మీ ఫొటోకు లైక్ కొట్టినప్పుడు మీలో విడుదలయ్యే న్యూరోకెమికల్ ఇదీ

స్మార్ట్‌ఫోన్‌కు కళ్లెం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలనే స్పృహ అక్కడకక్కడా పెరుగుతోంది.

టెక్నాలజీని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు అని ఆలోచిస్తున్నారా? కొత్త సంవత్సరంలోకి వెళ్తున్న సందర్భంగా దీనిపై ఏదైనా తీర్మానం చేసుకొంటున్నారా?

వినియోగదారుల డేటా సంస్థ 'గ్లోబల్‌వెబ్‌ఇండెక్స్' జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఇంటర్నెట్ వాడే వ్యక్తులు సగటున రోజుకు ఆరున్నర గంటలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు.

థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, బ్రెజిల్ దేశాల్లోనైతే యూజర్లు తొమ్మిది గంటలకు పైనే ఆన్‌లైన్‌లో ఉంటున్నారు.

ఈ సర్వే ప్రకారం యూజర్లు ఆన్‌లైన్‌లో ఉండే సమయంలో మూడో వంతును సోషల్ మీడియాపై వెచ్చిస్తున్నారు.

శారీరక, మానసిక ఆరోగ్యంపై టెక్నాలజీ చూపే ప్రభావం గురించి శాస్త్ర పరిశోధనలు కొనసాగుతున్నాయి.

జంక్ టెక్

కెనడాలో పిల్లలు, కౌమార వయసువారి మానసిక ఆరోగ్యం అంశంలో నిపుణురాలైన డాక్టర్ షిమీ కాంగ్ బీబీసీతో మాట్లాడుతూ- యూజర్లలో ఆందోళన, కుంగుబాటు సమస్యలకు, టెక్నాలజీకి మధ్య సంబంధం ఉంటోందని తెలిపారు. శారీరకంగా ఎలా ఉన్నాం, ఎలా కనిపిస్తున్నాం అనే విషయాల్లో యూజర్లకు ప్రతికూల ఆలోచనలు కలగడానికీ టెక్నాలజీ వాడే తీరుకూ మధ్య సంబంధం ఉందన్నారు.

ఇంటర్నెట్‌ వాడకం యూజర్లకు వ్యసనంగా మారడంపై దృష్టి కేంద్రీకరించి ఆమె పనిచేస్తున్నారు.

ఆరోగ్యానికి మేలు చేయని జంక్ ఫుడ్ మాదిరే జంక్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అందువల్లే సరైన ఆహారం తీసుకోవడం లాగే 'సరైన టెక్నాలజీ వాడకం' కూడా ఒక ముఖ్యమైన అంశం.

వివిధ రకాల టెక్నాలజీలను ఆరోగ్యకరంగా వాడుకోవాలంటే ముందు అవి మన మెదళ్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాల్సి ఉంది.

మనం టెక్నాలజీని వాడినపుడు మెదడు సాధారణంగా ఆరు వేర్వేరు న్యూరోకెమికల్స్ శరీరంలోకి విడుదల చేస్తుంది. వీటిని సెరటోనిన్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్, డోపమీన్, అడ్రినలిన్, కార్టిసాల్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

యూజర్లలో ప్రధానంగా డోపమీన్ విడుదలయ్యేలా టెక్నాలజీని డిజైన్ చేస్తున్నారు.

సెరటోనిన్: ఏదైనా సృజనాత్మకంగా చేస్తున్నప్పుడు, ఇతరులకు ఏదైనా సాయం చేస్తున్నప్పుడు, ఇతరులతో అనుసంధానమై ఉన్నప్పుడు ఇది విడుదలవుతుంది.

ఎండార్ఫిన్: నొప్పిని దూరం చేసే, మనసుకు శాంతిని కలిగించే న్యూరో కెమికల్ ఇది. ధ్యానం చేసినప్పుడు, కృతజ్ఞత తెలిపినప్పుడు, హృదయ సంబంధ వ్యాయామం చేసినప్పుడు, పూర్తి చైతన్యంతో ఉన్నప్పుడు ఇది వెలువడుతుంది.

ఆక్సిటోసిన్: అర్థవంతంగా ఒకరికొకరు ఆలోచనలు పంచుకొన్నప్పుడు ఇది విడుదలవుతుంది. సాధారణంగా ఇది ఆరోగ్యకరమైనది. ఆన్‌లైన్‌లో దురుద్దేశాలతో ఉండేవారు దీనిని ఆసరాగా చేసుకొని అవతలివాళ్ల నమ్మకాన్ని దెబ్బతీస్తారు.

డోపమీన్: ఇదో సంతోషమయ న్యూరోకెమికల్. తక్షణ ప్రతిఫలం పొందినప్పుడు ఇది వెలువడుతుంది. అలవాటు వ్యసనంగా మారడానికి కూడా ఇది కారణం కాగలదు. యూజర్లలో ప్రధానంగా డోపమీన్ విడుదలయ్యేలా టెక్నాలజీని డిజైన్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Thinkstock

అడ్రినలిన్: భయం, ఆందోళన, ఒత్తిడి, కోపం, మరేదైనా ఉద్వేగంలోనో ఉన్నప్పుడు ఇది విడుదలవుతుంది. మీ ఫొటోలకు, పోస్టులకు, కామెంట్లకు ఇతరులు లైక్ కొట్టినప్పుడు, మిమ్మల్ని పోక్ చేసినప్పుడు, సోషల్ మీడియాలో ఇతర పోలికలు పెట్టుకున్నప్పుడు కూడా ఇది విడుదలవుతుంది.

కార్టిసాల్: తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు, ఏ మాత్రం తీరిక లేకుండా ఉన్నప్పుడు, ఏకాగ్రత కోల్పోతున్నప్పుడు ఇది వెలువడుతుంది.

ఈ న్యూరోకెమికల్స్‌ను బట్టి చూస్తే అన్ని రకాల టెక్నాలజీ వాడకం ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదని స్పష్టమవుతోంది.

సెరటోనిన్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ విడుదలకు కారణమయ్యే టెక్నాలజీ వాడకం ఆరోగ్యకరమైనదని డాక్టర్ షిమీ కాంగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ధ్యానం చేయడానికి సంబంధించిన యాప్‌లు, సృజనాత్మక యాప్‌లు, ఇతరులతో నిజంగా అనుసంధానమై ఉండేందుకు వీలు కల్పించే యాప్‌లను ఈ టెక్నాలజీకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

అలవాటు ఏర్పడటానికి కారణమయ్యే డోపమీన్ విడుదల ఎక్కువైతే వ్యసనం బారిన పడే ప్రమాదముంది.

''సృజనాత్మకతను పెంచే యాప్ ఒకటి ఉందనుకోండి. ఆ యాప్‌తో సినిమాలు తీయడం మీ పిల్లలకు చాలా ఇష్టమనుకోండి. దీనిని మొదట్లో మామూలుగా వాడే పిల్లలు ఇప్పుడు రోజుకు ఆరేడు గంటలు వాడుతున్నారంటే సమస్య తలెత్తినట్లే'' అని ఆమె వివరించారు.

ఈ యాప్ కాండీ క్రష్‌ మాదిరి జంక్ టెక్‌ కిందకు రాదని, అయినప్పటికీ దీని వినియోగానికి పరిమితులు పెట్టుకోవాల్సిందేనని ఆమె తెలిపారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు అతిగా తినే జంక్ ఫుడ్ మాదిరి అతిగా వాడే టెక్నాలజీని జంక్ టెక్ అంటారని చెప్పారు.

జంక్ టెక్‌ను అతిగా వాడితే స్వీయ నాశనానికి దారితీస్తుందని డాక్టర్ షిమీ కాంగ్ హెచ్చరించారు.

పోర్నోగ్రఫీ ఎక్కువగా చూడటం, సైబర్ బుల్లీయింగ్‌కు పాల్పడటం, ఆన్‌లైన్ జూదం ఆడటం, విద్వేషపూరిత ప్రసంగాలు వినడం, ఆడేవాళ్లను వ్యసనపరులుగా మార్చే స్లాట్ మెషీన్ వంటి వీడియో గేమ్‌లను అతిగా ఆడటం యూజర్లకు చాలా ప్రమాదకరమని ఆమె తెలిపారు. ఇలాంటి టెక్నాలజీ విషపూరిత టెక్ కిందకు వస్తుందని వ్యాఖ్యానించారు. వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని సూచించారు.

ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, మినహాయింపులు పెట్టుకుంటామో టెక్నాలజీ విషయంలోనూ అలాగే వ్యవహరించాలని ఆమె చెప్పారు.

ఆందోళన, కుంగుబాటు, వ్యసనపరులు కావడమనే విషయాల్లో కుటుంబానికి గత చరిత్ర ఉన్నా, సమయపాలన పాటించలేకపోవడమనే సమస్య ఉన్నా జాగ్రత్త పడాలని ఆమె తెలిపారు. టీనేజర్లకు ఈ ముప్పు ఎక్కువని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

టెక్ డైట్

టెక్నాలజీ అతి వినియోగం వల్ల వచ్చే సమస్యల దృష్ట్యా ఇంటర్నెట్ వాడకాన్ని, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించుకోవాలనే స్పృహ కూడా అక్కడకక్కడా పెరుగుతోంది.

అమెరికా, బ్రిటన్‌లలో ప్రతి పది మంది ఇంటర్నెట్ యూజర్లలో ఏడుగురు తాము ఏదో ఒక రూపంలో టెక్నాలజీ వాడకాన్ని తగ్గించుకొంటున్నామని చెప్పారని గ్లోబల్‌వెబ్‌ఇండెక్స్ తెలిపింది. వీరిలో కొందరు సాధ్యమైనంత దూరం జరుగుతున్నామని చెప్పారని పేర్కొంది. వీరు సోషల్ మీడియా ఖాతాలను తొలగించుకోవడం, వివిధ యాప్‌లను తీసేయడం లాంటివి చేస్తున్నారు.

టెక్నాలజీని వాడేటప్పుడు మనిషి ఇతర కనీస అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని డాక్టర్ షిమీ కాంగ్ స్పష్టం చేశారు.

''మనం రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటలు నిద్రపోవాలి. రెండు మూడు గంటలు శరీరం చురుగ్గా కదలాలి. కాసేపు బయటకు వెళ్లి సహజమైన కాంతిలో ఉండాలి. ఈ కార్యకలాపాలన్నీ ఉండాలి. ఇవన్నీ సరిగా చేయకుండా కేవలం టెక్నాలజీని అత్యుత్తమంగా వాడితే సరిపోదు'' అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్,

సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడటం ఎలా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)