రోమన్లు మూత్రం మీద పన్ను వసూలు చేసేవారు.. ఎందుకు?

మూత్రంపై పన్ను

ఫొటో సోర్స్, Getty Images

మూత్రం పోస్తున్న ఈ పిల్లాడి విగ్రహానికి ఎంత పేరుందో మీకు తెలుసా?

బెల్జియంలోని బ్రసెల్స్‌లో ఉన్న దీనిని 'మాన్నెకెన్ పిస్' అంటారు. ఈ విగ్రహం ఒక చిన్న పిల్లాడిది. అది మూత్రం పోస్తూ కనిపిస్తుంది. దీన్ని చూడ్డానికి జనం దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు.

ఈ విగ్రహాన్ని బ్రసెల్స్ ప్రజలు, వారి హాస్య చతురతకు చిహ్నంగా భావిస్తారు.

మూత్రాన్ని ప్రాచీన కాలం నుంచీ రోగ నిర్ధరణ పరీక్షల కోసం ఉపయోగిస్తున్నారు. దీనితో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి.

చరిత్రలో మూత్రాన్ని మొట్టమొదట రోమ్ చక్రవర్తి టిటో ఫ్లేవిటో వెస్పాసియానో(క్రీస్తు శకం 9 నుంచి 79 వరకు) కాలంలో ఉపయోగించినట్టు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తడిపిన బట్టలపై నృత్యం చేస్తున్న రజకులు

చాకలి రేవులో నృత్యాలు

రోమన్ సామ్రాజ్యంలో చాకలి రేవు లేదా ఫులోనికస్‌లో మూత్రం సేకరించేవారు. దానిని అలాగే నిల్వ ఉంచేవారు. అది తర్వాత అమోనియాగా మారేది.

ఆ అమోనియా ఒక రకమైన డిటర్జెంట్‌లా పనిచేసేది. దానిని అప్పట్లో రజకులు బట్టలు ఉతికేందుకు ఉయోగించేవారు.

రోమన్ తత్వవేత్త, రచయిత సెనెకా "తెల్లటి ఉన్ని బట్టలను తడిపిన తర్వాత కూలీలు లేదా రజకులు వాటిపై ఎగిరేవారు లేదంటే డ్యాన్స్ చేసేవారు. బట్టల రంగు మెరవడానికి వాటి సున్నితత్వం పోగొట్టడానికి ముల్తానీ మట్టి, మూత్రం, సల్ఫర్ ఉపయోగించేవారు" అని చెప్పారు.

ఆ తర్వాత బట్టల కంపు పోగొట్టడానికి సువాసన వచ్చే డిటర్జెంట్ ఉపయోగించేవారు. వాటిలో బట్టలను నానబెట్టేవారు.

అయితే అలా చేయడం అంత ఆరోగ్యకరంగా ఉండేదికాదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రోమన్ చక్రవర్తి వెస్పాసియాన్ విగ్రహం

డబ్బుకు దుర్వాసన ఉండదు

రజకుల పని బాగా జోరుగా జరుగుతున్నప్పుడు, వెస్పాసియానో అధికారంలోకి రాగానే, మూత్రంపై పన్ను విధించాడు.

సీవేజ్ సిస్టమ్‌లో నిండిపోయిన మూత్రాన్ని ఉపయోగించాలని అనుకునే వారి నుంచి ఆయన ఆ పన్నులు వసూలు చేసేవారు.

వారిలో రజకులతోపాటు లెదర్ లేదా చర్మం పనిచేసేవారు కూడా ఉండేవారు.

జంతువుల చర్మాన్ని సున్నితంగా చేయడానికి, దానిని ఉడికించడానికి వారు కూడా మూత్రం ఉపయోగించేవారు.

ఎందుకంటే అమోనియాలో అధికంగా ఉండే పీహెచ్ సేంద్రీయ పదార్థాలను కరిగించేది.

మూత్రం జంతువుల చర్మాన్ని కరిగించడంతో పాటు దానిపైన వెంట్రుకలు, మాంసం ముక్కలు వేరు చేయడం సులభంగా ఉండేది.

రోమన్ చరిత్రకారుడు స్యూటోనియస్ "వెస్పాసియాన్ కొడుకు టిటో... మూత్రంపై పన్నులు వేయడం చాలా నీచమైన పనిలా అనిపిస్తోందని తండ్రితో అన్నాడు. సమాధానంగా చక్రవర్తి ఒక బంగారు నాణెం తీసుకుని టిటో ముక్కు దగ్గర పెట్టాడు. ఇది కంపు కొడుతోందా అని అడిగాడు. ఈ బంగారం ఆ మూత్రం వల్లే వస్తోంది అని కొడుక్కి చెప్పాడు" అని తెలిపాడు.

దీని నుంచే 'ఎక్జియం ఆఫ్ వెస్పాసియాన్' అనే ఒక నానుడి వచ్చింది. అంటే 'డబ్బు నుంచి ఎప్పుడూ దుర్గంధం రాదు' అని అర్థం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)