడ అతికించారు. ఆయనకు చైనా దుస్తులు వేశాక, ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవద్దని చెప్పారు.

అయితే, వారికి ఇంకో సమస్య ఎదురైంది. దాన్ని దాచడం అంత సులువు కాదు. చైనీయులతో పోలిస్తే ఫర్ట్యూన్ ఒక అడుగు ఎత్తుగా ఉంటారు.

దాన్ని కవర్ చేయడానికి వాళ్లు మరో అబద్ధం వెతికారు. ఆయన చైనా గోడకు అవతల నివసిస్తాడని చెప్పారు. ఆ వైపు ఉండే చైనీయులు కాస్త పొడవుగా ఉంటారు.

ఈ పనికోసం వారు ప్రాణాలే పణంగా పెట్టారు. ఫర్ట్యూన్ ఈ పనిలో విజయం సాధిస్తే తేయాకుపై వేల ఏళ్లుగా ఉన్న చైనా ఆధిపత్యానికి తెరపడుతుంది.

ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తేయాకును పండించి ప్రపంచమంతా దాని అమ్మకాలు ప్రారంభిస్తుంది.

కానీ ఒకవేళ ఆయన ఈ ప్రయత్నంలో పట్టుబడితే, ఒకే ఒక శిక్ష ఉంటుంది. మరణ శిక్ష. దానికి కారణం తేయాకు ఎలా పండిస్తారు అనేది చైనాలో ఒక రహస్యం.

చైనా పాలకులు శతాబ్దాల నుంచీ ఆ రహస్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రోజుకు రెండు బిలియన్ల కప్పులు

ఒక రీసెర్చ్ ప్రకారం, నీళ్ల తర్వాత ప్రపంచంలో ఎక్కువగా తాగే పదార్థం టీ. ప్రపంచంలో రోజూ సుమారు రెండు బిలియన్ల మంది వేడి వేడి టీ తాగిన తర్వాతే తమ రోజును ప్రారంభిస్తున్నారు.

అయితే ఈ తేయాకు మన వరకూ ఎలా చేరిందనే విషయం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు.

కానీ, ఈ తేయాకు కథ సస్పెన్స్ థ్రిల్లర్ నవలను మించిపోయేలా ఉంటుంది. ఈ కథలో గూఢచారి ప్రయాణం ఉత్కంఠ కలిగిస్తుంది.

కొన్ని అదృష్టం కలిసొచ్చిన ఘటనలైతే, మరికొన్ని దురదృష్టకరమైన ఘటనలూ ఎదురవుతాయి.

ఫొటో సోర్స్, DEA PICTURE LIBRARY

గాల్లో ఎగిరొచ్చిన తేయాకు ఆకులు

తేనీరు మొదట ఎలా మొదలైంది. దీనిపై ఎన్నో పాపులర్ కథలు ఉన్నాయి.

షినుంగ్ అనే ఒక ప్రముఖ చైనా చక్రవర్తి రాజ్యంలో పరిశుభ్రత పెంచాలని భావించాడు. ప్రజలందరూ నీళ్లు మరిగించి తాగాలని ఆదేశాలు జారీ చేశాడు.

ఒక రోజు ఒక అడవిలో చక్రవర్తి కోసం సేవకులు నీళ్లు మరిగిస్తున్నారు. అప్పుడే గాల్లో ఎగిరి వచ్చిన కొన్ని ఆకులు ఆ పాత్రలో పడ్డాయి.

తర్వాత షినుంగ్ ఆ నీళ్లు తాగగానే, ఆయనకు ఆ రుచి నచ్చడమే కాదు, ఆ నీళ్లు తాగినప్పటి నుంచి ఒంట్లో చాలా హుషారుగా కూడా అనిపించింది.

ఆరోజు చక్రవర్తి తాగినవి తేయాకు మరిగిన నీళ్లు. దాంతో చక్రవర్తి వాటిని వేసుకుని తాగాలని తన రాజ్యంలోని ప్రజలందరినీ ఆదేశించాడు. తర్వాత ఆ పద్ధతి చైనాలో అన్ని ప్రాంతాలకూ వ్యాపించింది.

యూరప్‌లో 16వ శతాబ్దంలో మొట్టమొదట తేయాకు గురించి తెలిసింది. పోర్చుగీసు వారు తేయాకు వ్యాపారం ప్రారంభించారు.

శతాబ్దంలోపే తేనీరును ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కూడా తాగడం మొదలు పెట్టారు. కానీ ఆంగ్లేయులకు ఇది ఎంతగా నచ్చిందంటే.. ప్రతి ఇంట్లోనూ తేనీరు తాగడం అలవాటైపోయింది.

ఫొటో సోర్స్, Getty Images

చైనాకు చెక్ పెట్టాలనే ప్రయత్నం

పాశ్చాత్య ప్రపంచానికి ప్రతి వస్తువునూ అందించే బాధ్యత ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉండేది. దాంతో అది తేయాకును చైనా నుంచి చాలా ఎక్కువ ధరకు కొనాల్సివచ్చేది.

అక్కడ తేయాకు కొనుగోలు చేసిన తర్వాత సుదీర్ఘ సముద్ర మార్గం గుండా ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు చేర్చాల్సి వచ్చేది. దాంతో తేయాకు ధర మరింత పెరిగిపోయేది.

దాంతో ఆంగ్లేయులు తామే స్వయంగా భారతదేశంలో తేయాకు మొక్కలను పెంచాలని అనుకున్నారు. అలా చేస్తే చైనాకు చెక్ పెట్టచ్చని భావించారు.

కానీ తేయాకు మొక్క ఎలా ఉంటుంది, అది ఎలా పెరుగుతుంది. దాన్నుంచి తేయాకు ఎలా తీస్తారో వారికి ఒక్క విషయం కూడా తెలీదు.

అందుకే ఆ కంపెనీ చైనా తేయాకు గుట్టు విప్పేందుకు రాబర్ట్ ఫర్ట్యూన్‌ను గూఢచారిగా ఆ దేశానికి పంపించింది.

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం నుంచి తేయాకు వ్యాపారం

తేయాకు గురించి తెలుసుకోడానికి ఆయన చైనాలో ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది.

మార్కోపోలో తర్వాత బహుశా యూరప్‌కు చెందిన ఏ వ్యక్తీ అక్కడకు వెళ్లలేదు. ఫోజియాన్ ప్రాంతంలోని కొండలపై అత్యంత రుచికరమైన బ్లాక్ టీ పండిస్తారని ఫర్ట్యూన్‌కు తెలిసింది.

దాంతో ఆయన తన సహచరుడిని ముందు అక్కడికి పంపించారు.

తల గొరిగించుకున్న ఫర్ట్యూన్ నకిలీ జడను అతికించుకుని, చైనా వ్యాపారిలా వేషం వేసుకుని, సీంగ్ అనే చైనా పేరు కూడా పెట్టుకున్నారు.

రుచికరమైన టీ మొక్కలు, గింజలు తీసుకురావడంతోపాటు, ఆ మొక్కలను ఎలా పెంచాలి, వాటి నుంచి తేయాకు ఎలా వస్తుంది మొత్తం తెలుసుకురావాలని ఈస్ట్ ఇండియా కంపెనీ అతడికి ప్రత్యేకంగా చెప్పింది.

అంతా తెలుసుకుంటే వాటిని భారతదేశంలో పండించవచ్చని భావించింది.

ఫొటో సోర్స్, Getty Images

తేయాకు మొక్కల దొంగతనం

ఆ పని చేసినందుకు ఈస్టిండియా కంపెనీ ఫర్టూన్‌కు ప్రతి ఏటా 500 పౌండ్స్ ఇస్తామని చెప్పింది.

కానీ ఫర్ట్యూన్ చేయబోయే పని అంత సులభం కాదు. ఆయన చైనాలో తేయాకు ఎక్కడ, ఎలా పండిస్తారో తెలుసుకోవడం మాత్రమే కాదు. ఎక్కడున్నాయో తెలియని ఆ మొక్కలను దొంగిలించి తనతో తీసుకెళ్లాలి.

ఫర్ట్యూన్ చాలా అనుభవం ఉన్న గూఢచారి.

కానీ, ఆయనకు తేయాకు పండించే చోటుకు వెళ్లగానే, కొన్ని మొక్కలు తీసుకెళ్లడం వల్ల ప్రయోజనం ఉండదని, ఆ గింజలను భారతదేశం తీసుకువెళ్లాలని, అప్పుడే తేయాకు మొక్కలను అక్కడ భారీగా పెంచగలమని అర్థమైంది.

అంతే కాదు, భారతదేశంలో తేయాకు పండించడానికి చైనా రైతుల సాయం కూడా అవసరం అని ఫర్ట్యూన్ భావించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఒకే మొక్క నుంచి బ్లాక్, గ్రీన్ టీ

అదే సమయంలో తేయాకు ఏ కాలంలో పండిస్తారు, ఆకుల దిగుబడి ఎలా ఉంటుంది, వాటిని ఎలా ఎండబెడతారు లాంటి మిగతా వివరాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలి.

ఫర్ట్యూన్ లక్ష్యం మామూలు తేయాకు మొక్కలు చేజిక్కించుకోవడం కాదు, అత్యంత రుచికరమైన తేయాకు ఎక్కడుందో తెలుసుకోవడం.

చివరికి ఎన్నో పడవలు, పల్లకీలు, గుర్రాలు ఎక్కిదిగి, అష్టకష్టాలు పడిన మూడు నెలల తర్వాత ఫర్ట్యూన్ ఒక లోయలో ఉన్న తేయాకు పరిశ్రమ దగ్గరికి చేరుకున్నారు.

అంతకు ముందు యూరప్‌లో అందరూ బ్లాక్ టీ, గ్రీన్ టీ మొక్కలు వేరువేరుగా ఉంటాయని అనుకునేవారు. కానీ ఆ రెండు రకాల తేయాకు, ఒకే మొక్క నుంచి వస్తుందని తెలిసి ఫర్ట్యూన్ ఆశ్చర్యపోయారు.

తేయాకు తయారవుతున్న ప్రతి చోటా ఫర్ట్యూన్ నోరు మెదపకుండా పనిచేశారు. ఏదైనా అర్థం కాకపోతే తన సహచరుడిని అడిగి తెలుసుకునేవారు.

ఫొటో క్యాప్షన్,

చైనాలో వేల ఏళ్ల క్రితమే తేనీరు సేవించేవారు

అనుకోకుండా కలిసొచ్చిన అదృష్టం

ఫర్ట్యూన్ కష్టం ఫలించింది. పాలకుల కళ్లుగప్పి తేయాకు మొక్కలు, గింజలు, కొంతమంది చైనా కార్మికులను భారతదేశం పంపించడంలో ఆయన సఫలం అయ్యారు.

ఆయన పర్యవేక్షణలో ఈస్ట్ ఇండియా కంపెనీ అసోం ప్రాంతంలో తేయాకు మొక్కలను పండించడం ప్రారంభించింది.

కానీ చైనా నుంచి తేయాకు తీసుకురావడంలో ఫర్ట్యూన్ ఒక పొరపాటు చేశారు. ఆయన తీసుకొచ్చిన మొక్కలను ఆ దేశంలోని కొండలపై శీతాకాలంలో సాగుచేస్తారు.

కానీ, అసోంలో వేడిగా ఉన్న ప్రాంతం వాటికి సరిపడలేదు. దాంతో అవి మెల్లమెల్లగా ఎండిపోవడం మొదలెట్టాయి.

వారు చేసిన ప్రయత్నాలన్నీ అడుగంటిపోక ముందే ఒక అద్భుతం జరిగింది. దానిని ఈస్ట్ ఇండియా కంపెనీ అదృష్టమో, లేదా చైనా దురదృష్టమో అనుకోవాలి.

అదే సమయంలో అసోంలో ఏపుగా పెరిగే ఒక మొక్క గురించి వారికి తెలిసింది.

ఆ మొక్కను రాబర్ట్ బ్రాస్ అనే ఒక స్కాటిష్ 1823లో గుర్తించారు. తేయాకులాగే కనిపించే ఆ మొక్క అసోం పర్వత ప్రాంతాల్లో గుబురుగా పొదల్లా పెరుగుతుండేది.

ఫొటో సోర్స్, Getty Images

దిగుబడిలో వెనకబడిన చైనా

ఫర్ట్యూన్ తెచ్చిన మొక్కలు ఎండిపోవడంతో ఈస్టిండియా కంపెనీ అసోంలో కనిపించిన ఆ మొక్కలపై దృష్టి పెట్టింది.

ఫర్ట్యూన్ వాటిపై చేసిన పరిశోధనల్లో అవి దాదాపు చైనా తేయాకు మొక్కల్లాగే ఉన్నట్టు తెలిసింది. అవి ఆ జాతి మొక్కలేనని తేలింది.

చైనా నుంచి దొంగిలించి తీసుకువచ్చిన తేయాకు పద్ధతులు, ఆ టెక్నిక్ అప్పుడు పనికొచ్చాయి.

వాటిలాగే పర్వత ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ తేయాకు తోటలు పెంచింది. ఆ ఆకులతో తయారు చేసిన టీ అందరికీ బాగా నచ్చింది.

అలా కార్పొరేట్ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ దొంగతనం.. ఎందుకూ కొరగాకుండా పోయే దశలో విజయవంతం అయ్యింది.

దేశంలో దొరికిన తేయాకు తోటల సాగు విజయవంతం కావడంతో అసోంలోని ఒక పెద్ద ప్రాంతాన్ని ఎంచుకున్న కంపెనీ, దానిని తేయాకు మొక్కలు పెంచడానికే పరిమితం చేసింది.

తేయాకు వ్యాపారం కూడా ప్రారంభించింది. కొంతకాలం తర్వాత తేయాకు దిగుబడిలో చైనా కూడా వెనకబడిపోయేలా చేసింది.

ఎగుమతులు తగ్గిపోవడంతో చైనాలో తేయాకు తోటలు ఎండిపోవడం మొదలైంది. తేనీరుతో ఒకప్పుడు పాపులర్ అయిన దేశం తర్వాత మరుగున పడిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images

తేనీరుకు కొత్త రుచులు

ఆంగ్లేయులు తేనీరు తయారీలో కొత్త రుచులు అందించారు. చైనీయులు వేల ఏళ్ల నుంచి నీళ్లలో ఆకులు వేసి మరిగించి తేనీరు తాగేవారు.

కానీ ఆంగ్లేయులు తమ పానీయాల్లో మొదట్లో చక్కెర, తర్వాత పాలు కలపడం ప్రారంభించారు.

వాస్తవానికి, టీలో వేరే పదార్థాలు కలిపి ఎందుకు తాగుతారా అని చైనీయులకు మిగతా దేశాల వారిని ఇప్పటికీ వింతగా చూస్తుంటారు.

ఇటు భారతీయులు కూడా ఆంగ్లేయుల్లాగే టీలో చక్కెర, పాలు కలుపుకుని తాగడానికి అలవాటుపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా విప్లవంలో భారతదేశం పాత్ర

1985లో అమెరికాలో పర్యటించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. తేయాకు కథలో భారతదేశం పాత్ర గురించి ఒక ఆధారాన్ని ప్రస్తావించారు.

కాంగ్రెస్ జాయింట్ కాన్ఫరెన్సులో ప్రసంగించిన ఆయన "భారత్‌లో పుట్టిన తేనీరు అమెరికాకు కూడా బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందాలనే కోరికను రగిల్చిందని" అన్నారు.

ఆయన ఆరోజు 1773 గురించి ప్రస్తావించారు. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అమెరికాలో తేయాకు వ్యాపారం చేసేది. కానీ ట్యాక్స్ చెల్లించేది కాదు.

చివరికి విసిగిపోయిన కొంతమంది అమెరికన్లు ఒకరోజు బోస్టన్ రేవులో నౌకలపై ఎక్కి కంపెనీ నౌకలో ఉన్న టీ పెట్టెలను సముద్రంలో పడేశారు.

బ్రిటన్ దీనికి తమ బలగాలతో సమాధానం ఇచ్చింది. కానీ ఆ తర్వాత అమెరికా జనాభాలో అసహనం రగిలింది. దాని ఫలితంగానే మూడేళ్ల తర్వాత అమెరికన్లకు స్వాతంత్రం లభించింది.

అయితే, రాజీవ్ గాంధీ ఆ సమయంలో పొరబడ్డారు. ఎందుకంటే, 18వ శతాబ్దంలో భారతీయులు తేయాకు పండించేవారు కాదు. అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ చైనా నుంచి తేయాకు కొనుగోలు చేస్తుండేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)